నెరవేరనున్న దశాబ్దాల కల.. బందర్‌పోర్టుకు నేడే శంకుస్థాపన
కృష్ణా జిల్లా వాసుల దశాబ్దల కల నెరవేరనుంది. సుదీర్ఘ కాలం తర్వాత బందరు పోర్టు శంకుస్థాపనకు నోచుకోనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బందరు పోర్టుకు ఇవాళ శంకుస్థాపన చేస్తారు. ఉదయం 8 గంటల 30 నిమిషాలకు తాడేపల్లి నుంచి బందరుకు హెలికాప్టర్ లో బయలుదేరతారు. తాపసిపుడి హెలిపాడ్ దగ్గర దిగి.. 9 గంటల 10 నిమిషాలకు పోర్ట్ దగ్గర భూమి పూజలో జగన్ పాల్గొంటారు. తర్వాత పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అక్కడినుంచి మచిలీపట్నం టౌన్‌లోని భారత్ స్కౌట్స్ గ్రౌండ్‌కు చేరుకుని ఫోటో గ్యాలరీని వీక్షిస్తారు. అక్కడే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.. బందరు పోర్టును సుమారుగా 11,454 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. తొలి దశలో 5,156 కోట్టు పెట్టుబడి పెట్టనున్నారు. దీని సామర్థ్యం 116 మిలియన్ టన్నులు. మొత్తం 16 బెర్తులతో నిర్మించనున్నారు. తొలి దశలో నాలుగు బెర్తులు, 35 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో పోర్టును నిర్మిస్తారు. ఇందుకు సంబంధించి 3,668.83 కోట్ల విలువైన పనుల కాంట్రాక్టును రివర్స్ టెండరింగ్ విధానంలో మేఘా ఇంజనీరింగ్ లిమిటెడ్ దక్కించుకుంది. తొలి దశలో నిర్మించే నాలుగు బెర్తుల్లో రెండు సాధారణ బెర్తులు కాగా ఒకటి కోల్, మరొకటి మల్టీపర్పస్ బెర్తు. ఈ పోర్టు నిర్మాణం ద్వారా తెలంగాణతో పాటు ఏపీలోని కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు ప్రయోజనం కలుగుతుంది. ఎరువులు, బొగ్గు, వంట నూనెలు, కంటైనర్ల దిగుమతులకు ఈ పోర్టు అనువుగా ఉంటుందని అంచనా. ఈ పోర్టు క్లింకర్, గ్రానైట్ బ్లాక్, ముడి ఇనుము ఎగుమతికి ప్రయోజనకరంగా ఉంటుంది. పోర్టు అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుంది.
పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిలిమినరీ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలుంటే..
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నిర్వహించిన తుది పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ని రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఇవాళ ఉదయం నుంచి నియామక మండలి వెబ్‌సైట్ www.tslprb.in లో అందుబాటులో ఉంటుంది. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ (సివిల్ అండ్ టెక్నికల్) జాబ్స్ మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 30న నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ఈరోజు విడుదల చేసింది. TSLPRB పోలీస్ కానిస్టేబుల్ (సివిల్), PC డ్రైవర్, మెకానిక్, ట్రాన్స్‌పోర్ట్, IT మొదలైన పోస్టుల కోసం ఫైనల్ పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ని విడుదల చేసింది. ప్రిలిమినరీ కీ సోమవారం నుండి TSLPRB అధికారిక వెబ్‌సైట్ https://www.tslprb.in/లో అందుబాటులో ఉంది. ఉదయం. అయితే.. ఈ ప్రాథమిక ‘కీ’లో అభ్యంతరాలుంటే.. మే 24 సాయంత్రం 5 గంటల వరకు. అభ్యంతరాల కోసం ప్రత్యేక ప్రొఫార్మాను అందుబాటులో ఉంచారు. అపాయింట్‌మెంట్ బోర్డు చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ అభ్యంతరకర ప్రతి ప్రశ్నకు ప్రొఫార్మా ప్రకారం నమోదు చేయాలని సూచించారు. ఏప్రిల్ 30న జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ఫైనల్ పరీక్షకు 1,09,663 మంది సివిల్ కానిస్టేబుల్ అభ్యర్థులు, 1,08,055 మంది పరీక్షకు హాజరయ్యారు. ఐటీ అండ్ కమ్యూనికేషన్ అభ్యర్థులు 6,801 మందికి గాను 6,088 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. సివిల్ కానిస్టేబుల్ విభాగంలో 98.53 శాతం, ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో 89.52 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారు. TSLPRB జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, మొత్తం 16,969 కానిస్టేబుల్ పోస్టులకు 1,75,657 మంది అభ్యర్థులు తుది పరీక్షకు అర్హత సాధించారు. ఈ క్రమంలో ఒక్కో పోస్టుకు 11 మంది వరకు పోటీ పడుతున్నారు. అయితే, కీలకమైన సివిల్ సెక్టార్‌లో 15,644 పోస్టులు ఉన్నాయి. వీటి కోసం 90,488 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఏడీ ఐటీ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో ఒక్కో పోస్టుకు 25 మంది, మెకానిక్ విభాగంలో 56 మంది, డ్రైవర్ విభాగంలో 65 మంది, రవాణాశాఖలో 143 మంది, ఎక్సైజ్ విభాగంలో 97 మంది, అగ్నిమాపక శాఖ ఆపరేటర్ విభాగంలో 12 మంది చొప్పున పోటీ పడుతున్నారు. భారీ సంఖ్యలో పోస్టులు ఉండడంతో అభ్యర్థులు ప్రభుత్వ ఉద్యోగంపైనే ఆశలు పెట్టుకున్నారు.
మరో రెండ్రోజులు వర్షాలే.. వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. నిన్న (ఆదివారం) రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఉదయం వరకు వర్షం కురిసింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం కాగా, పలు చోట్ల వర్షపు నీరు రోడ్లపైనే నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా పలుచోట్ల చెట్లు నేలకూలాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలకు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దిల్ సుఖ్ నగర్, కోఠి, లక్డీకపూల్, అమీర్ పేట్ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. పుత్లిబౌలి, ఎంజే మార్కెట్, గన్ పార్క్ పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచింది. రాజేంద్రనగర్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం భీభత్సాన్ని సృష్టించింది. అత్తాపూర్, కాటేదాన్, మైలార్ దేవ్ పల్లి, బండ్లగూడ, నార్సింగీ, గండిపేట ప్రాంతాలలో వర్షం కారణంగా గత రెండు గంటలుగా పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో కాలనీ వాసులు ఇబ్బంది తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఇక రానున్న మూడు గంటల పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురిసే అవకావం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్‌లో మరో రెండు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. ఇవాల జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, హైదరాబాద్, యాదాద్రి భువనపల్లి, హైదరాబాద్ జిల్లా. ఓ చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
ఉత్కంఠకు తెర.. ఆర్సీబీ ఆశలు ఆవిరి.. ఇక మిగిలింది ఈ జట్లే..
ఐపీఎల్ ప్లేఆఫ్ దశకు చేరుకుంది. నాలుగు జట్లు ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి. దీంతో 16వ సీజన్ విజేత ఎవరో ఈ వారాంతంలో తేలిపోనుంది. పొట్టి ఫార్మాట్‌లో ఉత్కంఠభరిత పోరాటాల ఐపీఎల్ 16వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. నాలుగు జట్లు ప్లే ఆఫ్‌కు అర్హత సాధించాయి. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) ముందుగా ప్లే ఆఫ్‌కు చేరుకుంది. నెట్ రన్‌రేట్ ఆధారంగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రెండో స్థానంలో నిలిచింది. ఇక లక్నో సూపర్ జయింట్స్ (LSG) మూడో స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్ (MI)లలో ఎవరు ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తారన్నది చివరి రోజు వరకూ ఉత్కంఠ కొనసాగింది. అయితే, చివరి రోజు గుజరాత్ టైటాన్స్ చేతిలో (RCB) ఓడిపోయింది. మరోవైపు… సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్స్ గెలిచింది. తద్వారా (RCB)ని ప్లే ఆఫ్‌కు రాకుండా చేసింది. ఇక, రేపు తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతుంది. గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. 24న ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. లక్నో సూపర్ జయింట్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతుంది. ఈ మ్యాచ్ కూడా చెన్నైలోని చిదంబరం స్టేడియంలోనే నిర్వహిస్తారు. ఈ నెల 26న రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో తొలి క్వాలిఫయర్‌లో ఓడిన జట్టు, ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు తలపడతాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఇక 28న ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్‌ను కూడా నరేంద్ర మోడీ స్టేడియంలోనే నిర్వహిస్తారు. క్వాలిఫైయర్ ఒకటి, క్వాలిఫైయర్ 2 రెండులో గెలుపొందిన జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టును విజేతగా ప్రకటిస్తారు.
విరాట్ విశ్వరూపం.. రికార్డులు కల్లాస్..!
బెంగళూరులో గుజరాత్ టైటాన్స్- రాయల్ చాలెంజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు కోహ్లీ. 61 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కోహ్లీకి వరుసగా ఇది రెండో సెంచరీ. ఈ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు విరాట్. IPLలో విరాట్ కోహ్లీకి ఇది ఏడో సెంచరీ. అంతేకాదు… IPL చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన వీరుడిగా కోహ్లి నిలిచాడు. ఇప్పటి వరకు ఆరు సెంచరీలతో గేల్‌తో సమానంగా ఉన్న కోహ్లీ.. బెంగళూరు చినస్వామి స్డేడియంలో చేసిన సెంచరీతో అతన్ని దాటి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ప్రస్తుతం ఆరు సెంచరీలతో గేల్ 2 స్థానంలో ఉంటే.. ఐదు సెంచరీలతో జాస్ బట్లర్ మూడో స్థానంలో ఉన్నాడు. IPLలో ఒకే సీజన్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. గతంలో శిఖర్ ధావన్, జాస్ బట్లర్ వరుసగా రెండు సెంచరీలు సాధించారు. మొదానంలో కోహ్లీ చెలరేగుతుంటే.. స్టేడియంలోని అభిమానులు హర్షద్వానాలతో అతన్ని ప్రోత్సహించారు. మరోవైపు.. విరాట్ సెంచరీ చేయగానే అనుష్క శర్మ ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చింది.. మొత్తం మీద విరాట్ కోహ్లీ భీకర ఫామ్ లో ఉన్నాడు. కానీ, ఐపీఎల్-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. ఈ సారైనా టైటిల్‌ను గెలిచి 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భావించిన ఆర్సీబీకి మరోసారి నిరాశ ఎదురైంది. ఫ్లేఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.. చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో బెంగళూరు పరాజయాన్ని మూఠగట్టుకుంది.. 198 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో ఆర్సీబీ బౌలర్లు విఫలమయ్యారు. 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ కేవలం 19.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.. ఇక, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలవ్వగానే కోహ్లీ కన్నీరు పెట్టుకున్నాడు. ఆఖరిలో డగౌట్ కూర్చోని మ్యాచ్‌ను వీక్షించిన కోహ్లి.. తన జట్టు ఓడిపోవడంతో ఒక్కసారిగా భావద్వోగానికి గురయ్యాడు.
ఎన్టీఆర్ vs పవన్.. ఎవరి లెక్కెంత?
ప్రస్తుతం టాలీవుడ్‌లో నడుస్తున్న ట్రెండ్ మరో ఇండస్ట్రీలో ఎక్కడా లేదు. కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా చేయనంత హంగామా.. రీ రిలీజ్ సినిమాలకు చేస్తున్నారు అభిమానులు. కొత్త సినిమాల కలెక్షన్స్ ఏంటో గానీ.. రీరిలీజ్ సినిమాల వసూళ్లతో మా హీరో తోపు అంటే, మా హీరో టాప్ అని గోల చేస్తున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రీ రిలీజ్ విషయంలో కొట్టేసుకున్నంత పని చేస్తున్నారు. సోషల్ మీడియాలో #NonNTRRecords.. #NonPawanKalyanRecords అంటూ టాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. గత వారం, పది రోజులుగా ట్విట్టర్‌ని కబ్జా చేసేశారు ఎన్టీఆర్, పవన్ ఫ్యాన్స్. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే ఉండడంతో.. దేవర టైటిల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇదే సమయంలో పవన్ నుంచి ఉస్తాద్, బ్రో సినిమాల అప్డేట్స్ వచ్చాయి. ఈ అప్డేట్స్‌తో ఫాన్స్ రచ్చ రచ్చ చేశారు. ఇది అయిపోగానే.. రీ రిలీజ్ రికార్డుల లెక్కలతో కొట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సింహాద్రి సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా 1200 పైగా స్క్రీన్స్‌లలో రిలీజ్ చేశారు. దీని కోసం ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్ విశ్వక్ సేన్ గెస్ట్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు. 20 ఏళ్ల తర్వాత డిజిటల్ వెర్షన్‌తో మళ్లీ థియేటర్లోకి వచ్చిన సింహాద్రి సినిమా.. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా ఏకంగా 5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందంటున్నారు. గతంలో పవర్ స్టార్ ‘ఖుషి’ ఫస్ట్ డే 4 కోట్లకు గ్రాస్‌తో టాప్‌లో ఉంది. ఇప్పుడు ‘సింహాద్రి’ ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఈ లెక్కలో తేడా ఉందనేది పవన్ ఫ్యాన్స్ మాట. ఇదే విషయంలో ఇరువురు ఫ్యాన్స్ గట్టిగానే వాదించుకుంటున్నారు. ఫేక్ కలెక్షన్స్ అంటూ గోల చేస్తున్నారు. ముఖ్యంగా.. పవన్ ఫ్యాన్స్ చెప్పే మాట ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఖుషిని సింహాద్రి బ్రేక్ చేయలేకపోయిందని అంటున్నారు. అయినా ఓవరాల్‌గా చూస్తే.. సింహాద్రినే టాప్ ప్లేస్ అని తారక్ ఫ్యాన్స్ అంటున్నారు. ఏదేమైనా కొత్త సినిమాల విషయంలో లేని ఈ లెక్కల గొడవ.. రీ రిలీజ్ విషయంలో ఎందుకు? అనేది ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాలకే తెలియాలి.