బీహార్ కొత్త స్పీకర్‌గా నంద కిషోర్
బీహార్ అసెంబ్లీలో (Bihar) సోమవారం జరిగిన బలపరీక్షలో నితీష్‌కుమార్ సర్కార్ (Nitish Kumar) విజయం సాధించింది. 129 మంది ఎమ్మెల్యేలు నితీష్‌కు మద్దతుగా నిలిచారు. ఇక కొత్త స్పీకర్‌గా బీజేపీ నేత నంద కిషోర్ యాదవ్ (Nand Kishore Yadav )పేరు ఖరారైంది. మంగళవారం ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు.
ఇదిలా ఉంటే నితీష్ కుమార్ బలపరీక్షకు ముందు మహాకూటమిలో స్పీకర్‌గా ఉన్న ఆర్జేడీకి చెందిన అవథ్ బిహారీ చౌదరిపై అధికార పక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. తీర్మానానికి అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 112 ఓట్లు పడటంతో స్పీకర్‌కు ఉద్వాసన పలికారు. దీంతో కొత్త స్పీకర్ నియామకానికి మార్గం సుగమమైంది. కీలకమైన స్పీకర్ పదవిని బీజేపీ దక్కించుకోవడం విశేషం.
కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ లో నీటి సమస్యలు చాలా కీలకమన్నారు. కృష్ణ జలాల గురించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా హాజరుకాకపోవడం ప్రజలను అవమనపరిచినట్టేనని ఆయన వ్యాఖ్యానించారు. కీలకమైన బడ్జెట్ సమావేశాలలో కేసీఆర్ రాకుండా బయట ఎక్కడో మాట్లాడ్డం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎంత సేపు మాట్లాడిన అవకాశం ఇస్తామని చెప్తున్న రాకుండా మొఖం చాటేయ్యడం దారుణమని, ఆయన నల్గొండలో కృష్ణ జలాల గురించి సభ పెట్టి మాట్లాడ్డం ఏమిటి అని మల్లు రవి మండిపడ్డారు.
రాజ్యసభకు సోనియా పోటీ.. ఎక్కడ నుంచంటే..!
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi) ఈసారి రాజ్యసభకు (Rajya Sabha) పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. లోక్‌సభకు కాకుండా రాజ్యసభకు వెళ్లాలని ఆమె భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్ (Rajasthan) నుంచి రాజ్యసభకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాయబేరేలి కంచుకోటగా ఉన్నప్పటికీ ఈసారి సోనియాగాంధీ రాజ్యసభకు పోటీ చేస్తారనే ఊహాగానాలు వినపడతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నేత, న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ అభ్యర్థిగా కర్ణాటక నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. అలాగే సైయర్ నసీర్ హుస్సేన్‌కు కూడా తిరిగి టిక్కెట్ ఇస్తారని, అజయ్ మాకెన్‌కు కూడా రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలున్నాయని వినిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది.
రాజస్థాన్ నుంచి బీజేపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే
ఈనెలలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా రాజస్థాన్ నుంచి పోటీ చేసే అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. రాజస్థాన్ నుంచి చున్నిలాల్ గరాసియా (Chunnilal Garasiya), మదన్ రాథోడ్‌లను (Madan Rathore) బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది.
ఈ ఏడాది 68 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. వీరిలో ముగ్గురు ఎంపీల పదవీకాలం జనవరి 27తో ముగిసింది. మరో 65 మంది సభ్యులు పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ 65 మంది సభ్యులలో 55 మంది సభ్యులు ఫిబ్రవరి 23న పదవీ విరమణ చేయనున్నారు. అదే సమయంలో ఏడు మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం ఏప్రిల్ 2-3 మధ్య పూర్తవుతుంది. మే నెలలో మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అత్యధికంగా బీజేపీ ఎంపీలే రిటైర్ అవుతున్నారు. ఈ ఏడాదితో బీజేపీకి చెందిన 32 మంది రాజ్యసభ ఎంపీల పదవీకాలం పూర్తవుతోంది. దీని తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎంపీలు పదవీ విరమణ చేయనున్నారు.
ప్రధాని మోడీకి రాహుల్ లేఖ.. దేనికోసమంటే..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రధాని మోడీకి (PM Modi) లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న MGREGS కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ప్రధానికి రాహుల్ లేఖ పంపించారు. ఇటీవల భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా పశ్చిమ బెంగాల్ పర్యటించినట్లు తెలిపారు. యాత్రలో భాగంగా MGREGS (మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) కార్మికుల దుస్థితిని తెలుసుకున్నట్లు తెలిపారు. వాళ్ల పరిస్థితి భయంకరంగా ఉందన్నారు. మార్చి నుంచి పశ్చిమ బెంగాల్‌కు కేంద్ర నిధులు నిలిపివేయడం వల్ల లక్షల మంది సోదరులు, సోదరీమణులకు MGREGS కింద పని వేతనాలు అందలేదని గుర్తుచేశారు. దీంతో వారి పరిస్థితి దుర్భరంగా ఉందని పేర్కొన్నారు.
హేమంత్‌కు మరోసారి ఈడీ కస్టడీ పొడిగింపు.. ఎన్నిరోజులంటే..!
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు (Former Jharkhand CM Hemant Soren) మరోసారి ఈడీ (ED) కస్టడీ కోర్టు పొడిగించింది. ఇప్పటికే రెండు సార్లు ఈడీ కస్టడీకి ఇచ్చింది. దాదాపు 10 రోజులుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో హేమంత్‌ను విచారిస్తున్నారు. మరోసారి ఈడీ కస్టడీని కోరగా… కోర్టు మూడు రోజుల పాటు అనుమతించింది.
మనీలాండరింగ్ కేసులో జనవరి 31న హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అటు తర్వాత రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తకుండా తన వారసుడిగా చంపయ్ సోరెన్‌ను ముఖ్యమంత్రిగా నిలబెట్టారు. అనంతరం జరిగిన బలపరీక్షలో కూడా చంపయ్ విజయం సాధించారు.
బుల్డోజర్‌తో కూల్చడం ఫ్యాషన్‌గా మారింది.. మధ్యప్రదేశ్ హైకోర్టు చురకలు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఇంటి కూల్చివేత కేసులో మున్సిపల్ కార్పొరేషన్‌కు ఇండోర్ హైకోర్టు చురకలంటించింది. ఎవరి ఇంటినైనా కూల్చడం ఫ్యాషన్‌గా మారిందని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. దోషులకు కోర్టు జరిమానా కూడా విధించింది. బుల్డోజర్‌తో ఇంటిని కూల్చిన చర్యపై హైకోర్టు ప్రశ్నలు సంధించింది. ఇండోర్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ వివేక్ రుషియా మాట్లాడుతూ.. సహజ న్యాయ సూత్రాలు పాటించకుండా ఇప్పుడు ఏ ఇంటినైనా కూల్చివేయడం ‘ఫ్యాషన్’గా మారిపోయిందని వ్యాఖ్యానించారు.
ఉజ్జయినిలో ఓ కేసుకు సంబంధించి నిందితుడి భార్య హైకోర్టును ఆశ్రయించగా.. ఈమేరకు వ్యాఖ్యలు చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్ లంగ్రి అనే వ్యక్తి ఓ ఆస్తి వివాదంలో ఒక వ్యక్తిని బెదిరించి అతడిపై దాడి చేశాడు. దీంతో ఆ బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో రాహుల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. అనంతరం పోలీసులు, మున్సిపల్ అధికారులు కలిసి రాహుల్‌కు చెందిన రెండంతస్తుల భవనాన్ని కూలగొట్టారు. ఈ చర్యలపై రాహుల్ భార్య రాధ కోర్టును ఆశ్రయించింది.
మనీష్ సిసోడియాకు 3 రోజుల పాటు మధ్యంతర బెయిల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట లభించింది. తన మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు ఢిల్లీ కోర్టు సోమవారం మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లక్నోలో జరిగే తన మేనకోడలి వివాహానికి హాజరయ్యేందుకు సిసోడియా ఫిబ్రవరి 12-16 మధ్య మధ్యంతర బెయిల్‌ను కోరారు. సీబీఐ, ఈడీ విచారిస్తున్న అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో ఫిబ్రవరి 13 నుంచి 15 వరకు సిసోడియాకు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్ ఎంకే నాగ్‌పాల్ మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు.
మోడీని కలిసిన భారతరత్న కర్పూరీ ఠాకూర్ ఫ్యామిలీ
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, భారతరత్న కర్పూరీ ఠాకూర్ (Karpoori Thakur) కుటుంబాన్ని ప్రధాని మోడీ (PM Modi) కలిశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో పలు విషయాలను ప్రధాని వారితో పంచుకున్నారు. వారితో కలిసి దిగిన ఓ ఫొటోను మోడీ ‘ఎక్స్’ ట్విట్టర్‌లో పంచుకున్నారు.
కర్పూరీ ఠాకూర్‌ను జన్ నాయక్‌గా బీహార్ ప్రజలు పిలుచుకుంటారు. 1970 నుంచి 1971 వరకు.. అటు తర్వాత 1977 నుంచి 1979 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో బీహార్ రాజకీయ ముఖ చిత్రంపై ఆయన చెరగని ముద్ర వేశారు. సమాజంలోని వెనుకబడిన మరియు అణగారిన వర్గాల అభ్యున్నతిలో కర్పూరీ ఠాకూర్ కీలక పాత్ర పోషించారని ప్రధాని మోడీ కొనియాడారు. ఆయన జీవితం తరతరాల భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని తెలిపారు.
సీబీఎస్‌ఈ విద్యార్థులకు బోర్డు హెచ్చరికలు.. లిస్టు విడుదల
సీబీఎస్ఈ (CBSE) విద్యార్థులకు బోర్డు హెచ్చరికలు (Warning) జారీ చేసింది. పరీక్షలు ప్రారంభమవుతున్న వేళ సోషల్ మీడియాలో సీబీఎస్‌ఈ లోగో పేరుతో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే హ్యాండిల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు, టీచర్లకు (Students And Teachers) సూచించింది .
ఈనెల 15 నుంచి సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అయితే సామాజిక మాధ్యమాల్లో సీబీఎస్‌ఈ పేరుతో తప్పుడు సమాచారం జరుగుతున్నట్లుగా బోర్డు గుర్తించింది. దీంతో ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తమ బోర్డు పేరుతో అనేక నకిలీ ఖాతాలు ఉన్నాయని.. వాటిని ఫాలో కావొద్దని కోరింది.
క్యాంపు కార్యాలయానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ.. పెద్దలతో చర్చలు
వైసీపీలో ఏడవ జాబితాపై కసరత్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో.. సీఎంవో నుంచి పిలుపు అందుకున్న నేతలు తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు ఎమ్మెల్యేలు, నేతలు క్యూ కడుతున్నారు. ఈరోజు సీఎంవో కార్యాలయానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ, కర్నూలు నియోజకవర్గానికి చెందిన ఎస్వీ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఆరు జాబితాలు విడుదల చేసిన వైసీపీ.. మరో జాబితాను సిద్ధం చేస్తుంది. రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కసరత్తులు చేస్తోంది. కాగా.. వైసీపీ ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించింది. సిద్ధం పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. అయితే గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న అధికార పార్టీ.. అన్ని నియోజకవర్గ స్థానాలపై ఫోకస్ పెట్టి మార్పులు చేర్పులు చేస్తోంది.