కాళేశ్వరం విషయంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్ లో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏడాదికి కరెంట్ బిల్లే రూ.10 వేల కోట్లు అవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పరీక్షలు కూడా చేయలేదని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కల్లకుంట్ల చంద్రశేఖర్ రావు హెలికాప్టర్లో తిరుగుతూ.. ఆ ప్రదేశాన్ని చూపించి ఇక్కడ బ్యారేజీ కట్టండి.. ఇక్కడ ఇంకో బ్యారేజీ కట్టండి అని నిర్ణయించినట్లు వ్యాఖ్యానించారు. కేసీఆర్ తన దోస్తుకు ప్రాజెక్టు పనులు అప్పగించారని ఆరోపించారు. ఒకే మనిషి చీఫ్ డిజైనర్, చీఫ్ కన్ష్రక్టర్, చీఫ్ ప్లానర్, చీఫ్ క్వాలిటీ కంట్రోలర్ కావడంతో ఇప్పుడు ఈ దుస్థితి ఏర్పడిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లాగా నోటి కొచ్చింది మాట్లాడటం లేదని అన్ని వివరాలు అధికారికంగా చెబుతానన్నారు. మేడిగడ్డ కుంగినప్పుడు ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదా.. అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఏం చేసిందని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్లను వదిలేసి కాళేశ్వరం కట్టారని.. కమీషన్ల కోసం కక్కుర్తి పడి రూ. 38వేల కోట్ల ప్రాజెక్టును రూ. 80 వేల కోట్లకు తీసుకెళ్లారన్నారు.
READ MORE: PM Modi: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి మోడీ ఫోన్.. విషయం ఏంటంటే..?
మేడిగడ్డ బ్యారేజీ కమీషన్ల వల్ల విఫలమైందని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ విషయంపై నేషనల్ డ్యామ్ సెస్టీ అథారిటీ (NDSA) కి లేఖ రాసినట్లు వెల్లడించారు. బ్యారేజీ వద్దకు వచ్చి పరీక్షించిన అధికారులు ఇంకా రిపోర్టు ఇవ్వలేదని స్పష్టం చేశారు. తానే స్వయంగా వారి వద్దకు వెళ్లి రిపోర్టు త్వరగా ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఇంతకీ ఆ బ్యారేజీని రిపేర్ చేయడం కుదుకుతుందా.. లేదా అని అడిగినట్లు వెల్లడించారు. ఇంకో వారం రోజుల్లో నివేదిక వస్తుందని స్పష్టం చేశారు. కమిటీ నుంచి ప్రాథమిక రిపోర్టు వచ్చిన వెంటనే తరువాత కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఇప్పటి వరకు విద్యుత్తు ఉపయోగం ఇప్పుడే ఎక్కువగా ఉందన్నారు. పండిన ప్రతి గింజ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.రాష్ట్రంలో ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత యాక్టివ్ గా ఎప్పుడు ఏ ప్రభుత్వం లేదన్నారు. రాష్ట్రంలో కరువుపై ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఈ కరువును వదిలి వెళ్లారన్నరు. సాగు, తాగు నీరు విషయంలో ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్య మంత్రి హయాంలో నిరంతరం రెవ్యూ చేస్తున్నట్లు తెలిపారు.