మంత్రులు, కార్యదర్శులతో సీఎం సమావేశం:
మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు భేటీ జరగనుంది. రెండు సెషన్‌లుగా ఈ సమావేశం జరగనుంది. మొదటి సెషన్‌లో ఫైళ్లు క్లియరెన్సు, వాట్సప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, జీఎస్డీపీపై చర్చ జరగనుంది. రెండో సెషన్‌లో కేంద్ర బడ్జెట్ సహా త్వరలో ప్రవేశపెట్టే ఏపీ బడ్జెట్‌పై మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిచనున్నారు. శాఖల వారీగా ప్రగతి, మేనిఫెస్టో అమలు, స్వర్ణాంధ్ర 2047పై కూడా చర్చించనున్నారు. సోమవారం మధ్యాహ్నం లోగా సెక్రెటరీలు తమ శాఖలకు సంబంధించి రెండు ప్రెజెంటేషన్స్ పంపాలని సీఎస్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ప్రాధాన్యాలు గుర్తించి అందుకు అనుగుణంగా సెక్రెటరీలు తమ ప్రెజెంటేషన్ 15 నిమిషాలు ఉండేలా తయారు చేసుకోవాలని సీఎస్ ఆదేశించింది.
ధార్ గ్యాంగ్ గుంటూరు జిల్లాలో మకాం:
ప్రమాదకరమైన ధార్ గ్యాంగ్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో మకాం వేసిందా.. వరుస దొంగతనాలు ఆ గ్యాంగ్ పనేనా..? పల్నాడు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది ఈ ప్రశ్న.. పగలంతా రెక్కీ చేస్తారు, తాళాలు వేసిన ఇళ్లకు కాపలా పడుకుంటారు.. సరిగ్గా సమయం కుదిరింది అనుకుంటే ఇల్లు గుల్ల చేసేస్తారు.. సెల్ఫోన్ వాడరు, సిగ్నల్ దొరకనివ్వరు, తమ మొహాలు కనపడనివ్వరు.. అసలు పగలు వీళ్ళని చూస్తే వీళ్ళ దొంగలు అన్నట్లు ఉంటారు.. రాత్రి అయ్యిందంటే ప్రత్యేక ముసుగులతో ఇళ్ళ మీద పడిపోతారు.. ఎంత సైలెంట్ గా వచ్చారో, అంత వైలెంట్ గా పని కానించి వెళ్లిపోతారు.. ప్రధానంగా జాతీయ రహదారులకు సమీపంలో ఉండే గ్రామాలను టార్గెట్ చేస్తారు.. ఇదే ఈ గ్యాంగ్ స్టైల్.. మధ్యప్రదేశ్ లో ఉండే ఈ గ్యాంగ్ గురి చూసి కొట్టిందంటే, దేశంలోని ఏ గ్రామమైన వణికి పోవాల్సిందే.. అలాంటి దెబ్బే ప్రస్తుతం పల్నాడు జిల్లాకు తగిలింది… సంక్రాంతి పండుగ సందర్భంగా ఇళ్లకు సొంతిళ్లకు బంధువులకు వెళ్లిన 17 కుటుంబాలను టార్గెట్ చేసి వాళ్ల ఇళ్ళను గుల్ల చేసేసారు ఈ గ్యాంగ్.
ఆస్తికోసం మనవడు రాసిన మరణ శాసనం:
హైదరాబాద్‌లోని పంజాగుట్టలో పారిశ్రామికవేత్త వెలమాటి చంద్రశేఖర్ హత్య ఘటన నగరాన్ని తీవ్ర కుదిపేసింది. కుటుంబ ఆస్తుల కోసం జరిగిన ఈ హత్యలో చంద్రశేఖర్ సొంత మనవడు కీర్తి తేజ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. 73 సార్లు కత్తితో పొడిచి తన తాతను హతమార్చిన కీర్తి తేజ, తండ్రి లేని కుటుంబంలో తాత ఇతర మనవళ్లను చూసినట్లుగా తనను చూడలేదని భావించి ఈ హత్యకు పాల్పిడినట్లు తెలుస్తోంది. వెలమాటి చంద్రశేఖర్ తన కంపెనీలో ఇటీవల ఒక మనవడికి డైరెక్టర్ పదవి ఇవ్వగా, కీర్తి తేజ కూడా అదే పదవిని డిమాండ్ చేశాడు. అమెరికాలో స్థిరపడిన కీర్తి తేజ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. చెడు వ్యసనాలపై మోజు పడిన కీర్తి తేజను చూసి చంద్రశేఖర్ అతనికి డైరెక్టర్ పదవి ఇవ్వడానికి నిరాకరించారు. ఈ నిర్ణయంతో కోపంతో రగిలిపోయిన కీర్తి తేజ, చంద్రశేఖర్‌ను 73 సార్లు కత్తితో పొడిచి చంపాడు.
ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థులకు బిగ్ షాక్:
హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వివిధ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యార్థులు రాస్తుంటారు. ఉన్నత చదువులు చదవాలంటే ప్రవేశ పరీక్షలు రాయాల్సిందే. ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తైన విద్యార్థులు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ వంటి కోర్సులను చదివేందుకు ఎప్‌సెట్, ఎడ్‌సెట్, ఐసెట్ వంటి ప్రవేశ పరీక్షలను రాస్తుంటారు. ఈ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా సీట్ కేటాయిస్తుంటారు. అయితే ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థులకు బిగ్ షాక్ ఇచ్చింది సెట్ కమిటీ. ఇకపై 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ లో నిమిషం ఆలస్యమైనా అనుమతించకూడదని నిబంధన అమల్లో ఉన్న విషయం తెలిసిందే. నిమిషం ఆలస్యం కారణంగా విద్యార్థులు పరీక్షలు రాయకుండా వెనుదిరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎగ్జామ్ టైమ్ కి 15 నిమిషాల ముందు వచ్చిన విద్యార్థులను సెంటర్ లోనికి అనుమతిస్తామని సెట్ కమిటీ స్పష్టం చేసింది. ఇకపై 15 నిమిషాల ముందే గేట్లు క్లోజ్ చేయనున్నట్లు తెలిపింది. విద్యార్థులు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్ సెంటర్ కు ముందుగానే చేరుకోవాలని సూచించారు.
టోలిచౌకిలో కాల్పుల కలకలం:
హైదరాబాద్ హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూ వివాదానికి సంబంధించి టోలిచౌకీలో రెండు గుంపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శనివారం రాత్రి 11:30 ప్రాంతంలో గోల్కొండకు చెందిన షకీల్ కొంతమంది వ్యక్తులతో కలిసి టోలిచౌకీలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అక్తర్ ఇంటికి వెళ్లి గొడవ చేసినట్లు సమాచారం అందిందని డీఐ బాలకృష్ణ తెలిపారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని, ప్రాథమిక విచారణలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తప్ప గన్ ఫైర్ జరిగినట్లుగా ఎలాంటి ఆనవాలు లేవని డీఐ బాలకృష్ణ స్పష్టం చేశారు.
ఆప్ చేసిన తప్పు ఇదేనా?:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. అయితే ఆప్ ఓటమికి స్వయంకృత అపరాధమే కారణమని తెలుస్తోంది. ఇండియా కూటమిలో ఒక్కటిగా ఉన్న ఆప్, కాంగ్రెస్.. విడివిడిగా పోటీ చేయడమే ప్రధాన లోపంగా కనిపిస్తోంది. కేవలం స్వల్ప ఓట్ల తేడాతో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి కొంత మంది ముఖ్యమైన నేతలు ఓడిపోయారు. ఆ స్థానాల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లతో ఈజీగా ఆప్ అభ్యర్థులు గట్టెక్కేవారు. కానీ వేర్వేరుగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయాయి. దీంతో బీజేపీ అభ్యర్థులు ఈజీగా గట్టెక్కేశారు. మేజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తిగా మారారు.
కేజ్రీవాల్ రైజ్ అండ్ ఫాల్:
జన్‌లోక్‌పాల్ అన్నాడు! అవినీతికి వ్యతిరేకం అన్నాడు! చివరికి అదే అవినీతి ఊబిలో కూరుకుపోయాడు! అది 2011 సంవత్సరం. ఢిల్లీ జంతర్‌మంతర్. అవినీతికి వ్యతిరేకంగా జన్‌లోక్‌పాల్ వ్యవస్థను తీసుకురావాలని అన్నాహజారే దీక్ష చేస్తున్న రోజులవి. అదే వేదికపై పెద్దసైజు కళ్లద్దాలు పెట్టుకొని, ఓ వ్యక్తి అటూఇటూ హడావిడిగా తిరుగుతున్నాడు. సగటు మధ్యతరగతి మనిషిలా ఉండే, ఆ మిడల్ ఏజ్డ్ పర్సన్ మీడియాను ఆకర్షించాడు. యువకులను ఆలోచింపజేశాడు. సీనియర్ సిటిజన్ల దృష్టిలో పడ్డాడు. ఆయనే అరవింద్ కేజ్రీవాల్. అన్నా హజరే ఉద్యమం కేజ్రీవాల్ అనే పర్సనాలిటీని ఎక్స్‌ప్లోర్ చేసింది. ఆ రోజుల్లో ఆయన ప్రతీమాట ఒక తూటాలాగా పేలింది! మీడియా ముందుకు వస్తున్నాడూ అంటే ఏదో సంచలన వార్త తీసుకొస్తాడనే పేరుండేది. అవినీతి వ్యతిరేక భావజాలం ఉన్న ప్రతీ ఒక్కరికీ ఆ టైంలో కేజ్రీవాల్ ఆశాకిరణంలా కనిపించాడు. ఒక బ్యూరోక్రాట్.. వ్యవస్థలో ఉన్న కరప్షన్ గురించి మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యవాదులు సంతోషం వ్యక్తంచేశారు. ఎమర్జెన్సీ కాలంలో జయప్రకాశ్ నారాయణ్ తరహాలో దేశానికి ఆదర్శవంతంగా మారుతాడని ఆకాంక్షించారు.
సముద్రంలో భారీ భూకంపం:
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ప్రజలు ప్రాణ భయంతో వణికిపోయారు. ఇప్పుడు మరో భారీ భూకంపం వణికించింది. అయితే ఇది మనదేశంలో కాదండోయ్. కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. కేమన్ దీవులకు నైరుతి వైపు కరేబియన్ సముద్రంలో ఈ భూకంపం చోటుచేసుకుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8గా నమోదైందని అధికారులు వెల్లడించారు. అయితే సముద్రంలో సంభవించిన ఈ భూకంపం భూమిపై ప్రకంపనలు వచ్చాయా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు.
సుకుమార్‌ని పిచ్చోడిలా ఫాలో అయ్యా:
పుష్ప 2 థాంక్యూ మీట్ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ కొంత ఎమోషనల్ అయ్యాడు. ‘నాతో పాటు ఈ సినిమా కోసం 5 నిమిషాల నుంచి 5 సంవత్సరాల వరకు పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. నా కెరీర్ గ్రాఫ్ చూస్తే సుకుమార్ లేకుండా ఏముందా అని ఊహించుకోలేను. ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాలను సుకుమార్ తెరకెక్కించినందుకే ఈ రేంజ్ సక్సెస్ అయ్యింది. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్‌కు నేను కారణం కాదు. కేవలం సుకుమార్ మాత్రమే. ఈ అయిదు సంవత్సరాలు సుకుమార్‌ని పిచ్చోడిలా ఫాలో అయ్యాను. ఇక మూడో భాగం గురించి ఇప్పుడేం చెప్పలేను. దేవుడి దయ ఉంటే అల్లు ఆర్మీని మరింత గర్వపడేలా చేస్తా. ఈ మూవీ పాటల గురించి మాట్లాడుకుంటే మిలియన్లు చేస్తే చాలనుకుంటే ఏకంగా బిలియన్ల రుచి చూపించిన దేవిశ్రీ ప్రసాద్‌కు నా కృతజ్ఞతలు. పుష్ప 2 స్మూత్ రిలీజ్ కోసం సహకరించి అన్ని బాషల పరిశ్రమలకు ధన్యవాదాలు, సరైన గైడెన్స్ లేకపోతే ఒక మంచి నటుడు బ్యాడ్ యాక్టర్‌గా మారే ప్రమాదముంది. కానీ సుకుమార్ వల్ల నేను ఈ స్థాయిలో కూర్చున్నాను. మీరు నాకు పర్సన్ కాదు ఎమోషనల్’ అంటూ చెప్పుకొచ్చాడు.
మొదటి రోజు చాలా నెర్వస్ ఫీలయ్యాను:
తీసిన కొన్ని సినిమాలు అయినా కొంత మంది హీరోయిన్లు వారి అందం.. అనుకువ తో ప్రేక్షకులను కట్టిపడేసారు. ఇలాంటి హీరోయిన్‌లలో అన్షు ఒకరు.‘మన్మధుడు’ మూవీతో తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది యూత్‌లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఈ మూవీ అన్షుకి తిరుగులేని ఫేమ్‌ని సంపాధించి పెట్టింది. అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు ‘మజాకా’ మూవీతో రీ ఎంట్రీ ఇస్తుంది. దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎ కె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు.ఈ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అన్షు ప్రెస్ మీట్ లో పాల్గొని తనకు సంబంధించిన చాలా విషయాలు పంచుకుంది. రీ ఎంట్రీ ఇచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది..? అని ప్రశ్నించగా అన్షు మాట్లాడుతూ ‘ మీరు నమ్ముతారో లేదో నేను 15 ఏళ్లకే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. అప్పటికి నాకు అంత మెచ్యూరిటీ కూడా లేదు. ఒకవేళ ‘మన్మధుడు’ మూవీ నా 25 ఏళ్ల వయసులో చేసి ఉంటే.. ఇప్పటికి సినిమాల్లోనే కొనసాగే దాని. కానీ అప్పటికే నా చదువు కూడా పూర్తి కాలేదు. రెండు మూడు సినిమాలు తీసి లండన్ వెళ్ళిపోయాను. కాలేజ్ పూర్తి చేసి మాస్టర్స్ చేశాను. సైకాలజిస్ట్ అయ్యాను. సొంతంగా క్లినిక్ పెట్టాను. 24 ఏళ్లకే పెళ్లి అయ్యింది. నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు. ఇది నా బ్యూటీఫుల్ జర్నీ. ఇక ఈ రీ ఎంట్రీ గురించి చెప్పాలి అంటే.. అసలు ఊహించలేదు. ముందు నాకు ‘మజాకా’ స్టోరీ చెప్పగానే చాలా నచ్చింది.నా క్యారెక్టర్‌కు ఇందులో ఇంపార్టెన్స్ ఉంది. చాలా హెవీ రోల్.. అందుకే ఓకే చేశాను. 23 ఏళ్ల తర్వాత నేను మళ్ళీ తెరపై కనిపిస్తున్న ఈ సినిమా కచ్చితంగా అందరినీ అలరిస్తుందని, నా పెర్ఫార్మెన్స్‌ని అందరూ ఇష్టపడతారని నమ్ముతున్నాను. ఇక షూటింగ్.. లైటింగ్ అవ్వని కొంచెం కొత్తగా అనిపించింది. మొదటి రోజు చాలా నెర్వస్ ఫీలయ్యాను. స్కూల్ కి న్యూ కమ్మర్ లానే అనిపించింది. కానీ మా టీం లో అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. రెండు రోజుల్లో అంతా సెట్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చింది.
కోహ్లీ తిరిగి రానున్నాడా?:
భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌ను 4 వికెట్ల తేడాతో గెలుచుకున్న తర్వాత, టీమిండియా ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. దీనితో కటక్‌లో జరిగే రెండో వన్డే మ్యాచ్ గెలిస్తే భారత్ సిరీస్‌ను గెలుచుకుంటుంది. ఇంగ్లాండ్‌తో జరిగే ఈ వన్డే మ్యాచ్‌లో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ తిరిగి రానున్నాడు. కుడి మోకాలి వాపు కారణంగా విరాట్ కోహ్లీ తొలి వన్డేకు దూరమయ్యాడు. కానీ, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ మాట్లాడుతూ.. రెండవ వన్డేకు పూర్తిగా ఫిట్‌గా, సిద్ధంగా ఉన్నాడని స్పష్టం చేశాడు.