మాజీ ఎంపీ కేశినేని నాని కీలక ప్రకటన:
గత లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఓడిపోయిన విషయం తెలిసిందే. తమ్ముడు కేశినేని చిన్ని (శివనాథ్) చేతిలో ఓటమిపాలయ్యాక నాని రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ నుంచి పోటీచేసి ఓడిన అనంతరం రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్టు ప్రకటన కూడా చేశారు. అయితే ఇటీవలి రోజుల్లో కేశినేని నాని రాజకీయాల్లోకి వస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై సోషల్ మీడియాలో కేశినేని నాని స్పందించారు. తన నిర్ణయం మారదని, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని తాను నమ్ముతున్నా అని స్పష్టం చేశారు.
ఆటోను ఢీకొన్న పల్లె వెలుగు బస్సు:
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీ మహిళలు ప్రయాణిస్తున్న ఆటోను పల్లె వెలుగు బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో ఏడుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మినుము చేను పీకడానికి సుద్ధపల్లి నుండి కంతేరుకు 10 మంది మహిళా కూలీలు ఈరోజు ఉదయం ఆటోలో బయల్దేరారు. చేబ్రోలు మండలం నారా కోడూరు-బుడంపాడు గ్రామాల మధ్య గుంటూరు డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు.. ఆటోను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులు సుద్ధపల్లికి చెందిన అల్లంశెట్టి అరుణ, కుర్రా నాంచారమ్మ, తోట సీతారాములుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘనంగా ప్రారంభమైన పెద్ద గట్టు జాతర:
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేడుకగా నిర్వహించే లింగమంతుల స్వామి జాతర ఘనంగా ప్రారంభమైంది. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర తర్వాత ఇది రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతరగా ప్రాచుర్యం పొందింది. యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామి జాతర ఆదివారం అర్ధరాత్రి కేసారం నుంచి పెద్దగట్టు దేవరపెట్టే రాకతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ మహాజాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా లక్షలాది భక్తులు తరలివచ్చారు. భక్తులు సంప్రదాయ ఆయుధాలైన కత్తులు, కటర్లు, డప్పులతో స్వామివారిని ఆరాధిస్తూ గుట్ట పైకి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల తాకిడితో పెద్దగట్టు పరిసర ప్రాంతం భక్తిజన సంద్రంలా మారింది. ఇక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నామినేషన్ దాఖలుకు నేడే చివరి రోజు:
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ దాఖలుకు ఈ రోజు (సోమవారం) చివరి రోజుగా ఉంది. ఫిబ్రవరి 10వ తేదీన ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గత ఆరు రోజులుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు స్టాండింగ్ కమిటీ ఎన్నికల కోసం కేవలం నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. అందులో రెండు నామినేషన్లు భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన కార్పొరేటర్లు దాఖలు చేయగా, మిగిలిన రెండు కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు నామినేషన్ దాఖలు చేశారు. నేడు నామినేషన్ దాఖలుకు చివరి రోజు కావడంతో మరిన్ని నామినేషన్లు నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎంఐఎం (మజ్లిస్) పార్టీకి చెందిన కార్పొరేటర్లు తమ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే విధంగా, కాంగ్రెస్ పార్టీ నుండి మరికొందరు కార్పొరేటర్లు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే, ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తమ మెజారిటీ సంఖ్యా బలం లేదని భావించిన భారతీయ జనతా పార్టీ (BJP) ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుండి ఎలాంటి నామినేషన్లు వచ్చే అవకాశమే లేదు.
ఢిల్లీలో భూకంపం:
దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కేవలం దేశ రాజధాని ఢిల్లీ మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా బలమైన భూప్రకంపనలు సంభవించినట్లు పేర్కొనింది. ఈరోజు (ఫిబ్రవరి 17) ఉదయం తెల్లవారుజామున 5:36 గంటలకు ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్-ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయని స్థానికులు చెప్పుకొచ్చారు. దీంతో ప్రాణ భయంతో ఢిల్లీ వాసులు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో భూమి కంపించింది అని స్థానికులు తెలిపారు. ఈ భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. భూకంప కేంద్రం లోతు కేవలం 5 కిలో మీటర్లు మాత్రమేనని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఇక, అయితే, గత నెల జనవరి 23న చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్‌లో 80 కిలోమీటర్ల లోతులో 7.2 తీవ్రతతో భూకంపం వచ్చిన తర్వాత ఢిల్లీలో బలమైన ప్రకంపనలు ఏర్పడ్డాయి.
నేడు ఢిల్లీ బీజేఎల్పీ సమావేశం:
అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ ఘన విజయం సాధించినప్పటికీ నూతన ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఇంకా నిరీక్షణ కొనసాగుతోంది. అయితే, ఈ నిరీక్షణకు ఈరోజు (ఫిబ్రవరి 17) తెరపడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు కీలకమైన బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరుగనున్నట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి. కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్ష నేతను ఎంపిక చేసుకునేందుకు ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో సమావేశం కాబోతున్నారని తెలిపారు. ఇక, ముఖ్యమంత్రి రేసులో పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మ, రేఖాగుప్తాతో పాటు మరికొందరు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
అమెరికాలో పర్యటించనున్న ఇజ్రాయెల్ సైన్యాధిపతి:
ఇజ్రాయెల్ సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవి నేటి నుంచి మూడు రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. హలేవి పర్యటన ఆసక్తి రేపుతోంది. మార్చి 6న హలేవీ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో యూఎస్ పర్యటన కీలకంగా మారింది. ఈ పర్యటనలో వ్యూహాత్మక కార్యాచరణ దాగి ఉందని తెలుస్తోంది. కీలక అంశాలపై అమెరికా సీనియర్ కమాండర్లతో హలేవీ చర్చించనున్నారు. ఈ మేరకు ఆదివారం ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈనెల 15, మధ్యాహ్నం 12 గంటలలోపు ఇజ్రాయెల్ బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కానీ హమాస్ మాత్రం లెక్కచేయలేదు. యథావిధిగా శనివారం ముగ్గురు బందీలనే విడుదల చేసింది. అయితే గాజాను స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. పాలస్తీనియున్లంతా గాజా విడిచిపెట్టి వెళ్లిపోవాలని సూచించారు. ఇక ఆదివారం అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో ఇజ్రాయెల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హమాస్ అంతుచూస్తామని హెచ్చరించారు. అలాగే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా హమాస్‌పై యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఇలా అమెరికా, ఇజ్రాయెల్ వరుస ప్రకటనలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తప్పవని తెలుస్తున్నాయి. ఇక తాజాగా ఇజ్రాయెల్ సైన్యాధిపతి హలేవీ అమెరికాలో పర్యటించడం కూడా సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఏదో జరగబోతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారి:
హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్. గత ఏడాది ‘ఊరిపేరు భైరవకోన’ రాయన్ సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం ధమాకా దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో ‘మజాకా’ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. సందీప్ కిషన్ కెరీర్ లో 30వ సినిమాగా రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, సాంగ్స్ కు మంచి స్పందన లభించింది. త్రినాథ రావు దర్శకత్వలో రానున్న మజాకా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ను ఇటీవల మొదలుపెట్టారు మేకర్స్. అందులో భాగంగా సరికొత్త ప్రయోగానికి తెరలేపింది యూనిట్. ఇప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఎవరు చేయనటు వంటి సాహసం చేస్తున్నారు. నేడు ఈ సినిమాలోని రావులమ్మ అని సాగే సాంగ్ ను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు మేకర్స్. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ఈ లైవ్ స్ట్రీమింగ్ ను ఏకే ఎంటెర్టైఅంమెంట్స్ హ్యాండిల్ నుండి లైవ్ స్ట్రీమింగ్ కానుంది. కాగా మజాకాను మహా శివరాత్రి కనుకగా ఈ నెల 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ రీతువర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ధమ్కీ ఫేమ్ లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.
చావాను మిస్ చేసుకున్న తెలుగు హీరో:
తాజాగా బాలీవుడ్ నుంచి విడుదలైన హిస్టారికల్ మూవీ ‘చావా’. మరాఠా యోధుడు ఛత్రపతి మహారాజ్ శివాజీ కుమారుడు.. శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదలైంది. ఇక మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ని సవాల్ చేసే రేంజ్‌లో ఈ మూవీ నెంబర్లు నమోదవుతున్నాయి. బుక్కింగ్స్ చూసుకుంటే మొదటి వీకెండ్‌కే సులభంగా వంద కోట్లు దాటడం ఖాయం అని టాక్. లక్ష్మణ్ ఊటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ గాను , రష్మిక మందన్న యేసు బాయ్ గా కూడా నటించగా.. వీరి నటన చూసి థియేటర్ లో అభిమానులు ఒకవైపు నినాదాలు చేస్తు, మరొవైపు ఎమోషన్‌కు గురై కన్నీళ్లను కూడా పెట్టుకుంటున్నారు. అలా వారి పాత్రకు వంద శాతం న్యాయం చేశారు విక్కీ&రష్మిక. అయితే తాజాగా వైరల్ అవుతున్న విషయం ఏంటి అంటే ఈ మూవీ ఆఫర్ మొదట టాలీవుడ్ స్టార్ హీరో వద్దకు వచ్చిందట. అవును ముందుగా దర్శకుడు లక్ష్మణ్ ఊటేకర్ఈ సినిమా కోసం.. సూపర్ స్టార్ మహేష్ బాబు ని సంప్రదించారంట. కానీ ఆయన ఈ మూవీ నటించేందుకు ఒప్పుకోలేదంట. దీంతో ఈ కథను చాలా రోజులు పెండింగ్ లో పెట్టాడట. ఇక హీరోయిన్‌గా కత్రీనా కైఫ్‌ను అనుకున్నారంట. ఆమె కూడా దీనికినో చెప్పిందట. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. మహేష్ బాబు కనుక ఈ మూవీని ఒప్పుకొని ఉంటే పాన్ ఇండియా స్టార్‌గా ఒక రెంజ్‌లో స్టార్ డమ్ సంపాదించుకునేవాడు. ఏది ఏమైనప్పటికి విక్కీ మాత్రం ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి నటించాడు. తన యాక్టింగ్‌కి ప్రేక్షకులు వందకు వంద మార్కులు ఇచ్చారు.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు బ్యాడ్ న్యూస్:
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా శనివారం సాయంత్రం దుబాయ్ చేరుకుంది. ఆదివారం భారత జట్టు ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించి.. ఐసీసీ అకాడమీలో తమ శిక్షణను కొనసాగించింది. అయితే ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డాడు. ఆదివారం ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రిషబ్ పంత్ ఎడమ మోకాలికి గాయమైంది. బౌలర్ వేసిన స్లాష్ పంత్ ఎడమ మోకాలికి తగిలింది. దీంతో వెంటనే నేలపై పడిపోయాడు. ఈ క్రమంలో వైద్య బృందం రంగంలోకి దిగి అతనికి ఐస్ ప్యాక్ వేశారు. అయినప్పటికీ పంత్ నొప్పితో బాధపడుతున్నట్లు కనిపించాడు. ఐసింగ్ తర్వాత పంత్ కుంటుతూ కనిపించాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న భారత్, బంగ్లాదేశ్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత.. భారత జట్టు 23న పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల క్రికట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తమ సన్నాహాలు చేస్తూ.. అద్భుతమైన రికార్డును కొనసాగించాలనే లక్ష్యంతో ఈ టోర్నీకి సిద్ధమవుతోంది.