సినీ నటుడు విజయ్ ఆంటోనీకి ఏ తండ్రికి రాకూడని పెద్ద కష్టం వచ్చింది. ఆయన పెద్ద కుమార్తె మీరా ఇటీవల ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. కారణం ఏంటో తెలియదు కానీ ఆమె చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆంటోని కుటుంబం మొత్తం బాధలో కూరుకుపోయింది. మొత్తం కుటుంబం శోకసంద్రంలో ఉన్నప్పటికీ విజయ్ ఆంటోనీ మాత్రం తన వృత్తి ధర్మాన్ని మరచిపోలేదు. తన కొత్త సినిమా ‘రత్తం’ విడుదల ఆపకూడదని ఆయన సూచించారు. తన సమస్య కారణంగా సినిమా ఆగిపోతే నిర్మాతలు నష్టపోతారని భావించిన విజయ్ ఆంటోని సినిమాను అనుకున్న తేదీకే విడుదల చేయాలని చెప్పారట. ఎందుకంటే అక్టోబర్ 6న ఈ చిత్రాన్ని తమిళ్ లో విడుదల చేయాలని నిర్ణయించిన చిత్ర యూనిట్ దాని కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంది.
రెండు వారాల క్రితం నుంచే రత్తం సినిమా ప్రమోషన్లు మొదలుపెట్టారు. బిజినెస్ డీల్స్ తో పాటు థియేటర్లను కూడా ముందస్తుగానే లాక్ చేసుకున్నారు. తీరా ఇలాంటి సమయంలో సినిమా వాయిదా పడితే నిర్మాతకు భారీగా నష్టం వస్తుంది. అందుకే అలా జరగకూడదని కూతురు చనిపోయిన బాధలో ఉన్నప్పుడు కూడా విజయ్ ఆంటోని ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. చెన్నైలో తీవ్ర సంచలనం సృష్టించిన వరుస హత్యల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ వరుస హత్యల కారణంగా చెన్నైలో పెద్ద రాజకీయ దుమారమే చెలరేగింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సీఎస్ ఆముధన్ ప్రతి సన్నివేశాన్ని ఆకట్టుకునే విధంగా తెరకెక్కిచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్ ఆంటోని పాత్ర ఆకట్టుకునే విధంగా ఉంది. ఆయన గడ్డంతో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. ఈ సినిమాలో నందితా శ్వేత జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది.