మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025 వేలంకి ముహూర్తం ఖరారైంది. బెంగళూరులో డిసెంబరు 15న మినీ వేలం నిర్వహించనున్నారు. ప్రతి ఫ్రాంచైజీకి రూ.15 కోట్ల బడ్జెట్ కేటాయించారు. గత సీజన్ రూ.13.5 కోట్లు ఉండగా.. ఈసారి 1.5 కోట్లు పెరిగింది. ఏడుగురు ఆటగాళ్లను విడుదల చేసినందున గుజరాత్ జెయింట్స్ వద్ద అత్యధికంగా రూ.4.4 కోట్లు ఉన్నాయి. ఛాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ.3.25 కోట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.2.5 కోట్లు ఉన్నాయి.
ఈసారి వేలంలో హీథర్ నైట్, లీ తహుహు, నాడిన్ డి క్లెర్క్, స్నేహ్ రాణా, డియాండ్ర డాటిన్, లారెన్ బెల్, పూనమ్ యాదవ్, వేద కృష్ణమూర్తి ఉన్నారు. వేలానికి ముందు ఫ్రాంచైజీల మధ్య జరిగే బదిలీల గడువు ముగియగా.. ఒక్క బదిలీ మాత్రమే జరిగింది. యూపీ వారియర్స్ నుంచి ఒక్క డ్యానీ వ్యాట్ (ఇంగ్లండ్)ను ఆర్‌సీబీ తీసుకుంది.
గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్ టీమ్స్ డబ్ల్యూపీఎల్ 2025లో తలపడనున్నాయి. గతేడాది ఆర్‌సీబీ కప్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ రన్నరప్‌గా నిలిచింది. ఐపీఎల్ 2025 ముందు డబ్ల్యూపీఎల్ 2025 జరగనుంది. ఇటీవలే ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసిన విషయం తెలిసిందే.