Thopudurthi Prakash Reddy: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. మధ్యంతర బెయిల్‌పై విడుదల వ్యవహారంలో సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. చంద్రబాబు విడుదల సందర్భంగా టీడీపీ నాయకులు జంతు బలి ఇవ్వడం దారుణం అన్న ఆయన.. కోర్టులు ఎక్కడా చంద్రబాబు నేరం చేయలేదని చెప్పలేదు.. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ శ్రేణులు మాత్రం విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని మండిపడ్డారు.. ఇంతకీ చంద్రబాబు విషయంలో న్యాయం గెలిచిందా..? రోగం గెలిచిందా? అంటూ ఎద్దేవా చేశారు. మానవతాదృక్పదంతోనే కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని.. చంద్రబాబు చిత్ర పటానికి పొట్టేళ్ళను బలి ఇచ్చి.. రక్తం పూసి హేయమైన కార్యక్రమాలు చేస్తున్నారు.. చంద్రబాబు బయటకు రాగానే జంతు బలులు ఇస్తున్నారు.. చంద్రబాబుకు అధికారం వస్తే ఇంకెంత మందిని బలి ఇస్తారో? అని విమర్శలు గుప్పించారు.
శాశ్వతంగా జైలులో ఉండాల్సిన చంద్రబాబు.. నాలుగు వారాలు వైద్యం కోసం మాత్రమే బయటకు వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు తోపుదుర్తి.. చంద్రబాబు ఇంకొక పదిహేనేళ్లు బతకాలి.. వైఎస్ జగన్ సీఎంగా ఉండాలన్నారు. చంద్రబాబు బతికి ఉన్నంత కాలం.. ప్రజలు వైఎస్ జగన్ ను సీఎంగా గెలిపిస్తారు అని జోస్యం చెప్పారు. వైద్యం కోసం బయటకు వచ్చిన చంద్రబాబు తిరిగి ఆరోగ్యంగా జైలుకు వెళ్లాలని సెటైర్లు వేశారు. 2024 కురుక్షేత్ర యుద్దంలో కౌరవులకు పట్టిన గతే.. టీడీపీకి పడుతుందన్నారు. తప్పు చేసిన వాళ్లు బయట తిరిగితే.. ప్రజాస్వామ్యం మీద నమ్మకం పోయి.. ఈ దేశం పాకిస్థాన్ లా తయారవుతుంది అంటూ సంచలన కామెంట్లు చేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.