శునకానందం పొందొద్దని నీ మాజీకి చెప్పు.. రేణు దేశాయ్ కు అంబటి వార్నింగ్
ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కితున్నాయి. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ మరియు వైసీపీ నేత అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెల్సిందే. బ్రో సినిమాలో అంబటి రాంబాబును ఉద్దేశించి శ్యామ్ బాబు అనే పాత్రను తీసుకొచ్చారని, కావాలనే ఆ పాత్రను తనను అగౌరపర్చడానికే సృష్టించారని అంబటి ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఇక ఈ విషయమై అంబటి ఢిల్లీ వరకు వెళ్ళాడు. అంతేకాకుండా ఒక ప్రెస్ మీట్ లో పవన్ మూడు పెళ్లిళ్ల గురించి ఒక సినిమా తీస్తానని డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. అయితే అంబటి వ్యాఖ్యలపై పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించింది. తన మాజీ భర్త పవన్ సినిమా, రాజకీయాల గురించి మాట్లాడింది. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోను రిలీజ్ చేస్తూ.. ” తన మాజీ భర్త, భార్యల గురించి నలుగురు పిల్లల గురించి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేయడానికి కొంతమంది రెడీ అయ్యారని నాకు సమాచారం అందింది. వారందరికీ ఒక విన్నపం. ఇలాంటి వాటిలోకి పిల్లలను లాగకండి. ఒక సినిమా స్టార్ కి రాజకీయంగా ఎదుగుతున్న ఒక వ్యక్తికి వారు పిల్లలు కాబట్టి వారు ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదు. వారు ఇంకా ఇప్పుడు పిల్లలే కదా, వాళ్లు రాజకీయాల్లో చేయాల్సిందేమీ లేదు రాజకీయంగా జరుగుతున్న విషయాల్లో వాళ్ళు వేలు పెట్టలేదు కదా. నేనొక తల్లిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫ్యాన్స్ కానివ్వండి.. హేటర్స్ కానివ్వండి.. సపోర్టర్స్ కానివ్వండి.. దయచేసి పిల్లల్ని ఇందులోకి లాగొద్దు” అంటూ చెప్పుకొచ్చింది.
జనసేనలో చేరిన మాజీ మంత్రి.. పవన్ సమక్షంలో చేరిక
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటిస్తున్నారు. మూడో విడత వారాహి యాత్రలో పాల్గొనేందుకు వెళ్లారాయన. రెండు విడతలు విజయవంతంగా పూర్తి చేసుకుని.. మూడో విడత యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా.. అక్కడికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కలిసిన మాజీ మంత్రి పడాల అరుణ జనసేనలో చేరారు. పవన్ కల్యాణ్ సమక్షంలో ఆమె జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ… ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి పవన్ కల్యాణ్ నాయకత్వం అవసరమని తెలిపారు. యువతకు మేలు చేసే పవన్ నిర్ణయాలు, ఆలోచనలు తనకు నచ్చాయని చెప్పారు. ఈ కారణం వల్లే తాను జనసేనలో చేరానని ఆమె పేర్కొన్నారు.
విపక్షాలకు ప్రధాని ధన్యవాదాలు.. 2028లో మరో అవిశ్వాస తీర్మానమంటూ జోస్యం
అవిశ్వాసం పెట్టిన విపక్షాలకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రధాని మోడీ ప్రసంగించారు. దేవుడే అవిశ్వాసం పెట్టాలని విపక్షాలకు చెప్పారని ఆయన అన్నారు. మూడు రోజులుగా చాలామంది మాట్లాడారని.. 2018లో కూడా అవిశ్వాసం పెట్టారు. కానీ, విపక్షాలకు ఎంత మంది ఉన్నారో.. అన్ని ఓట్లు కూడా రాలేదని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. 2024లో ఎన్డీయే కూటమి అన్ని రికార్డులు బద్ధలు కొడుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై దేశ ప్రజలు పదే పదే విశ్వాసం చూపిస్తున్నారని.. కోట్లాది దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి తాము ఇక్కడ ఉన్నామన్నారు. ఇది విపక్షాలకే పరీక్ష అని తెలిపిన ప్రధాని.. అవిశ్వాస తీర్మానం కేంద్ర సర్కారుకు శుభపరిణామేనని పేర్కొన్నారు.
వాహనదారులకు శుభవార్త.. చలాన్లపై 50 శాతం రాయితీ
వాహనదారులను అదుపు చేస్తూ… అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనేక ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వాలు ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తుంటారు. కొన్ని కొన్ని సందర్భాల్లో జైలుకు కూడా పంపిస్తారు. అయితే పోలీసులు విధించిన జరిమానాను కొందరు కట్టేస్తారు. మరికొందరు వాటిని పెండింగ్‌లో పెట్టేస్తూ ఉంటారు. అయితే ఇలా పెండింగ్ లో ఉండే మొండి బకాయిలను రాబట్టేందుకు ప్రభుత్వాలు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. ఇప్పటికే దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలు ఇలాంటి ఆఫర్ల ఎన్నింటినో ప్రకటించాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. వారికి చలాన్లపై 50 శాతం రాయితీని ప్రకటించింది.
మానవీయ కోణంలో సీఎం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారు
నల్లగొండ జిల్లాలో వీఆర్వోలకు రీ- అలాట్మెంట్ ఆర్డర్స్, జూనియర్ పంచాయతీ సెక్రెటరీలకు రెగ్యులరైజేషన్ ప్రొసీడింగ్స్‌ను మంత్రి జగదీష్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, గాదరి కిషోర్ కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, రవీంద్ర కుమార్, భాస్కర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మానవీయ కోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన చేస్తున్నారన్నారు. మిషన్ భగీరథ పథకం చేపడితే కూడా కేసులు వేశారు కొంత మంది దుర్మార్గులు అని ఆయన మండిపడ్డారు.
ఏపీ రాజకీయాలపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు
విజయవాడలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్ సందడి చేసారు. కృష్ణానది ఒడ్డున బెజవాడ ప్రజలతో మాట్లాడారు. రాష్ట్రం అంతా మూడు సార్లు తిరిగానని ఈ సందర్భంగా తెలిపారు. చిరంజీవి, పవన్ లు జనసేన పార్టీని అల్లు అరవింద్ మధ్యవర్తిగా అమ్మకానికి పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రజల వద్దకు పాల్ అని తిరుగుతున్నా అని కేఏ పాల్ అన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చిరంజీవి జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నదమ్ములు చిరంజీవి, పవన్ లు మాట్లాడుకుని విలీనం గురించి.. అల్లు అరవింద్ మధ్యవర్తిగా జనసేనను అమ్మకానికి పెట్టారంటూ పాల్ తెలిపారు. బీజేపీలో జనసేన విలీనం చేస్తే వేల కోట్లు వస్తాయని అల్లు అరవింద్ మాస్టర్ మైండ్ తో నిర్ణయించారని కేఏ పాల్ అన్నారు. పవన్ ది వారాహి యాత్ర కాదు.. మోదీ యాత్ర అని విమర్శించారు.
భోళా శంకర్‌కి అడ్డంకులు తొలిగాయ్.. ఇక రచ్చ రచ్చే అంటున్న మెగా ఫాన్స్
తమిళంలో అజిత్ నటించిన వేదళం తెలుగులో భోళా శంకర్‌గా రీమేక్ అయింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య వంటి సూపర్‌హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే భోళా శంకర్ సినిమా విడుదలపై ఎట్టకేలకు సందిగ్ధత తొలిగింది. తనకు ఏజెంట్ సినిమా సమయంలో హక్కుల విషయంలో అన్యాయం జరిగిందని, భోళా శంకర్ రిలీజ్ లోపు తనకు డబ్బులు విషయంలో ఏదో ఒక క్లారిటీ ఇస్తానని చెప్పారని ఇప్పుడు ఫోన్ ఎత్తడం లేదని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్ కోర్టును ఆశ్రయించారు. ఇక నిన్న ఈ కేసులో వాదనలు జరుగగా ఈ రోజుకు వాయిదా వేశారు. ఇక ఈ క్రమంలో మరోసారి భోళా శంకర్ సినిమా విడుదలపై సివిల్ కోర్టులో వాదనలు జరిగాయి. ఏజెంట్ సినిమాలో నగదు లావీదేవీలలో వివాదంపై సివిల్ కోర్టులో వాదనలు జరగగా జడ్జి అడిగిన క్లారిఫికేషన్లపై వాదనలు వినిపించారు ఇరు వర్గాల న్యాయవాదులు.
మూజువాణి ఓటుతో వీగిన అవిశ్వాస తీర్మానం
కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో వీగిపోయింది. మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. లోక్‌సభలో విపక్షాల వాకౌట్ చేయడంతో ఓటింగ్ లేకుండానే అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభ నుంచి సస్పెండ్ అయ్యారు. పార్లమెంట్‌లో బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించడంతో కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరిని లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు. ప్రివిలేజెస్ కమిటీ అధిర్ రంజన్ చౌదరికి వ్యతిరేకంగా తన నివేదికను సమర్పించే వరకు సస్పెండ్ చేయబడతారు.
పార్లమెంటరీ కార్యకలాపాల సమయంలో చౌదరి నిరంతరం ఆటంకాలు కలిగిస్తున్నారని, దేశాన్ని, దేశ ప్రతిష్టను కించపరిచారని ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. “ఇది అలవాటుగా మారింది. పదేపదే హెచ్చరించినప్పటికీ ఆయన తనను తాను మెరుగుపర్చుకోలేదు. తన చర్చల్లో ఎప్పుడూ నిరాధారమైన ఆరోపణలు చేస్తుంటారు. ఆయన దేశాన్ని, దేశ ప్రతిష్టను కించపరుస్తారు. ఎప్పుడూ క్షమాపణ చెప్పరు.” అని ప్రహ్లాద్ జోషి అన్నారు.
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దయింది. బుధవారం రాత్రి జాతీయ అసెంబ్లీ రద్దయింది. పాక్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విజ్ఞప్తి మేరకు జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షుడు అరీఫ్ అల్వీ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువరించారు. అంతకుముందు ఇస్లామాబాద్‌లో ఫెడరల్ క్యాబినెట్ చివరి సమావేశానికి కూడా ప్రధాని అధ్యక్షత వహించారు. బుధవారం నేషనల్ అసెంబ్లీలో తన వీడ్కోలు ప్రసంగంలో షరీఫ్ మాట్లాడుతూ.. ఈ రాత్రి, సభ అనుమతితో, జాతీయ అసెంబ్లీ రద్దుకు సంబంధించిన సలహాను అధ్యక్షుడికి పంపుతాను అని పేర్కొన్నారు. దీంతో పాక్ పార్లమెంట్ దిగువసభతో పాటు ముస్లిం లీగ్- నవాజ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మూడు రోజుల ముందుగానే రద్దు అయ్యింది. పాక్ జాతీయ అసెంబ్లీ రద్దు కావడంతో త్వరలోనే పాక్‌లో ఎన్నికలు జరగనున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం పదవీ కాలం పూర్తయిన తర్వాత రెండు నెలలులోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ, ముందస్తుగానే జాతీయ అసెంబ్లీ రద్దు కావడంతో ఎన్నికల నిర్వహణకు 90 రోజుల సమయం మాత్రమే ఉంది. గడువుకు కొన్ని గంటల ముందే పాకిస్తాన్ ప్రభుత్వం రద్దయిన నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కొలువుదీరనుంది. 90రోజుల్లో పూర్తిచేసేందుకు వెసులుబాటు లభించినప్పటికీ.. ఇవి మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.
జమ్మికుంటకు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తా
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా కరీంనగర్ జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్‌లో చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత వారోత్సవాలకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ మరో సారి హాట్ కామెంట్స్ చేశారు. జమ్మికుంట కు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తానని, ఎన్ని కోట్లు అయిన సరే నాయిని చెరువుకు మహర్ధశ తీసుకు వస్తానన్నారు పాడి కౌశిక్ రెడ్డి. ఎమ్మార్వో, ఎంపీడీఓ, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అధునాతన పద్దతిలో నిర్మాణం చేపడుతామని, జమ్మికుంట నడి బొడ్డులో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి తొలగిస్తామన్నారు. నూతన బ్రిడ్జి నిర్మాణం చేపడుతామని ఆయన వెల్లడించారు.
జైలర్ డిజాస్టర్.. విజయ్ ఫ్యాన్స్ అరాచకం
హీరోలు అన్నాక ఫ్యాన్స్ ఎలా ఉంటారో యాంటీ ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. ఇక హీరోల ఫ్యాన్ వార్స్ చూస్తే చాలామందికి మెంటల్ ఎక్కడం ఖాయమని చెప్పాలి. ఈ ఫ్యాన్ వార్ అనేది అన్ని ఇండస్ట్రీల్లో ఉంది. టాలీవుడ్ లో ఫ్యాన్స్ వార్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే టాలీవుడ్ కన్నా కోలీవుడ్ లో ఈ ఫ్యాన్స్ వార్ మరీ దారుణంగా ఉంటాయి. ముఖ్యంగా అజిత్- విజయ్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అన్న విషయం తెల్సిందే. ఓకే హీరో సినిమా రిలీజ్ అయితే ఇంకొక హీరో ఫ్యాన్స్ సినిమా డిజాస్టర్ అని నెగెటివ్ టాక్ పుట్టిస్తారు. ఇక థియేటర్ లను తగలబెట్టడాలు, పోస్టర్ లను చించేయడాలు చూస్తూనే ఉన్నాం. కాగా, తాజాగా విజయ్ ఫ్యాన్స్ రజినీకాంత్ పై విరుచుకుపడుతున్నారు. నేడు రజినీ నటించిన జైలర్ సినిమా రిలీజ్ ఆయిన విషయం తెల్సిందే. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుండగా .. ఇంకోపక్క విజయ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో #JailerDisaster అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే వారు ఇలా చేయడానికి రెండు కారణాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది.
ఆటో కన్సల్టెన్సీ, స్క్రాప్ డీలర్లు నిజాయితీగా వ్యాపారం చేయాలి
ఆటో కన్సల్టెన్సీ, స్క్రాప్ డీలర్లు నిజాయితీగా వ్యాపారం చేయాలని, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ (సీపీ) ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు నష్టం వాటిల్లుతున్నందున చోరీ వాహనాలను కొనడం మానుకోవాలని డీలర్లకు సూచించారు. చోరీకి పాల్పడిన వాహనాలను కొనుగోలు చేసే డీలర్లపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు. వివరాలతో ముందుకు వస్తే పోలీసుల వేధింపులు ఉండవని హామీ ఇచ్చారు. గురువారం భీమారంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో డీలర్లతో సమావేశం నిర్వహించి చోరీకి పాల్పడిన ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయడం వల్ల దొంగలకు ఏవిధంగా సహాయం చేసి బాధితులు ఆర్థికంగా నష్టపోతున్నారో వ్యాపారులకు వివరించారు.
మహిళను, ఆమె కొడుకును చితకబాదిన క్యాబ్ డ్రైవర్.. ఏం జరిగిందంటే?
ఇటీవల ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినట్లు కేసులు నమోదైన ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా బెంగుళూరులో ఉబెర్ డ్రైవర్ మహిళా ప్రయాణికురాలు, ఆమె కొడుకుపై దాడికి పాల్పడడం కలకలం రేపింది. తప్పు క్యాబ్‌లోకి ప్రవేశించినందుకు 48 ఏళ్ల మహిళ, ఆమె కొడుకుపై దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం బెంగళూరులోని భోగనహళ్లిలోని నివాస ప్రాంతంలో తన కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లాలని మహిళ క్యాబ్‌ను బుక్ చేసినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఓ మహిళ తన కొడుకును ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసింది. కొంతసేపటి తర్వాత క్యాబ్ బుక్ చేసిన ప్రదేశానికి చేరుకుంది. కొడుకుతో కలిసి ఆ మహిళ క్యాబ్‌లో కూర్చొని ఉండగా.. మరో క్యాబ్ ఘటనాస్థలికి వెళ్లింది. కారు కిందకు దిగేందుకు ప్రయత్నించిన మహిళ మరో క్యాబ్ ఎక్కేందుకు ప్రయత్నించింది. దీంతో ఓ క్యాబ్ డ్రైవర్ రెచ్చిపోయి.. వివాహిత మహిళ క్యాబ్ దిగి బుక్ చేసుకున్న క్యాబ్ ఎక్కబోతుండగా డ్రైవర్ ఒక్కసారిగా క్యాబ్ ఆపి ఆ మహిళపై దాడికి పాల్పడ్డాడు. అపార్ట్‌మెంట్ ముందు మహిళ తలపై కొట్టిన డ్రైవర్ ఆమె మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. దాడిని ఆపడానికి స్థానికులు జోక్యం చేసుకోవలసి వచ్చిందని పోలీసులు తెలిపారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులోని మల్లేశ్వరానికి చెందిన 25 ఏళ్ల డ్రైవర్ బసవరాజును పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నిఘా కెమెరాల్లో చిక్కింది.ఈ విషయాన్ని మహిళ భర్త సోషల్ మీడియా వేదికగా పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఉబెర్‌కు కూడా ఫిర్యాదు చేశాడు.
తెలంగాణ రావడానికి జగన్ కారణం
విశాఖలోని జగదాంబ సెంటర్ లో మూడో వారాహి యాత్ర బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు జనసైనికులు భారీగా తరలివచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై పోరాడటానికి విశాఖ దైర్యం ఇచ్చిందని అన్నారు. ఏమి మాట్లాడతాడో చూద్దాం అనుకుంటున్న వైసీపీ నాయకులకి నమస్కారాలు అంటూ మొదలుపెట్టారు. ప్రొద్దునే పథకం కింద డబ్బులు ఇస్తారు.. సాయంత్రం సారా కింద డబ్బులు లాగేసుకుంటుందని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు గుండాలు, రియల్ ఎస్టేట్ రాబందుల చేతులలో విశాఖ ఇరుక్కుపోయిందని ఆరోపించారు. వారి తోలు తీయడానికి పవన్ కళ్యాణ్ మీ కోసం ఉన్నారని తెలిపారు. గుండాల కాలుకి కాలు, కీలుకి కీలు తీసే ప్రభుత్వం వస్తుందని అన్నారు.