తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త టీమ్ వస్తోందా? జిల్లాలకు నయా బాస్‌లు రాబోతున్నారా? పనిచేయని వారికి గేట్ పాసేనా? ఈ విషయంలో AICC ఆలోచనలేంటి? పీసీసీ చీఫ్ చేస్తున్న కూడికలు.. తీసివేతలు ఏంటి?
మూడు రోజులుగా ఢిల్లీలో రేవంత్
రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టాక నూతన పిసిసి కమిటీ ఏర్పాటుకు ముహూర్తం కుదరటం లేదు. ఏడాదిగా కొత్త కమిటీ కూర్పు వాయిదా పడుతూనే వస్తోంది. కార్యదర్శులు.. ప్రధాన కార్యదర్శుల నియామకానికి గతంలో కసరత్తు చేశారు. ఇప్పటికీ అది కొలిక్కి రాలేదు. మూడు రోజులుగా రేవంత్ ఢిల్లీలో మకాం వేశారు. ముందుగా గ్రేటర్ హైదరాబాద్‌లో అధ్యక్షులు.. పిసిసిలో ప్రధాన కార్యదర్శులు.. కార్యదర్శులు పోస్టుల భర్తీకి డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అయితే అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయాలన్నది సీనియర్ల డిమాండ్.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు పిసిసి కార్యవర్గంలో తమకు ప్రాధాన్యం కల్పించాలని కోరుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌లను .. సీఎల్పీ నేత భట్టిని కలిసి వినతి పత్రాలను ఇచ్చారు కూడా. పార్టీ పదవుల్లో అవకాశం కల్పించకపోతే గాంధీభవన్ ముందు ధర్నా చేస్తామని వారు హెచ్చరించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏడాదిలో తెలంగాణలో సాధారణ ఎన్నికలు జరుగుతాయి. దానిని దృష్టిలో పెట్టుకునైనా పీసీసీ కమిటీ ఏర్పాటు చేయాలనే అభిప్రాయం ఉంది. అందుకే మూడు రోజులుగా రేవంత్ హస్తినలో కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
పనితీరు ఆధారంగా డీసీసీలలో మార్పు
పీసీసీ కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శులు.. కార్యదర్శుల పోస్టులను కీలకంగా చేయాలని చూస్తున్నారట. అలాగే కార్యదర్శి పదవులను పెంచాలనుకుంటున్నారట. 119 నియోజకవర్గాలకు ఒకరు లేదంటే ఇద్దరు చొప్పున ఇన్చార్జిలను నియమించాలని ప్లాన్ చేస్తున్నారు. దీనికి పార్టీలో ఎంతవరకు ఆమోదం లభిస్తుందనేది ప్రశ్న. పిసిసి కార్యవర్గం ఎలా ఉన్నా జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించాలన్నది మరో వాదన. చాలా రోజులుగా డిసిసిలుగా కొనసాగుతున్న నాయకులను తప్పిస్తారనే ప్రచారం ఉంది. సగానికిపైగా డీసీసీలను వర్క్ పర్ఫామెన్స్ ఆధారంగా కొనసాగించడం లేదా.. ఇంటికి సాగనంపాలని అనుకుంటున్నారట. పిసిసి కార్యాచరణను అమలు చేస్తూ.. పార్టీ బలోపేతానికి పనిచేసిన వారికి తిరిగి అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఉందట.
ఉన్న వారిని పదవుల నుంచి తొలగిస్తే కొత్త రగడ తప్పదా?
రేవంత్ మాత్రం ఇప్పుడున్న వారిలో కొందరిని మార్చి.. నాలుగైదు జిల్లాలకు కొత్త సారథులను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. అయితే ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. మాజీ ఎమ్మెల్యేలు ఆ స్థాయిలో ఉండే నాయకులనే డిసిసిలుగా నియమిస్తే బాగుంటుందనే ప్రతిపాదన ఉందట. ఇప్పటికే పార్టీలో అసంతృప్తులు ఎక్కువయ్యారు. అలాంటిది డిసిసిలను తప్పిస్తే అది కొత్త పంచాయతీకి దారితీస్తుందనే అనుమానాలు ఉన్నాయట.
ఎన్నికల టీమ్ కూర్పుపై ఆసక్తి
గ్రేటర్ హైదరాబాద్‌ని కూడా సంస్థాగతంగా కాంగ్రెస్ మూడు ముక్కలు చేసింది. ఈ మూడింటికి అధ్యక్షులను నియమించాలి. ఖైరతాబాద్ విభాగానికి రేవంత్ సన్నిహితుడు రోహిన్ రెడ్డికి అప్పగించే అవకాశం ఉంది. ఇక సికింద్రాబాద్ విభాగానికి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కి.. పాతబస్తి బాధ్యతలు ఫిరోజ్ ఖాన్ కి ఇస్తారనే ప్రచారం పార్టీలో ఉంది. మరి.. ఎన్నికల టీమ్ కూర్పు ఏ విధంగా ఉంటుందో.. పార్టీకి ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.