నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు.. హాజరైన సీఎం
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ నేడు పూర్తి కానుంది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం నామినేషన్లు దాఖలు చేయగా.. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు, బీఆర్‌ఎస్ (BRS) నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ నుండి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం అభ్యర్థులు నయోమిఇన్టిన్ దాఖలు చేసారు. ఇక ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ (PCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ (CPI) నేతలు హాజరయ్యారు. అలాగే ఈ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు పలికింది ఎంఐఎం పార్టీ. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లకు మద్దతుగా ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి నలుగురు, బీఆర్‌ఎస్ నుంచి ఒక అభ్యర్థి మాత్రమే పోటీలో ఉండటంతో ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయ కేతనం ఎగరేసిన సంగతి తెలిసిందే.
పథకాలు అమలు, కార్యక్రమాల నిర్వహణపై సీఎం కీలక సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలు, కార్యక్రమాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. శాఖల వారీగా పురోగతిపై చర్చ జరిగింది… ఆర్టీజీఎస్ ప్రభుత్వ పథకాల అమలుపై సర్వే నిర్వహించింది.. దీనిపై చంద్రబాబు సమీక్ష చేశారు.. వివిధ పథకాల అమల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో చర్చించారు.. ప్రతి వారం నాలుగు శాఖలపై సమీక్ష చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రభుత్వ సేవల్లో నాణ్యత పెంచడం, ప్రజల సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలు చేయడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. ఈ వారం రెవెన్యూ సర్వీసులు, ఆసుపత్రుల్లో సేవలు, దేవాలయాలు, మున్సిపల్ శాఖల్లో సేవలపై వచ్చిన రిపోర్టులపై సమీక్ష చేశారు ఏపీ సీఎం..
ఓ పోలీస్ దర్యాప్తు అధికారిగా గర్వపడుతున్నాను
ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో దర్యాప్తు అధికారి నల్గొండ మాజీ ఎస్పీ రంగనాథ్ స్పందించారు. ఈ తీర్పుతో ఓ పోలీస్ దర్యాప్తు అధికారిగా గర్వపడుతున్నానని, సంతోషపడుతున్నట్లు ఆయన అన్నారు. ఈ కేసు దర్యాప్తు ఏకంగా ఏడేళ్ల పాటు సాగిందని, 1600 పేజీల ఛార్జ్‌షీట్ తయారు చేయడానికి తొమ్మిది నెలలు పట్టిందని ఆయన తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్, టెక్నాలజీ ఎనాలసిస్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా దర్యాప్తు జరిగిందన్నారు. మొత్తం 67 మంది సాక్షులను విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశామని చెప్పారు.
పదవులు రాలేదని ఎవరూ ఆందోళన చెందొద్దు.. లోకేష్ కీలక సూచనలు
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. ఆ కోటాలో పదవి పొందేందుకు చాలా మంది నేతలు ప్రయత్నాలు సాగించారు.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ని కలిసి.. విన్నవించుకున్నారు.. అయితే, ఉన్నది ఐదు సీట్లు మాత్రమే.. అందులో జనసేన, బీజేపీకి చెరో సీటు కేటాయించిన తర్వాత.. మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది టీడీపీ.. దీంతో, కొన్ని ప్రాంతాల్లో ఆందోళన జరిగినట్టు తెలుస్తోంది.. టికెట్ ఆశించి భంగపడిన నేతలు కొందరు అసహనం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం.. పార్టీ అధినేతపై నమ్మకాన్ని ప్రకటిస్తారు.. ఈ తరుణంలో.. మీడియా చిట్‌చాట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.. ఎమ్మెల్సీలుగా బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాం.. బలహీనవర్గాలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటాం అన్నారు లోకేష్..
పోసాని క్వాష్ పిటిషన్లపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
సినీ నటుడు పోసాని కృష్ణమురళి క్వాష్ పిటిషన్లపై విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసులో పీటీ వారెంట్ అమలు చేశామని కోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.. దీంతో, ఈ కేసు క్వాష్ చేయాలన్న పోసాని కృష్ణ మురళి పిటిషన్‌ను డిస్మిస్ చేసింది హైకోర్టు.. ఇక, విజయనగరం, గుంటూరు, అల్లూరి సీతా రామరాజు జిల్లా పోలీసులు నమోదు చేసిన కేసుల్లో 34 BNS ప్రకారం నోటీసు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.. మరోవైపు, విశాఖపట్నంలో నమోదైన కేసు క్వాష్ చేయాలన్న పోసాని కృష్ణమురళి పిటిషన్ పై విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు..
టీమిండియాకు శ్రేయాస్ అయ్యర్ సైలెంట్ హీరో..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. చివరి వరకు ఎంతో ఉత్కంఠ సాగిన ఈ మ్యాచ్.. 6 వికెట్ల నష్టానికి భారత్ 254 పరుగులు సాధించిన విజయ కేతనాన్ని ఎగురవేసింది. దీంతో.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని కైవసం చేసుకుంది. టీమిండియా తాజా గెలుపుతో మరో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. విజయనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. శ్రేయాస్ అయ్యర్‌ను సైలెంట్ హీరో అని వ్యాఖ్యానించాడు. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో టీమిండియాకు సైలెంట్ హీరోగా నిలిచిన ఆటగాడిగా రోహిత్ శర్మ శ్రేయాస్ అయ్యర్‌ను సెలక్ట్ చేశాడు. అతని గురించి ఎక్కువ మాట్లాడ లేకపోయినా.. అతను తన పనిని పూర్తి అంకితభావంతో చేశాడని రోహిత్ శర్మ తెలిపాడు. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లో భారత్ జట్టుకు శ్రేయాస్ అయ్యర్ కీలక సమయంలో మద్దతు ఇచ్చాడని పేర్కొన్నాడు.
రుషికొండ బీచ్లో మళ్లీ బ్లూఫ్లాగ్ జెండాను ఎగరవేస్తాం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో పర్యటక మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రుషికొండ బీచ్ లో మళ్లీ బ్లూఫ్లాగ్ జెండాను ఎగరవేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గత ప్రభుత్వ దుర్మార్గపు విధానాల అవశేషాలతో పర్యాటక రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఏపీలో బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటుకు కేంద్రం అనుకూలం.. పర్యాటక అభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన కోస్టల్ రెగ్యులేషన్ జోన్.. కేంద్ర ప్రభుత్వం నుంచి సడలింపు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీచ్ లో ఆక్రమణలు తొలగించడం, పరిశుభ్రత పాటించడం, ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ ను పెంపొందించడం లాంటి అంశాలపై దృష్టిసారించామని వెల్లడించారు. నెల్లూరు సమీపంలోని కోడూరు బీచ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం.. యూరోపియన్ లు బీచ్, వెల్ నెస్ టూరిజంలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని మంత్రి దుర్గేష్ తెలిపారు.
ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది
కాంగ్రెస్ ప్రభుత్వ 14 నెలల పాలనలో రాష్ట్రంలోని గురుకులాల్లో 83 మంది విద్యార్థుల మరణం భారతదేశ చరిత్రలో ఓ చీకటి అధ్యాయంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ రోజు తెల్లవారుజామున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజకవర్గం, ఇచ్చోడ మండలంలో ఓ 9వ తరగతి విద్యార్థి నిద్రలోనే మృతి చెందడం కలకలం రేపింది. ఈ ఘటనపై కేటీఆర్ ఎక్స్ (Twitter) వేదికగా స్పందించారు.
“గురుకులాల్లో విద్యార్థుల మరణ ఘోషను నిలువరించలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస మానవత్వం కూడా లేదని స్పష్టమైంది. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి విద్యార్థిని లాలిత్య అనుమానాస్పద స్థితిలో మరణించడం తీవ్రమైన విషాదం. కన్నుముందే పతనమైన తన కూతురిని చూసి శోకసంద్రంలో మునిగిన తల్లిదండ్రులను ఓదార్చాల్సింది పోయి, బాధిత తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దారుణమైన చర్య.
తెలంగాణలో గ్రూప్-1 ఫలితాలు విడుదల
తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష ఫలితాలను తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల నియామక మండలి (TGPSC) విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా మొత్తం 563 ఖాళీలకు ఎంపిక ప్రక్రియ చేపట్టారు. గతంలో నిర్వహించిన ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలను అధిగమించిన అభ్యర్థుల తుది ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఇక గ్రూప్-2 ఫలితాలు కూడా వెలువడనున్నాయి. రేపటికి (మార్చి 11) గ్రూప్-2 ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 20లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలను వెల్లడించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అభ్యర్థులు తమ వ్యక్తిగత ఫలితాలు, స్కోర్లు, కట్‌ఆఫ్ మార్కులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. తమ మార్కులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, నిర్దిష్ట గడువులోగా సంబంధిత అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
ఈ నెల 12న చేపట్టిన ‘యువత పోరు’ ద్వారా రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. యువత పోరు నిరసన కార్యక్రమంపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైసీపీ ప్రధాన కార్యదర్శులు, రీజనల్ కోఆర్డినేటర్లు, విద్యార్ధి, యువజన విభాగం నేతలు, 13 యూనివర్శిటీల విద్యార్ధి నాయకులు, మేధావులు, విద్యారంగ ప్రముఖులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్ధులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైఎస్ జగన్ యువత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు అని తెలిపారు. ఫీజు రీఇంబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం దిగి వచ్చే వరకూ పోరాడదామని సజ్జల వెల్లడించారు.