Tirupati Crime: టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ముగ్గురిని హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకోవడం తిరుపతి పద్మావతి నగర్‌లో కలకలం రేపుతోంది. అన్నమీద కోపంతో ఓ తమ్ముడు.. వదినతో పాటు, వారి ఇద్దరి కూతుళ్లను కిరాతకంగా నరికి చంపిన ఘటన పద్మావతి వర్సిటీ సమీపంలోని పద్మావతి నగర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. హత్య చేసిన అనంతరం ఆ వ్యక్తి కూడా ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గుడిమెట్ల మోహన్(36) ఈ దారుణానికి పాల్పడ్డాడు. నెల్లూరుకు చెందిన గుడిమెట్ల తిరుపతిదాస్ రెండేళ్ల క్రితం కుటుంబంతో వచ్చి తిరుపతి పద్మావతి నగర్‌లో నివాసం ఉంటున్నాడు. తిరుపతి దాస్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Read Also: Rain Alert : బయటికి రావొద్దు… రాజధానిలో మూడు గంటల పాటు దంచికొట్టనున్న వాన
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న మోహన్‌కు అన్నావదినలు కలిసి 2019లో పెళ్లి చేశారు. . పెళ్లై ఓ కుమార్తె పుట్టిన తర్వాత మోహన్‌కు, అతని భార్యకు మధ్య గొడవలు జరగడంతో 2021లో అతని భార్య పుట్టింటికి వెళ్లి పోయింది. అనంతరం వారి మధ్య రాజీ కుదిర్చి.. తమ్ముడి భార్య తల్లిదండ్రులతో మాట్లాడి ఇద్దరూ కలిసి కాపురం చేసుకునేలా చేశాడు తిరుపతిదాస్. రాజీ చర్చల సమయంలో తనకు ఇష్టంలేని పెళ్లి చేసి, మనశ్శాంతి లేకుండా చేశావంటూ అన్నపై తమ్ముడు దాడి చేశాడు. ఆపై రాజీ కుదరడంతో మోహన్ భార్య కాపురానికి వచ్చింది. కాపురానికి వచ్చిన కొన్ని రోజులకే మళ్లీ గొడవలు ప్రారంభం కావడంతో మళ్లీ తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో చెన్నైలో ఉద్యోగం చేస్తున్న మోహన్ అప్పుడప్పుడు తిరుపతిలోని అన్న ఇంటికి వచ్చి ఉండేవాడు. 2 రోజుల క్రితం మోహన్. చెన్నై నుంచి తిరుపతి వచ్చాడు. బుధవారం సాయంత్రం పాఠశాల నుంచి పిల్లలను ఇంటికి తీసుకువచ్చాడు తిరుపతిదాస్. ఈ క్రమంలోనే పిల్లలను ఇంట్లో దించిన తర్వాత దాస్ బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత అన్న ఇంట్లో లేని సమయంలో ఇంటికి కత్తితో వచ్చి వదిన, పిల్లలపై దాడి చేశాడు. వదిన సునీతను హత్య చేసిన మరిది మోహన్.. ఆపై 8, 6వ తరగతి చదువుతున్న ఆమె ఇద్దరు పిల్లలు దేవీశ్రీ, నీరజలను హతమార్చాడు. అనంతరం మోహన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
Read Also: AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. పోలవరం విషయంలో కీలక చర్చ
కొంచెం సేపటికి ఇంటికి తిరిగొచ్చిన తిరుపతి దాస్.. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో బయటకు వెళ్లి ఉంటారని భావించాడు. గంట తర్వాత కూడా వారు రాకపోవడంతో అనుమానంతో ఇంటి వెనుక నుంచి చూసే సరికి రక్తపు మడుగులో పడి ఉన్న భార్యా పిల్లల్ని చూసి కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో దాస్ భార్య సునీత(35), కుమార్తెలు దేవిశ్రీ(13), నీరజ(11) హత్యకు గురయ్యారు. నిందితుడు మోహన్ హత్యలు చేసిన అనంతరం అక్కడే గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. క్లూస్ టీమ్ సిబ్బంది హత్యలు జరిగిన చోట ఆధారాలు సేకరిస్తున్నారు. తిరుపతి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎస్పీ సుబ్బరాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ చేపట్టామని ఏఎస్పీ కులశేఖర్ తెలిపారు. పెళ్లై ఓ బిడ్డ పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలతో విడిపోవడం, అన్న కుటుంబం సంతోషంగా ఉండటంతో వారిపై కక్ష పెంచుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇష్టం లేని పెళ్లి చేశాడని తరచూ అన్నతో గొడవ పడేవాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.