నేడు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం..
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఈరోజు (జనవరి 20) మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీని కోసం ఇప్పటికే, కుటుంబ సమేతంగా ఆయన ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌కు చేరుకున్నారు. అయితే, గత నాలుగేళ్ల క్రితం అధికార మార్పిడి సమయంలో క్యాపిటల్ భవనంపై తన మద్దతుదారులు చేసిన దాడితో వైట్ హౌస్ ను ట్రంప్ వీడాడు. ఈసారి ప్రపంచ దేశాల ప్రముఖులు హాజరు కాబోతున్న ఈ ప్రమాణ వేడుకకు ఏర్పాట్లన్నీ కంప్లీట్ అయ్యాయి. కానీ, ఈరోజు విపరీతమైన చలి కారణంగా వేడుకను బయట కాకుండా క్యాపిటల్ భవంతి లోపలే నిర్వహిస్తున్నారు. రొనాల్డ్ రీగన్ 1985లో అమెరికా అధ్యక్షుడిగా సెకండ్ టైం బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా ఇలాగే చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక, 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండోసారి అలా జరగబోతుంది. మరోవైపు, డొనాల్డ్ ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ వాషింగ్టన్ లో పెద్ద సంఖ్యలో నిరసనకారులు ఆందోళన చేస్తున్నారు. తొలిసారి ట్రంప్ అధ్యక్షుడు అయినప్పుడు కూడా ఇదే తరహాలోనే నిరసనలు చేశారు.
ఖోఖో ప్రపంచకప్ గెలిచిన భారత్.. ఒకటి కాదు రెండు!
మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. అద్భుత ఆటతో మహిళలు, పురుషుల విభాగాల్లో విజేతగా నిలిచింది. ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన మహిళల ఫైనల్లో నేపాల్‌ను 78-40తో భారత్ ఓడించింది. ప్రియాంక ఇంగ్లే నేతృత్వంలోని భారత జట్టు ఛేజ్ అండ్ డిఫెన్స్ రెండింటిలోనూ ఆధిపత్యం చెలాయించి మొట్టమొదటి ఖోఖో ప్రపంచకప్‌ను గెలుచుకుంది.
అలా చేస్తేనే అమెరికాలో టిక్‌టాక్ సేవలను తిరిగి ప్రారంభిస్తాం..
టిక్‌టాక్ సేవలకు సంబంధించి అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్‌టాక్ కంపెనీలో సుమారు 50 శాతం వాటా యూఎస్ పెట్టుబడిదారుల చేతిలో ఉండేలా కండిషన్ తో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఆ సేవలను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు. తద్వారా అమెరికా భద్రతకు సంబంధించి మరో ఒప్పందం చేసుకోనున్నారు.. ఉమ్మడి వెంచర్‌లో 50 శాతం వాటా ఉండాలి.. దీనికి వారు ఒకే అంటే మేమే టిక్‌టాక్‌ను రక్షిస్తామని ఆయన వెల్లడించారు. అప్పుడు టిక్ టాక్ మరింత అద్భుతంగా నడిపించే వారి చేతుల్లోకి వెళుతుందన్నాడు. దాంతో మేము టిక్ టాక్ సేవలకు అనుమతిస్తామని తన సోషల్ మీడియా ట్రూత్‌లో డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చాడు.
నేటి నుంచి సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన.. పెట్టుబడులే టార్గెట్!
రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు సీఎం వెళ్తున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ సాగే ఈ పర్యటనలో దిగ్గజ పారిశ్రామికవేత్తల వరుస భేటీలతో సీఎం బిజీ బిజీగా గడపనున్నారు. ‘బ్రాండ్ ఏపీ’ ప్రమోషన్ పేరుతో దావోస్‌లో సీఎం బృందం ఐదు రోజుల పాటు పర్యటించనుంది. సీఎం చంద్రబాబు వెంట ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్, ఈడీబీ అధికారులు ఉన్నారు.
ఓటీటీ స్ట్రీమింగ్ కు వస్తున్న మోహన్ లాల్ బిగ్గెస్ట్ డిజాస్టర్
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ దర్శకత్వంలో తానే హీరోగా నటించిన సినిమా బరోజ్: గార్డియన్ ఆఫ్ ట్రెజర్. దాదాపు మూడేళ్ళుగా షూటింగ్ చేసుకున్న ఈ సినిమా గతేడాది డిసెంబరు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. 3డిలో తెరకెక్కిన ఈ చిత్రంలో మోహన్‌లాల్ శతాబ్దాలుగా వాస్కోడిగామా దాచిన నిధిని కాపాడుతున్న బరోజ్ అనే జెనీ పాత్రలో కనిపించాడు. మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ తో పాటు హిందీ భాషలలో ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ సినిమా తోలి ఆట నుండే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
ఇవాళ్టి నుంచి సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన
సింగపూర్ పర్యటనలో మూడు రోజుల పాటు సీఎం, మంత్రి, రాష్ట్ర బృందం విశేషంగా కార్యకలాపాలు నిర్వహించింది. కీలక చర్చల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, అవకాశాలను ఆకర్షించింది. సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE)తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం అవగాహన కుదిరింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ.3,500 కోట్లతో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా ముందుకొచ్చింది. క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ రూ.450 కోట్లతో హైదరాబాద్‌లో ఐటీ పార్కు అభివృద్ధికి ప్రతిపాదన చేసింది. సెమీ కండక్టర్ పరిశ్రమలపై చర్చలు విజయవంతమయ్యాయి. సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్, ఇతర ప్రతినిధులతో సంప్రదింపులు జరిగాయి.
శ్రీవారి ఆలయంలో ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు!
తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను అర్చకులు మూసివేశారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ నెల10న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు.. ఆదివారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగిశాయి. వైకుంఠ ద్వారాలు తిరిగి డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశికి తెరుచుకోనున్నాయి. ఈఏడాది రెండుసార్లు వైకుంఠ ఏకాదశి పర్వదినం వచ్చింది.
శ్రీవారి ఆలయంలో పది రోజులు పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించారు. పది రోజుల వ్యవధిలో 6 లక్షల 83 వేల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ 6.83 లక్షల మంది భక్తులకు ఉచిత సర్వదర్శన టోకెన్లను టీటీడీ జారీ చేసింది. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భారీగా హుండీ కానుకలు వచ్చాయి.
కోల్కతా డాక్టర్ కేసులో సంజయ్ రాయ్కి నేడు శిక్ష ఖరారు..
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై 2024 ఆగస్టు 9వ తేదీన పోలీసు వాలంటీర్ గా పని చేస్తున్న సంజయ్ రాయ్ దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. ఈ ఘటనపై జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం చెలరేగింది. నవంబర్ 12న విచారణ ప్రారంభమైన తర్వాత సీల్దా కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్.. సంజయ్ రాయ్ ను దోషిగా తేల్చుతూ తీర్పును వెల్లడించారు. అయితే, తీర్పు సమయంలో, సంజయ్ రాయ్ మాట్లాడుతూ.. తనను ఈ కేసులో ఇరికించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. ఇక, శిక్ష ఖరారుకు ముందు ఈరోజు మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని సంజయ్ రాయ్ కి న్యాయమూర్తి చెప్పాడు.
తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
సంక్రాంతి పండుగ ముగిసినా, తెలుగు రాష్ట్రాలను చలి వదలడం లేదు. ముఖ్యంగా తెలంగాణలో చలి తీవ్రత మరింత పెరిగింది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయి, ప్రజలు ఆహారపు జాగ్రత్తలు పాటించేందుకు, వేడి బట్టలు ధరించేందుకు మక్కువ చూపుతున్నారు. తెలంగాణలో సోమవారం తెల్లవారుజాము నుంచి చలి తీవ్రత అధికంగా నమోదు కావడంతో వాతావరణ శాఖ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదాహరణకు, ఆదిలాబాద్ జిల్లాలో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ వివరించింది.