Gold Smuggling: పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగణాస్ జిల్లాలో బంగ్లాదేశ్ నుంచి 27 బంగారు కడ్డీలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్న ఓ మహిళను సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) గురువారం అరెస్టు చేసింది. స్వాధీనం చేసుకున్న బంగారు కడ్డీల బరువు 2 కిలోల కంటే ఎక్కువ. దాని విలువు దాదాపు రూ.1.29 కోట్లు ఉంటుందని అంచనా. మాణికా ధర్ (34)గా గుర్తించిన స్మగ్లర్ 27 బంగారు కడ్డీలను గుడ్డలో దాచి నడుముకు కట్టుకుంది. ఆమె బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ జిల్లాకు చెందిన మహిళగా అధికారులు గుర్తించారు.
Read Also: Woman Suicide: బ్యూటీపార్లర్‌కు వెళ్లనివ్వడం లేదని భార్య ఆత్మహత్య
బంగ్లాదేశ్‌కు చెందిన స్మగ్లర్ బంగారంతో సరిహద్దు దాటబోతున్నట్లు భారత చెక్‌పోస్టు వద్ద మోహరించిన బీఎస్‌ఎఫ్ మహిళా సిబ్బందికి సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న మహిళా జవాన్లు అనుమానం వచ్చిన వ్యక్తిని ఆపి సోదా చేయగా.. ఆమె దుస్తులలో దాచిపెట్టిన బంగారు బిస్కెట్లు కనిపించాయి. విచారణలో, పశ్చిమ బెంగాల్‌లోని బరాసత్‌లో గుర్తు తెలియని వ్యక్తికి బంగారు కడ్డీలను డెలివరీ చేయమని ఆమెకు సూచించినట్లు స్మగ్లర్ అంగీకరించింది. బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం ఇదే మొదటిసారి అని, ఆ పని కోసం రూ.2,000 అందుకోబోతున్నానని కూడా ఆమె అంగీకరించింది.స్మగ్లర్, స్వాధీనం చేసుకున్న బంగారు కడ్డీలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం కస్టమ్ ఆఫీస్ పెట్రాపోల్‌కు అప్పగించారు. సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్, బీఎస్‌ఎఫ్ ప్రతినిధి ఒకరు జవాన్ల అప్రమత్తతను మెచ్చుకున్నారు. స్మగ్లర్లను అడ్డుకోవడంలో వారు సాధించిన విజయంపై సంతృప్తిని వ్యక్తం చేశారు.