ఓయో రూంలో గంజాయి దుకాణం పెట్టిన కేటుగాళ్లు
హైదరాబాద్ కొండాపూర్ లోని ఓయో రూమ్ లో గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని కావలికు చెందిన రాజు, మధ్యప్రదేశ్ కు చెందిన సంజనగా గుర్తించారు పొలిసు అధికారులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరు గత కొంతకాలంగా ఆరుకు ప్రాంతాల నుండి గంజాయి తీసుకువచ్చి, ఓయో రూమ్ లో ఉంటూ విక్రయాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసిన అధికారులు, వారి వద్ద నుండి 3.625 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యకు బిగుస్తున్న ఉచ్చు..?
కర్ణాటకలో ముడా కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఇతరులకు చెందిన 300 కోట్ల రూపాయల విలువైన 140 స్థిరాస్థుల్ని అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూ కేటాయింపుల్లో జరిగిన అక్రమాలపై మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా స్థిరాస్థుల్ని అటాచ్ చేసినట్లు చెప్పుకొచ్చింది.
మంచు ఫ్యామిలీలో మరో ట్విస్ట్.. ఇంటి నుంచి మనోజ్ ను బయటకు పంపాలని ఫిర్యాదు!
ఇప్పటికే మీడియాలో సంచలనంగా మారిన మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మరో ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. తన ఆస్తుల్లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని జిల్లా మెజిస్ట్రేట్‌కి మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలోని తన ఆస్తులను కొందరు ఆక్రమించుకున్నారని మోహన్ బాబు చేఇస్నా ఫిర్యాదులో ఉంది. వాళ్లను ఖాళీ చేయించి ఆస్తులను తమకు అప్పగించాలని మోహన్ బాబు ఫిర్యాదులో కోరారు. హైదరాబాదు జల్‌పల్లిలోని నివాసం వద్ద హైడ్రామా జరిగిన తరువాత మోహన్ బాబు లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తున్నారు.
కోల్‌కతా వైద్యురాలి కేసులో సంచలనం.. దోషిగా సంజయ్ రాయ్..
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం- హత్యపై కోల్‌కతాలోని సీల్దాలోని సెషన్స్ కోర్టు ఈరోజు (జనవరి 18) సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ని దోషిగా తేల్చింది. 160 పేజీల తీర్పులో, కోర్టు అత్యాచారం, హత్య, మరణానికి కారణమయ్యే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ల కింద రాయ్‌ను దోషిగా నిర్ధారించింది. ఈ కేసు విచారణలో మొదట సంజయ్ రాయ్ తాను నేరం చేశానని ఒప్పుకున్నప్పటికీ, తర్వాత తనను ఈ కేసులో ఇరికించారని ఆరోపించారు. అయితే, సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత సంజయ్ రాయ్ నేరం చేసినట్లు కోర్టులో తేలింది. సోమవారం ఈ కేసులో కోర్టు శిక్షల పరిమాణాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
ఏపీలో 9 గంటల ఉచిత విద్యుత్తు ఎత్తివేత ప్రచారం.. మంత్రి క్లారిటీ..
తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు ఎత్తివేతపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ క్లారిటీ ఇచ్చారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు మీడియా ముసుగులో పదే పదే విష ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. 11 సీట్లకు వైసీపీని ప్రజలు పరిమితం చేసిన ఆ పార్టీ నాయకుల బుద్ధి మారలేదన్నారు. వైసీపీ నేతలు.. మొన్నటి వరకూ వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగిస్తున్నామని చేసిన విష ప్రచారం బెడిసికొట్టిందన్నారు. ఇప్పుడు 9 గంటల ఉచిత విద్యుత్తు ఎత్తివేస్తున్నామని మరో అసత్య ప్రచారానికి తెరలేపారన్నారు.
పంట నష్ట పోయినప్పుడు ఏనాడైన రైతులను ఆదుకున్నారా..!
పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు గుర్తుకురాని రైతులు ఈ రోజు బీఆర్‌ఎస్ నాయకులకు గుర్తుకు వస్తున్నారా అని ప్రశ్నించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు బంధు నాట్లు వేసేటప్పుడు ఇచ్చాం అంటున్న వారికి, ప్రతి పంట కాలములో రైతుబంధు ఎప్పుడు మొదలు పెట్టి ఎప్పటిదాకా ఇచ్చారో తెలియకపోతే ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుండేదన్నారు. రైతుబంధు పేరు చెప్పి పంటల భీమా, వ్యవసాయ యాంత్రికరణ పథకాలకు తిలోదకాలు ఇచ్చింది ఏవరు.? అని ఆయన అన్నారు.
ఏపీలో అరుదైన వివాహం.. వధువుకు 68.. వరుడికి 64
వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధుడు… వృద్ధురాలు.. ఒకరిని ఒకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. రాజమండ్రి లాలాచెరువు వద్ద స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఈ అరుదైన వివాహం జరిగింది. వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలం కమ్మలకుంటకు చెందిన 68 ఏళ్ల గజ్జల రాములమ్మ… రాజమండ్రి నారాయణపురానికి చెందిన 64 ఏళ్ల మూర్తి మూడుముళ్ల బంధంతో ఏకమయ్యారు. వారి కుటుంబాలు పట్టించుకోకపోవడంతో గత రెండేళ్లుగా వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. మూర్తికి పక్షవాతం రావడంతో రాములమ్మ అతనికి సేవలు చేసింది. ఇటీవల ఆయన కోలుకున్నాడు. ఆమెని పెళ్లి చేసుకోవాలన్న కోరికను ఆశ్రమ నిర్వాహకుడు గుబ్బల రాంబాబుకు చెప్పడంతో వివాహానికి ఏర్పాటు చేసి అందరి సమక్షంలో వారిద్దరిని ఒకటి చేశారు. వివాహ వేడుకను నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ…
బీజేపీలో తరవాత అధ్యక్షుడు ఎవరో బీఆర్‌ఎస్ వాళ్ళు చెప్పగలరా.. బీఆర్‌ఎస్ నెక్ట్స్ ప్రెసిడెంట్ ఎవరో అందరికీ తెలుసు అని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌లో డైనింగ్ టేబుల్ మీద నిర్ణయాలు జరుగుతాయి…. బీజేపీలో అలా కాదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ మండల అధ్యక్షులలో 50 శాతం పైగా బీసీ లు ఉన్నారని, సంస్థాగత ఎన్నికలు పూర్తి కాగానే ప్రజా సమస్యల పై పోరాటమన్నారు కిషన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ అని, స్థానిక ఇష్యూ ల ఎజెండా గానే ఎన్నికలకి వెళ్తామన్నారు కిషన్ రెడ్డి .స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను ప్రజలకి వివరిస్తామని ఆయన వెల్లడించారు.
శ్రీవారి ఆలయ సమీపంలో గుడ్డు బిర్యాని.. ఇది టీటీడీ వైఫల్యమే..
తిరుమల విషయంలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కూటమి ప్రభుత్వం.. తాము అధికారంలోకి వచ్చాక జరుగుతున్నది ఏంటని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు. తిరుమలలో విజిలెన్స్ నిఘా పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. “మీ పాలనలో మద్యం, మాసం తిరుమలలో పట్టుబడుతున్నాయి. శ్రీవారి ఆలయానికి సమీపంలో గుడ్డు బిర్యాని పట్టుబడింది. అంటే టీటీడీ వైఫల్యం మరోసారి విఫలమైంది. మారణాయుధాలుతో వచ్చిన పట్టించుకోలేని పరిస్థితి కి తీసుకువచ్చారు. మీ ఎల్లో మీడియా ద్వారా అబద్ధపు ప్రచారాలు చేశారు. టీడీపీ నాయకులు సేవలో టీటీడీ ఛైర్మన్ పనిచేస్తున్నారు. భక్తులను పట్టించుకోవడం లేదు” అని టీటీడీ మాజీ ఛైర్మన్ సంచలన ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు
మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేశామని చెబుతూనే ఉద్యోగుల కష్టాలను విస్మరించారని ఆయన మండిపడ్డారు. శనివారం ఒక ప్రకటనలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. “మీ పాలనలో చిరు ఉద్యోగుల దుస్థితి దారుణంగా తయారైంది. వేతనాలు అందక ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి తీసుకొచ్చారు,” అని హరీష్ రావు పేర్కొన్నారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానికి, చిరు ఉద్యోగుల పేదరికం కనబడటం లేదని ఆయన విమర్శించారు. నాలుగు నెలలుగా పంచాయతీ కార్మికులు, మూడు నెలలుగా ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఎస్ (MGNREGS) ఉద్యోగులు, నెల రోజులుగా మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు పొందలేక చాలా ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు తెలిపారు. ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఓలు వంటి వేలాది చిరు ఉద్యోగులు తమ జీతాల కోసం ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నారనే దయనీయ పరిస్థితి నెలకొనిందని ఆయన వ్యాఖ్యానించారు.