టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై పీసీసీతోపాటు కేడర్ కూడా క్షేత్రస్థాయిలో గురి పెట్టిందా? అందుకే సడెన్‌గా ఎమ్మెల్యేల క్యాంప్ కార్యాలయాలకు భద్రత పెంచారా? కేసులు పెడుతున్నా.. కాంగ్రెస్ కేడర్ ఎందుకు దూకుడుగా వెళ్తోంది? ఈ వైఖరి ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు వర్కవుట్ అవుతుందా?
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ కేడర్ గురి..!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా కాంగ్రెస్ గేర్ మార్చి దూకుడు పెంచింది. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవగా.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని టీడీపీ రెండుచోట్ల.. మరో నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడంతో.. హస్తంగుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు అధికారానికి దూరంగా ఉండలేకపోయారు. శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, హరిప్రియా నాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి గులాబీ గూటికి వెళ్లిపోయారు. టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావులది అదే పరిస్థితి. ఇంక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సంగతి సరేసరి. భట్టి విక్రమార్క, పొదెం వీరయ్యలు మాత్రమే కాంగ్రెస్ శాసనసభ్యులుగా కొనసాగుతున్నారు. వీరిలో భట్టి సీఎల్పీ నేత. జంప్ జిలానీలపై 2018 నుంచి చర్చ జరుగుతున్నా.. ఇటీవల పీసీసీకి కొత్త కమిటీ వచ్చాక రచ్చ మొదలైంది. కేడర్ కూడా వారిపై గురిపెట్టింది. ఈ సందర్భంగా జరుగుతున్న పరిణామాలే ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.
ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీస్‌లపై కాంగ్రెస్ జెండాలు
దళిత గిరిజన దండోరా కార్యక్రమాల్లో భాగంగా ప్రదర్శనలు.. ర్యాలీలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ కేడర్.. ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావుల క్యాంప్ కార్యాలయాలపై పార్టీ జెండాలు ఎగరేసింది. కాంగ్రెస్ జెండాలు ఎగరేసిన వారిపై పోలీసులు కేసులు పెట్టినా కేడర్ వెనక్కి తగ్గడం లేదట. రోజుకోచోట ఉద్యమాలకు ప్లాన్ వేస్తున్నారట. దీంతో టీఆర్ఎస్‌లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, హరిప్రియా నాయక్, కందాల ఉపేందర్‌రెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర భద్రత పెంచారు. క్యాంప్ ఆఫీసుల దిశగా కాంగ్రెస్ శ్రేణులు రాకుండా కాపు కాశారట.
గోడ దూకిన టీడీపీ ఎమ్మెల్యేపైనా కేడర్ గుర్రు!
ఒక్క కాంగ్రెస్ నుంచి గెలిచిన వారే కాకుండా.. కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలను కూడా కేడర్ టార్గెట్ చేయడం ప్రస్తుతం చర్చగా మారింది. మెచ్చా నాగేశ్వరావు నిన్న మొన్నటి వరకు సైకిల్ దిగబోనని ప్రకటించినా.. ఆయన కూడా గులాబీ కండువా కప్పేసుకోవడంతో కాంగ్రెస్ కేడర్ ఆగ్రహంతో ఉన్నట్టు చెబుతున్నారు. అశ్వరావుపేటలోని టీడీపీ శ్రేణులు కూడా మెచ్చాపై కుతకుతలాడుతున్నట్టు సమాచారం. ఈ నియోజకవర్గాల్లో ఎప్పుడేం జరుగుతుందో.. విపక్ష పార్టీల కేడర్ ఎప్పుడెలా రియాక్ట్ అవుతుందో తెలియక టెన్షన్ పడుతున్నారట.