*కాంగ్రెస్, బీఆర్‌ఎస్.. హైదరాబాద్‌ని ఎంఐఎంకి రాసిచ్చింది: ప్రధాని మోడీ
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బుజ్జగింపు రాజకీయాలు చేసి హైదరాబాద్ ని ఎంఐఎంకి రాసిచ్చారని పీఎం మోడీ అన్నారు. బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతి విషయంలోనూ ఒక్కటే అన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు వీరు.. అధికారంలో ఉన్నప్పుడు వారు తిట్టుకున్నారని తెలిపారు. ఓటుకు నోటు కేసు విషయంలో బీఆర్ఎస్ మౌనంగా ఉంది.. కాళేశ్వరం అవినీతి అన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మర్చిపోయిందన్నారు. తెలంగాణలో డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అన్నారు. డబుల్ ఆర్ కలెక్షన్స్ తెలుగులో వచ్చిన ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ ని మించి పోయాయన్నారు. తెలంగాణని లూటీ చేస్తున్న ఒక ఆర్… ఢిల్లీలో దేశాన్ని లూటీ చేయాలని చూస్తున్న ఇంకో ఆర్ కి దోచిన సొమ్ము పంపుతున్నాడన్నారు. డబుల్ ఆర్ నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలన్నారు. గత ఐదేళ్ల నుంచి అంబాని ఆదాని జపం చేస్తున్నారు కాంగ్రేస్ యువరాజు అంటూ సెటైర్ వేశారు. ఇప్పుడు బీజేపీ రూపంలో ఎంఐఎంకి భయం పట్టుకుందన్నారు. మజ్లీస్ ని గెలిప్పించేందుకు రెండు పార్టీలు ఏకం అయ్యాయన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు దేశంలో మూడు దశల ఎన్నికలు జరిగాయన్నారు. ఈ మూడు దశల పోలింగ్ తర్వాత కాంగ్రెస్ నిరాశలో మునిగిందన్నారు. కరీంనగర్ లో బీజేపీ విజయం ఖరారు అయిందని తెలిపారు. ఈ పదేళ్ళలో భారత్ వేగంగా పురోగమించింది.. అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. భారత దేశం ప్రపంచంలో ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థ గా అవతరించిందని తెలిపారు. రక్షణ రంగంలో ఎగుమతులు చేసే స్థాయికి దేశం ఎదిగిందన్నారు. నేను ఇంతకు ముందు గుజరాత్ సీఎం గా చేసాను… నా సొంత రాష్ట్రంలో కూడా ఉదయం 10 గంటలకు ఇంత జన సమీకరణ చూడలేదన్నారు. ఇంతటి ప్రేమ చూపుతున్న తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో దేశం అన్ని రంగాల్లో నిర్వీర్యం అయిందన్నారు. బీజేపీ పాలనలో అన్ని రంగాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చిందన్నారు.
*వేములవాడలో కోడెమొక్కులు తీర్చుకున్న ప్రధాని.. సభలో మోడీ ప్రసంగం..
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మరోసారి తెలంగాణలో పర్యటించారు. వేములవాడ, వరంగల్‌లో జరిగే బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆయన రాజ్ భవన్ లో కాసేపు విశ్రాంతి తీసుకుని బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో వేములవాడకు బయలుదేరారు. వేములవాడ రాజన్న ఆలయంలో శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న ఆలయంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో జరిగిన బహిరంగ సభలో మోడీ పాల్గొన్నారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థి విజయం పక్కాగా కనిపిస్తోందన్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్ అడ్రస్ కూడా కనిపించడం లేదన్నారు. పదేళ్లుగా నా పనితీరు ఎలా ఉందో మీరంతా గమనించారన్నారు. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని తెలిపారు. రక్షణ రంగంలో దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి మనదేశం చేరిందన్నారు. మీరంతా బీజేపీకి ఓటు వేసిన కారణంగానే దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందని తెలిపారు. మన దేశంలో ఎంతో సమర్ధత ఉన్నా ఇన్నేళ్లు కాంగ్రెస్ ఆ సామర్థ్యాన్ని నాశనం చేసి సమస్యల వలయంగా మార్చిందని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఫ్యామిలీనే ఫస్ట్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తేడా ఏమీ లేదు.. ఆ పార్టీలను ఓడించి తెలంగాణను కాపాడుకోవాలన్నారు. మూడో దశ పోలింగ్ తర్వాత కాంగ్రెస్, ఇండియా కూటమి ఫ్యూజ్ ఎగిరిపోయిందని తెలిపారు.
*బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోండి.. బాచుపల్లి ఘటనపై సీఎం సీరియస్
హైదరాబాద్‌లో బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనపై సీఎం ఆరా తీశారు. దీనిపై అధికారులను సీఎం రేవంత్ అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రేవంత్ హామీ ఇచ్చారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశించారు. కుండపోత వర్షం పడడంతో ఒక్కసారిగా గోడ కూలినట్లు అధికారులు తెలిపారన్నారు. భవనానికి పక్కనే ఉన్న సెంట్రింగ్ పనిచేసే కార్మికుల్లో ఏడు మంది మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలైనట్లు తెలిపిన అధికారులు సీఎంకు వెల్లడించారు. చనిపోయిన వారు ఒరిస్సా ఛత్తీస్ఘడ్ రాష్ట్రాలకు చెందిన వారుగా తెలిపారు. చనిపోయిన వారిలో నాలుగు సంవత్సరాల బాబు, ఒక మహిళ, 4 పురుషులు ఉన్నారని వివరించారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
పోలీసుల దర్యాప్తు..
బాచుపల్లి ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. హారిజాన్ లగ్జరీ అపార్ట్మెంట్స్ రిటైనింగ్ వాల్ కూలి 7 గురు మృతి చెందగా 6 గురు గాయాలు అయ్యాయని తెలిపారు. హారిజాన్ లగ్జరీ అపార్ట్మెంట్స్ బిల్డర్ అరవింద్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. క్రిమినల్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. సమాచారం అందగానే హుటాహుటిన స్పాట్ కి వచ్చామన్నారు. హెచ్ఎండి & ఎన్ డి ఆర్ఎఫ్ & జీహెచ్ఎంసీ & పోలీసులు తెల్లవారు 4 గంటల వరకు రెస్యూ ఆపరేషన్ లో పాల్గొన్నామన్నారు. జెసిబి సహాయంతో శిథిలాల కింద ఉన్న ఏడుగురు మృతదేహాలు వెలికి తీసామన్నారు. ఆరుగురిని ప్రైవేట్ హాస్పిటల్స్ షిఫ్ట్ చేశామన్నారు. వందకు పైగా కార్మికులు సెంట్రింగ్ పని కోసం వచ్చారన్నారు. నిర్మాణంలో ఉన్న రిటైనింగ్ గోడ కూలడంతో ఘటన జరిగింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను ఒరిస్సా ఛత్తీస్గడ్ తరలిస్తామన్నారు.
*నాపై అనవసరంగా వివేకా హత్య కేసు మోపారు..
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండల కేంద్రంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్‌షోకు భారీ ఎత్తున ప్రజలు వైసీపీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. ఈ రోడ్ షోలో వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకా హత్యపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనపైన అనవసరంగావైఎస్ వివేకా హత్య కేసు మోపారని.. నన్ను, మా నాన్నను చాలా ఇబ్బందులకు గురి చేశారని వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. జైల్లో నాన్నను కలిసినప్పుడల్లా.. తనకు తెలిసి జీవితంలో ఎవరికి ఏ పాపం చేయలేదని.. దేవుడు ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు.. ఎందుకు ఇలా జరుగుతోంది అని నాతో అంటూ బాధపడేవాడరని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుని దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఇటీవల నాన్నకు బెయిల్ వచ్చిందన్నారు. మా కుటుంబంలో ఇద్దరు అక్కలు చంద్రబాబు ట్రాప్‌లో పడిపోయారని వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు. వాళ్ల డైరెక్షన్లో వీళ్లు నడుచుకుంటున్నారని ఆయన అన్నారు. దయచేసి ప్రజలు చంద్రబాబు ట్రాప్‌లో పడకుండా వైయస్ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తనకు తోడుగా ఉండాలని ప్రజలను కోరారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ వచ్చేలా ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నానన్నారు. ఏ తప్పు చేయనప్పుడు భగవంతుడు ఎల్లప్పుడూ తోడుంటాడు.. తాత్కాలికంగా కష్టాలు వచ్చినా వాటి వల్ల ఇబ్బంది కలగకుండా దేవుడు తోడుంటాడు.. ఇది తాను నమ్మిన సిద్ధాంతమన్నారు. “నేను సౌమ్యుడిని కావచ్చు నా మాట మెత్తగా రావచ్చు కానీ నా గుండె గట్టిది.. ఎన్నింటినైనా ఎదుర్కొనే ధైర్యం నాకుంది. ఎన్ని వచ్చిన ఎదురు నిలబడతా..” అని వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు.
*నేడు రాష్ట్రానికి కేంద్ర మంత్రి.. భువనగిరి సభలో అమిత్ షా ప్రసంగం
పార్లమెంట్ ఎన్నికలకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురు అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణకు వరుస కడుతున్నారు. అగ్రనేతలు ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించి ప్రచారం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. కేంద్రమంత్రి అమిత్ షా ఇవాళ (బుధవారం) రాత్రి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఈ రాత్రి హైదరాబాద్‌లోనే బస చేస్తారు. రేపు గురువారం (మే 9) అమిత్ షా తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. భువనగిరిలో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్ననున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. ఇక ఈ సభలో బీజేపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్‌కు మద్దతుగా స్థానిక రాయిగిరిలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. అమిత్ షా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని భువనగిరి స్థానిక బీజేపీ నేతలు వెల్లడించారు. ఈ మేరకు పట్టణ శివారులోని స్పిన్నింగ్ మిల్ వద్ద ఉన్న హెలిప్యాడ్ ను బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పాసం భాస్కర్, గూడూరు నారాయణరెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భువనగిరితో పాటు కేంద్రంలో భాజపా విజయం సాధిస్తుందన్నారు. అమిత్ షా బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అమిత్ రానున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ట్రాఫిక్ మల్లింపు ఉంటుందని, వాహనదారులు గమనించాలని కోరారు. అమిత్ షా సభ దృష్ట్యా ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామన్నారు. వాహనదారులు సహకరించాలని తెలిపారు.
*ఏడో దశ లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..?
భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహాలం కొనసాగుతుంది. ఏడు దశల్లో భాగంగా ఇప్పటికే మూడు ఫేజ్‌ల పోలింగ్ పూర్తి అయింది. అయితే, మరో నాలుగు దశల ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఈ క్రమంలోనే ఏడో దశ లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్‌ను ఇవాళ (బుధవారం) ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. చివరిదైనా ఏడో దశలో దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 57 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనున్నట్లు షెడ్యూల్ రూపొందించారు. ఇవాళ్టి (బుధవారం) నుంచి ఈ నెల 14 వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు గడువు ఇవ్వగా.. ఈ 15వ తేదీన నామినేషన్లను స్క్రూటీని చేయనున్నారు. ఇక, ఈ నెల 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరించుకునేందుకు ఎన్నికల కమిషన్ గడువు ఇచ్చింది. జూన్ 1వ తేదీన ఓటింగ్ జరగనుండగా.. జూన్ 4న అన్ని దశల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లోని ఒక స్థానంతో పాటు పశ్చిమ బెంగాల్ 9, ఉత్తరప్రదేశ్ 13, పంజాబ్ 13 , బీహార్ 8, ఒడిశా 6, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్‌లో 3 స్థానాలకు చివరి దశలో పోలింగ్ జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పోటీ చేస్తోన్న వారణాసి లోక్ సభ స్థానానికి కూడా 7వ దశలోనే పోలింగ్ జరగబోతుంది.
*వారసత్వ పన్ను అంశంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ దుమారం..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వారసత్వ పన్ను (ఆస్తి విభజన) విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశంపై ప్రస్తుతం రాజకీయ గందరగోళం నెలకొంది. ప్రధాని మోడీ తన ఎన్నికల ర్యాలీలలో వారసత్వ పన్నును ప్రస్తావిస్తూ కాంగ్రెస్, రాహుల్ గాంధీని నిరంతరం టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశప్రజల ఆస్తిలో సగం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై కాంగ్రెస్ స్పందిస్తూ.. “కాంగ్రెస్ మేనిఫెస్టోలో జాతీయ స్థాయిలో ఆర్థిక, కులాల సర్వే నిర్వహించాలని చెప్పారని చెప్పాం. ఈ సర్వే ద్వారా అందిన సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుంటాం” అని తెలిపింది. ఇదిలా ఉండాగా.. ఆర్థికవేత్త గౌతమ్ సేన్, వార్తా సంస్థ ఏఎన్ఐ తో మాట్లాడుతూ.. సంపద పంపిణీ పథకం భారతదేశంలో పనిచేయదన్నారు. దాదాపు 12 కోట్ల మందికి మాత్రమే రూ.102 కోట్లకు పైగా ఆస్తులున్నాయని తెలిపారు. అయితే దాదాపు అందరూ తమ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారని చెప్పారు. అదే సమయంలో, ఆస్తి పంపిణీ కారణంగా, దేశంలోని 98 నుండి 99 శాతం ప్రజల జీవితాలు ప్రతికూలంగా ప్రభావితమవుతాయని స్పష్టం చేశారు. కాగా.. లోక్‌సభ ఎన్నికలకు రెండో దశ ఓటింగ్‌కు ముందు ఆస్తి పంపిణీపై రాజకీయ గందరగోళం నెలకొంది. వారసత్వ పన్నుపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శామ్ పిట్రోడా చేసిన ప్రకటన రాజకీయ దుమారం లేపింది. ఆ ప్రకటనపై భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టగా, శామ్ పిట్రోడా ప్రకటనకు కాంగ్రెస్ దూరంగా ఉంది. ఆయన ఏమన్నారంటే.. “అమెరికాలో, వారసత్వపు పన్ను చట్టం ఉంది. ఎవరైనా 100 మిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను కలిగి ఉంటే, అతను చనిపోయినప్పుడు అతని పిల్లలకు 45% మాత్రమే బదిలీ అవుతాయి. ప్రభుత్వం మిగిలిన 55% తీసుకుంటుంది. ఇది ఆసక్తికరమైన చట్టం. మీరు సంపదను సృష్టించారు, మీ సంపదను ప్రజలకు వదిలివేయాలి. మొత్తం కాదు, సగం, ఇది సముచితమని భావిస్తున్నా. దానిని పేదలకు పంచుతాం.” అని శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు.
*ఏప్రిల్ నెలలో 19వ శతాబ్దపు రికార్డులను బద్దలు కొట్టిన ఉష్ణోగ్రతలు
ప్రస్తుతం రోజు రోజుకు ఎండ వేడి పెరుగుతోంది. ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. ఇది ప్రారంభం మాత్రమే.. రాబోయే నెలల్లో దీని నుండి ప్రజలకు ఎటువంటి ఉపశమనం లభించదు. బుధవారం విడుదల చేసిన కొత్త డేటా ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్‌లో వేడి.. భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం చెమటలు పట్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం వరుసగా 11వ నెల అని యూరోపియన్ యూనియన్ వాతావరణ సంస్థ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ (C3S) తెలిపింది. ఏప్రిల్‌లో సగటు ఉష్ణోగ్రత 15.03 డిగ్రీల సెల్సియస్, ఇది నెలవారీ సగటు 1850-1900 కంటే 1.58 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. ఇది ఏప్రిల్‌లో 1991-2020 సగటు కంటే 0.67 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. C3S డైరెక్టర్ కార్లో బ్యూంటెంపో మాట్లాడుతూ.. ఎల్ నినో సంవత్సరం ప్రారంభంలో గరిష్ట స్థాయికి చేరుకుంది. అయినప్పటికీ, ఉష్ణోగ్రతలో మార్పులు ఎల్ నినో వంటి సహజ చక్రాలతో సంబంధం కలిగి ఉంటాయి. గత 12 నెలల్లో (మే 2023-ఏప్రిల్ 2024) ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 1991-2020 సగటు కంటే 0.73 డిగ్రీల సెల్సియస్. 1850-1900 సగటు కంటే 1.61 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైందని వాతావరణ సంస్థ తెలిపింది. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత మొదటిసారిగా జనవరిలో మొత్తం సంవత్సరానికి 1.5 డిగ్రీల సెల్సియస్ థ్రెషోల్డ్‌ను దాటింది. వాతావరణ మార్పులను నివారించడానికి దేశాలు గ్లోబల్ యావరేజ్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలి. వాతావరణంలో గ్రీన్‌హౌస్ వాయువులు, ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్, మీథేన్‌ల సాంద్రతలు వేగంగా పెరగడం వల్ల భూమి, ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత 1850-1900 సగటుతో పోలిస్తే ఇప్పటికే దాదాపు 1.15 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 174 సంవత్సరాల రికార్డులో 2023 అత్యంత వేడి సంవత్సరం. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత బేస్‌లైన్ (1850–1900) కంటే 1.45 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది.
ఎల్ నినోను ఎంతకాలం ఆశించవచ్చు?
ఆసియాలో తీవ్రమైన వేడి వేవ్ ఫిలిప్పీన్స్‌లోని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసింది. ఇండోనేషియా, మలేషియా, మయన్మార్‌తోపాటు భారత్‌లోనూ ఉష్ణోగ్రత రికార్డులు బద్దలయ్యాయి. యూఏఈలో 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం కూడా ఈ నెలలోనే నమోదైంది. సముద్ర ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో అత్యధికంగా నమోదవుతున్న ఏప్రిల్ వరుసగా పదమూడవ నెల అని కూడా C3S శాస్త్రవేత్తలు తెలిపారు. భారతదేశ వాతావరణ విభాగం (IMD) సహా గ్లోబల్ వాతావరణ సంస్థలు ఆగస్టు-సెప్టెంబర్ నాటికి లా నినో పరిస్థితులను అంచనా వేస్తున్నాయి. అయితే ఎల్ నినో పరిస్థితులు బలహీన రుతుపవనాల గాలులు మరియు భారతదేశంలో పొడి పరిస్థితులతో సంబంధం కలిగి ఉంటాయి. ఎల్ నినో సగటున ప్రతి రెండు నుండి ఏడు సంవత్సరాలకు సంభవిస్తుంది. సాధారణంగా 9 నుండి 12 నెలల వరకు ఉంటుంది.
*ఉత్తర కొరియాలో విషాద ఛాయలు.. కిమ్ కీ నామ్ మృతి..
ఉత్తర కొరియాలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆ దేశంలోని ప్రముఖ నాయకుడు కిమ్ కీ నామ్ (94) మంగళవారం అర్థరాత్రి మరణించారు. ఉత్తర కొరియా అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కెసిఎన్ఎ) అర్ధరాత్రి సమయంలో ఈ సమాచారాన్ని వెల్లడించింది. మంగళవారం నాడు రాత్రి 2 గంటలకు రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కిమ్ కీ నామ్ కు ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్, కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించి, సానుభూతి తెలిపారని న్యూస్ ఏజెన్సీ తెలిపింది. కాగా, ఉత్తర కొరియా అధికారులలో ఎక్కువ కాలం పని చేసిన కిమ్ కి నామ్ నాయకుడిగా నిలిచారు. అతను నార్త్ కొరియాలోని మూడు తరాల నాయకులకు సేవ చేశాడని చెప్పుకొచ్చింది. వారి రాజకీయ చట్టబద్ధతను బలోపేతం చేయడంతో పాటు రాజవంశ రాజ్యానికి ప్రచార యంత్రాంగానికి నాయకత్వం వహించాడని కేసీఎన్ఏ తెలిపింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ రాత్రి 2 గంటలకు కిమ్ కీ నామ్ శవపేటికను సందర్శించారు. అతను ఉత్తర కొరియా యొక్క అనుభవజ్ఞుడైన నాయకుడు, అతను చివరి వరకు ఆ దేశానికి అత్యంత విధేయుడిగా ఉన్నాడు అని కిమ్ జాంగ్ ఉన్ పేర్కొన్నారు. అతను మూడు తరాల కిమ్స్‌ను నిర్వహించడానికి పని చేసిన విశ్వసనీయ అధికారుల ప్రధాన సమూహంలో భాగంగా ఉన్నారని చెప్పారు. ఇక, దక్షిణ కొరియాను సందర్శించిన అతి కొద్ది మంది ఉత్తర కొరియా అధికారులలో కిమ్ కీ నామ్ ఒకరు. 2009లో ప్రెసిడెంట్ కిమ్ డే-జంగ్ మరణం తర్వాత ఆయన అంత్యక్రియల ప్రతినిధి బృందానికి కూడా నాయకత్వం వహించారు. దక్షిణ కొరియా ప్రభుత్వ సమాచారం ప్రకారం.. అతను 1985లో రాష్ట్ర వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ పాలనలో ప్రధానమంత్రిగా పని చేశారని పేర్కొన్నారు. 2011లో మరణించిన ప్రస్తుత నాయకుడి తండ్రి కిమ్ జోంగ్-ఇల్‌తో సన్నిహితంగా కిమ్ కీ నామ్ ఉన్నాడని దక్షిణ కొరియా తెలిపింది.
*మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!
బంగారం ధరలు ఆకాశాన్నంటిని విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఇటీవలి రోజుల్లో ధరలు పెరగడమే తప్ప.. తగ్గడం లేదు. అయితే గత 3-4 రోజులుగా పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్‌లో బుధవారం (మే 8) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,250గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.72,270గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారంపై రూ.100, 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,400గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,420గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,250 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,270గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.66,300గా.. 24 క్యారెట్ల ధర రూ.72,330గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,250 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,270గా నమోదైంది. నేడు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండి రూ.85,000లుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.85,000 కాగా.. ముంబైలో రూ.85,000గా ఉంది. చెన్నైలో రూ.88,500గా కొనసాగుతుండగా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.88,500లుగా ఉంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.84,100గా ఉంది.