హోంమంత్రిపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్..
రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు న్యాయం ఎందుకు చేయడం లేదని ప్రశ్నలు గుప్పించారు. రాష్ట్రంలో ఉన్మాదులు, నేరస్థులు పేట్రేగిపోతున్నారన్నారు. గుంటూరులో నవీన్ అనే వ్యక్తి అమ్మాయిపై దాడి చేస్తే కనీసం పట్టించుకోలేదన్నారు. హోం మంత్రి , డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థను కక్ష్య సాధింపుకు వాడుతున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకులను వేధించడానికి వాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు చెప్పేది చేతల్లో శూన్యమని ఆరోపణలు చేశారు. మీ చేతగాని తనం వల్ల విజయవాడలో వరదల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. 74 మందికి పైగా ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని ఆర్కే రోజా అన్నారు.
ఉనికి కోసం బీఆర్‌ఎస్ గ్రూప్ -1 అభ్యర్థులను రెచ్చగొట్టింది
నుడా చైర్మన్ అభినందన సభలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయం సువర్ణ మయం కాబోతుందన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఇంట్లో నియామకాలు చేసుకున్నారు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగులకు ఏం చేశారని కేంద్ర మంత్రులు రోడ్లు ఎక్కి ఆందోళన చేస్తున్నారని ఆయన అన్నారు. నిరుద్యోగులకు అన్యాయం జరగనివ్వమని, ఉనికి కోసం బి.అర్.ఎస్. గ్రూప్ _1 అభ్యర్థులను రెచ్చగొట్టిందన్నారు మహేష్ కుమార్ గౌడ్ . కేటీఅర్, హరీష్ రావు రోడ్లు ఎక్కి తమాషాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
డయేరియా మరణాలకు కూటమి సర్కారే కారణం.. బొత్స కీలక వ్యాఖ్యలు
విజయవాడలోని గుర్లలో డయేరియా మరణాలకు కూటమి ప్రభుత్వమే కారణమని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. డయేరియా బాధితులు ఇంకా మరొకొన్ని గ్రామాలలో ఉన్నారని ఆయన తెలిపారు. 16 మంది డయేరియా బారిన పడి మృతి చెందారన్నారు. అధికారులు ఒకటి రెండు అని చెప్పారని.. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 10 అని చెప్పారని ఆయన వెల్లడించారు. చనిపోవడానికి బహిరంగ మలవిసర్జన కారణమని ఇప్పుడు చెబుతున్నారంటూ మండిపడ్డారు.
గత వారసత్వ ద్వారా వస్తున్న లోపాలే ఇప్పుడు సరిచేసుకోవాల్సి వస్తోందని పవన్ అన్నారన్న ఆయన.. గతంలో ఎన్నడూ పదహారు మంది చనిపోయిన దాఖలాలు జిల్లాలో గానీ, చీపురుపల్లిలో గానీ లేవని బొత్స పేర్కొన్నారు. చంపావతి నుంచి సంకిలి వరకు పైప్ లైన్స్ వేసి నీరిచ్చామన్నారు. ఈ రోజుకి పది రోజులైనా నాగలవలసలో మరో రెండు కేసులు నమోదయ్యాయన్నారు. పది రోజులలో నియంత్రణ చెయ్యకపోతే ఎందుకు ఈ ప్రభుత్వమంటూ ప్రశ్నించారు. వీరంతా సాయం అందకపోవడం వల్లే చనిపోయారని ఆరోపించారు. వరదలలో ముప్పై రెండు మంది కొట్టుకు పోయారన్నారు. రుషికొండ ఏమైనా ప్రయివేటు ప్రాపర్టీనా… ప్రభుత్వానిదే కదా.. కొండపై భవనాలు కట్టాం.. అందులో లోపాలంటే ఎంక్వైరీ చేయించాలన్నారు.
ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం.. బుద్గాం స్థానాన్ని వదులుకున్న సీఎం
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. బుద్గాం అసెంబ్లీ స్థానాన్ని ఆయన వదులుకున్నారు. కుటుంబానికి కంచుకోటగా ఉన్న గండర్‌బాల్ స్థానాన్ని నిలుపుకున్నారు. ఇటీవల జరిగిన జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఒక స్థానాన్ని వదులుకోవల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో బుద్గాం స్థానాన్ని ఖాళీ చేయడంతో ఇక్కడ త్వరలో ఉప ఎన్నిక రానుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ -కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఈనెల 16న ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పడింది.
ఉచిత ఇసుకపై అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఉచిత ఇసుకపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉచిత ఇసుకపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇసుకను ఉచితంగా అందించడమే లక్ష్యంగా సీనరేజీ రద్దు చేశామన్నారు. సొంత అవసరాలకు గ్రామ పంచాయతీల పరిధిలో మాత్రమే ట్రాక్టర్లతో ఇసుక తరలింపునకు అనుమతి ఇచ్చామన్నారు. సొంత అవసరాలకు ఇసుక తీసుకెళ్లేవారు గ్రామ, వార్డు సచివాలయాలో తప్పకుండా నమోదు చేసుకోవాలన్నారు. ఇసుక కొరత సమస్యను అధిగమించడం కోసం రీచుల్లో ఇసుక తవ్వకం, లోడింగ్ ప్రక్రియను ప్రైవేట్ ఏజెన్సీలకు కేటాయించడంపై అధికారులు సమీక్షించాలని సూచించారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని జిల్లా స్థాయి శాండ్ కమిటీ పారదర్శకంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇసుక అందుబాటులో లేని జిల్లాల్లో స్టాక్ యార్డుల ద్వారా సరఫరా చేయాలన్నారు. అంతరాష్ట్ర ఇసుక సరఫరాను అడ్డుకోవడమే లక్ష్యంగా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, సీసీటీవీ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఉచిత ఇసుక పాలసీని ఎవరైనా ఎక్కడైనా దుర్వినియోగం చేసినట్లయితే తీవ్రమైన చర్యలు ఉంటాయన్నారు. అక్రమ ఇసుక తవ్వకాలపై సామాన్యులు కూడా ఫిర్యాదు చేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ఈ నెల 23, 24 తేదీల్లో మూసీ పరీవాహక ప్రాంతంలో బీజేపీ నేతల పర్యటన
ఈ నెల 23, 24వ తేదీల్లో మూసీ పరీవాహక ప్రాంతంలో 9 టీమ్ లు పర్యటించనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. 18 ప్రాంతాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల బృందాలు పర్యటిస్తాయని ఆయన తెలిపారు. అక్కడ ప్రజలకి భరోసా కల్పిస్తాయని, ఈ నెల 25న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. హై కమాండ్‌కు కప్పం కట్టేందుకు ప్రతినెలా ఎత్తులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి అని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, మూసీ మీద రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారని కాసం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. DPR ఇవ్వకుండా అఖిల పక్షం మీటింగ్ ఏంది అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ది బాలక్ బుద్ధి… మూసీలో అంబాడుతున్నట్టు ఉందన్నారు.
రష్యాతో భారత్ సంబంధాలపై విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ‘ది ఇండియా సెంచరీ’ గురించి మాట్లాడారు. ఇంటరాక్షన్ సందర్భంగా భారతదేశ విదేశాంగ విధానం, ప్రపంచవ్యాప్త పాత్రను ఎలా పోషిస్తోంది అనే దానిపై వివరాలను వెల్లడించారు. రష్యాతో భారత్ సంబంధాలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “రష్యాతో మన చరిత్రను పరిశీలిస్తే.. అది మనకు వ్యతిరేకంగా ఏమీ చేయలేదు” అని ఆయన అన్నారు. “నేడు రష్యాలో పరిస్థితి భిన్నంగా ఉంది. పశ్చిమ దేశాలతో రష్యా సంబంధాలు స్పష్టంగా విచ్ఛిన్నమయ్యాయి. అది ఇప్పుడు ఆసియా వైపు చూస్తోంది. పెద్ద వనరుల వినియోగదారులుగా ఉన్నప్పుడు అభివృద్ధి చెందుతున్న ఈ దశలో రష్యాకు ప్రధాన సహజ వనరుల శక్తిగా భారతదేశంతో అనుబంధం ఉంది.’ అని అన్నారు. రష్యాతో ఆర్థిక సంబంధంతో పాటు వ్యూహాత్మకమైన సంబంధం కూడా ఉందని జైశంకర్ అన్నారు.
గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సలైట్లు హతమయ్యారు. మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడు. గాయపడ్డ జవాన్‌ను నాగ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కోప్రి అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కమాండో టీం కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. గడ్చిరోలిలో నక్సలైట్లు ఎక్కువగా సంచరిస్తారు. ఇటీవల నక్సలైట్ దంపతులు రూ.8 లక్షల రివార్డు తీసుకుని పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఆర్ధిక ఇబ్బందులు.. కరణ్ జోహార్ షాకింగ్ నిర్ణయం
బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత- కరణ్ జోహార్ తన సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌లో సగం వాటాను విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం ఒక అగ్రిమెంట్ కూడా జరిగింది. ఆ అగ్రిమెంట్ విలువ రూ. 1000 కోట్లు. ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద డీల్స్‌లో ఇది కూడా ఒకటని అంటున్నారు. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కభీ ఖుషీ కభీ గమ్’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ వంటి హిట్ సినిమాలను అందించిన కరణ్ జోహార్.. ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త అదార్ పూనావాలాతో ఈ అగ్రిమెంట్ చేసుకున్నాడు. అదార్ పూనావాలా సెరీన్ ప్రొడక్షన్స్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ అలాగే ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో 50 శాతం వాటాను రూ. 1,000 కోట్లకు కొనుగోలు చేస్తుంది.
నాకు నమస్కారం పెట్టాల్సి వస్తుందనే జగన్ అసెంబ్లీకి రావట్లేదు..
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి సెటైర్లు విసిరారు. తనకు నమస్కారం పెట్టేందుకు ఇష్టం లేకనే జగన్ అసెంబ్లీలోకి రావడం లేదని అన్నారు. వచ్చే నెలలో జరిగే సమావేశాలకు ఆహ్వానిస్తున్నానని… అక్కడికి వస్తే ఎదురెదురుగా ముచ్చటిం చుకుందామని ఆహ్వానించారు స్పీకర్. తెలుగుదేశం పార్టీది సంస్కారవంతమైన పార్టీ అని, క్యాడర్ బేస్డ్‌గా ఎదిగిన పార్టీ అని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలాగా టీడీపీ ఉండదని అయ్యన్న అన్నారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో రూ. 68 లక్షలతో చేపట్టే రోడ్డు పనులకు శంఖుస్థాపన కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో జగన్‌పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సెటైర్లు వేశారు.