కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వికారాబాద్, నారాయణపేట జిల్లాల పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి వికారాబాద్ జిల్లా కొడంగల్‌ను ప్రధాన కేంద్రంగా కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి ప్రత్యేక అధికారిని నియమించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది, ఇది జిల్లా కలెక్టర్, వికారాబాద్ యొక్క మొత్తం నియంత్రణలో పనిచేయడానికి.. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయడానికి, ప్రాంత అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాల కలయిక కోసం ప్రణాళికలను రచిస్తుంది.
పవన్ కళ్యాణ్‌పై మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్..
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇళ్ల స్థలాల్లో 35 వేల కోట్లు స్కాం జరిగిందని అనడానికి ఆధారాలు చూపిస్తావా.. అంటూ తీవ్రంగా మండిపడ్డారు. 35 వేల కోట్లు అవినీతి ఎలా జరిగిందని పవన్ కళ్యాణ్‌ని మోడీ అడిగితే ఏం చెప్తారని ఎద్దేవా చేశారు. సీబీఐ, ఈడీతో విచారణ జరపాలన్న పవన్ కళ్యాణ్.. ఇంటర్‌పోల్‌ను మర్చిపోయాడని అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా 31 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీలో మీ నాయకులు నెగ్గుతారో లేదో ముందు అది చూడు, అది మానేసి చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నావ్ అంటూ వ్యాఖ్యానించారు. కాపులు నాకు ఓట్లు వేయలేదు అని అంటున్నావ్ మరి నీకు ఎవరు ఓట్లు వేశారంటూ పవన్‌ను మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు హయంలో స్కిల్ స్కాం, అమరావతి భూముల స్కాం, ఇన్నర్ రింగ్ రోడ్ స్కాం అన్ని స్కాములే అంటూ విమర్శించారు. ఈ స్కామ్‌లలో పవన్ కళ్యాణ్‌కు కూడా వాటా ఉందని ఆయన ఆరోపించారు.
కార్పొరేట్ బుకింగ్స్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు
సాలార్ కార్పొరేట్ బుకింగ్స్ గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్పందించారు. ప్రశాంత్ నీల్ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో, సలార్ చుట్టూ ఉన్న నెగటివ్ ప్రచారాల గురించి మాట్లాడాడు. సలార్ కార్పొరేట్ బుకింగ్స్ గురించి జరుగుతున్న ప్రచారం గురించి ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ స్పందించారు. ఇటీవల, సలార్ హిందీ వెర్షన్ -షారుఖ్ ఖాన్ డంకీకి నార్త్ ఇండియాలో కలెక్షన్లు – బుకింగ్‌ల గురించి పెద్ద వివాదమే జరిగింది. షారుఖ్ ఖాన్ డంకీకి కార్పొరేట్ బుకింగ్స్ జరిపారని కొందరు కామెంట్ చేయగా సలార్ హిందీ వెర్షన్ కోసం కూడా ఇలా కార్పొరేట్ బుకింగ్స్ చేశారని ఆరోపణలు చేశారు. ఇక ఈ విషయం గురించి ప్రశాంత్ మాట్లాడుతూ లేదు ఇలాంటి నెగిటివ్ వార్తలకు తాను ప్రాముఖ్యత ఇవ్వనని, త్వరలోనే అది (నెగటివిటీ) చచ్చిపోతుందని ప్రశాంత్ నీల్ అన్నారు.
న్యూ ఇయర్ వేళ నార్కోటిక్ పోలీసుల సరికొత్త స్టెప్.. రంగంలోకి డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్ కిట్స్
న్యూ ఇయర్ వేళ నార్కోటిక్ పోలీసులు సరికొత్త స్టెప్ తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోని డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్ కిట్స్‌ను రంగంలోకి దించింది నార్కోటిక్ టీం. రేపటి నుంచి పరీక్షలు చేయడానికి నార్కోటిక్ బ్యూరో సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరోకు కొత్త పరికరాలు చేరాయి. లాలాజలంతో పాటు అవసరమైతే మూత్ర పరీక్షలను అధికారులు చేయనున్నారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ రాగానే అప్పటికప్పుడే డ్రగ్స్ తీసుకుంటే పాజిటివ్ రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. పాజిటివ్ రిపోర్టు రాగానే మరిన్ని పరీక్షల కోసం మూత్ర పరీక్షలను అధికారులు చేయనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ డీఎస్పీ నళిని
మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగానే కలిసినట్లు చెప్పారు. తాను మళ్లీ డీఎస్పీ ఉద్యోగంలో చేరనని స్పష్టం చేశారు. ఆధ్యాత్మికంపై వైపే ఉంటానన్నారు. ప్రభుత్వానికి, మీడియాకు మాజీ డీఎస్పీ నళిని కృతజ్ఞతలు తెలిపారు.
సిమ్లాలో పంజాబ్ మోడల్‌పై అత్యాచారం
రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు చూస్తుంటే.. మగవాళ్లతో స్నేహం చేయటమే ఆడవారు చేస్తున్న నేరమా అనిపిస్తోంది. కొంచెం మంచిగా నటించి మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన 23 ఏళ్ల మోడల్‌పై సిమ్లాలోని లూథియానాకు చెందిన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో తీస్తానన్న సాకుతో నిందితులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు నమోదు చేసిన ఫిర్యాదులో, తాను డిసెంబర్ 22న సిమ్లాకు వచ్చి రాత్రి సిమ్లాలోని ఓ హోటల్‌లో బస చేశానని, నిందితులు తనను వేధించారని బాధితురాలు వెల్లడించింది. 23 ఏళ్ల బాధితురాలు బుధవారం న్యూ సిమ్లా మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నిందితుడిపై ఐపీసీ 376 (అత్యాచారానికి శిక్ష) కింద కేసు నమోదు చేసినట్లు సిమ్లా ఏఎస్పీ సునీల్ నేగి తెలిపారు.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి
వానాకాలం, యాసంగి 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ డా.అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, పౌర సరాఫరాల శాఖ అధికారులతో కష్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) వానాకాలం, యాసంగి పై రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వానాకాలం, యాసంగి 2022-23 కు సంబంధించి మిల్లర్లకు కేటాయించిన రోజు వారి లక్ష్యాలను డైలీ టార్గెట్ పూర్తి చేయుటకు జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
అల్లుడితో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలకృష్ణ
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వరుసగా టాలీవుడ్ బడాహీరోలు కలుస్తున్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక టాలీవుడ్ నుండి ముందుగా మెగాస్టార్ చిరంజీవి వెళ్లి కలిశారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో కలిసిన చిరంజీవి ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. ఇక ఆ తరువాత నేడు సీఎం రేవంత్‌రెడ్డిని టాలీవుడ్ కింగ్ నాగార్జున తన భార్య అమలతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. జూబిలీహిల్స్‌లోని సీఎం నివాసంలో వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక ఇప్పుడు తాజాగా, సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన చిన్న అల్లుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిశారు. ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఐదేళ్లలో కాపు కార్పొరేషన్ ద్వారా ఎంత మందికి రుణాలిచ్చారు..?
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపు ద్రోహి జగన్ రెడ్డికి వంత పాడేందుకు శేషు సిగ్గుపడాలని దుయ్యబట్టారు. ఐదేళ్లలో కాపులకు ఏం చేశారో అడపా శేషు సమాధానం చెప్పగలడా? అని ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తే ప్రశ్నించలేని స్థితిలో అడపా శేషు ఉన్నాడని ఆరోపించారు. ఐదేళ్లలో కాపు కార్పొరేషన్ ద్వారా ఎంత మందికి రుణాలిచ్చారు..? అని ప్రశ్నించారు. ఎంత మందికి విదేశీ విద్య ఇచ్చారో అడపా శేషు చెప్పగలరా అని బోండా ఉమ వ్యాఖ్యానించారు. కాపులకు ఇచ్చిన 5శాతం రిజర్వేషన్లు జగన్ రెడ్డి రద్దు చేస్తే ప్రశ్నించరెందుకు? అని బోండా ఉమ మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాజంపేట పార్లమెంటు.. కాంగ్రెస్, టీడీపీ బలిజలకిచ్చింది అని అన్నారు. జగన్ రెడ్డి బలిజలకు మొండి చేయి చూపి.. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డికి ఇచ్చారన్నారు. పులివెందుల పంచాయతీ సర్పంచ్‌గా బలిజలుంటే.. దాన్ని జగన్ ఫ్యామిలీ కబ్జా చేసిందని ఆరోపించారు. బలిజలకు చెందిన కడప, రాజంపేట, రాయచోటి అసెంబ్లీ స్థానాల్లో జగన్ రెడ్డి వర్గంతో నింపుకున్నారని తెలిపారు.
ఈ దేశంలో జగన్ను భయపెట్టే మగాడు పుట్టలేదు..
తమ ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పిస్తున్నదని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. ఒకప్పుడు ఓటు వేయడానికి మాత్రమే ఎస్సీలు ఉండేవాళ్ళు.. ఈరోజు ఎస్సీలు హోంమంత్రులుగా పనిచేసే పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో వచ్చిందని పేర్కొన్నారు. కర్మ గాలి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు నిర్వీర్యం అయిపోతారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో మనం ఉంటే మురికి కూపాలుగా మారతాయని కోర్టుల్లో చంద్రబాబు కేసులు వేశారని అన్నారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ విడుదలైంది. మార్చ్ 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెల్లడించారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తామన్నారు. 18న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, 26న సైన్స్ మొదటి పేపర్, 28న సైన్స్ 2వ పేపర్, 30న సోషల్ స్టడీస్, 1వ తేదీన ఒకేషనల్ కోర్సు వారికి సంస్కృతం, అరబిక్ మొదటి పేపర్, 2న రెండో పేపర్ పరీక్షలు జరుగుతాయన్నారు. 10వ తరగతి పరీక్షలను 5 లక్షల 6 వేలకు పైగా విద్యార్థులు రాయనున్నారు.