కోవూరులో వైసీపీకి షాక్..
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)కి షాక్ తగిలింది.. ఎన్నికల్లో కీలకఘట్టమైన పోలింగ్ మరికొన్ని రోజుల్లో జరగనుండగా.. వైసీపీకి గుడ్‌బై చెప్పారు కీలక నేత.. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్‌పర్సన్ మోర్ల సుప్రజాతో పాటు ఆమె భర్త మోర్ల మురళి, కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ వైసీపీని వీడారు.. నెల్లూరు లోక్‌సభ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. కోవూరు టీడీపీ అభ్యర్థి ప్రశాంతి రెడ్ది సమక్షంలో టీడీపీలో చేరారు.. కాగా, సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. వైసీపీలో అభ్యర్థుల మార్పుపై సంకేతాలు వచ్చినప్పటి నుంచి కొందరు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడారు.. ఇక, టీడీపీ-బీజేపీ-జనసేన జట్టుకట్టిన తర్వాత.. కొందరు నేతలకు టికెట్లు దక్కకపోవడంతో.. టీడీపీకి కొందరు.. జనసేనకు మరికొందరు ఇలా రాజీనామా చేసి.. అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. ఇక, మరికొందరు కాంగ్రెస్ పార్టీలో సైతం చేరిన విషయం విదితమే.
ఏపీకి వర్షసూచన.. ఈ జిల్లాలపై ప్రభావం
ఎండలు దంచికొడుతున్నాయి.. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి.. ఎండలకు తీవ్రమైన వడగాల్పులు తోడు కావడంతో.. ఏపీ ప్రజలు అల్లాడి పోతున్నారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌కి భారీ వర్ష సూచన ఉందంటోంది అమరావతి వాతావరణ కేంద్రం.. ఎల్లుండి ఏపీలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది అమరావతి వాతావరణ కేంద్రం.. ఇక, మిగతా చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని సూచించింది.. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పతున్నాయని.. ఆదివారం, సోమవారాల్లో కోస్తాంధ్ర, రాయల సీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ పేర్కొంది. అయితే, ఈ రోజు మాత్రం రాష్ట్రంలోని 247 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. మరో వైపు.. ఇప్పటికే తిరుపతి, తిరుమల సహా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. తిరుమలలో అయితే.. గత మూడు రోజులుగా వర్షాలు కురిస్తున్నాయి..
బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. నా దగ్గర డబ్బు లేదు.. కానీ..!
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన క్షత్రీయుల ఆత్మీయ సమావేశంలో నరసాపురం లోకసభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కొంతమంది నన్ను పార్లమెంట్ అభ్యర్థి నుండి మారుస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. నా దగ్గర డబ్బు లేదని కావాలని ప్రచారం చేశారని మండిపడ్డారు.. అయితే, నా దగ్గర డబ్బు లేదు.. కానీ, నిబద్ధత ఉందన్నారు. రాత్రికి రాత్రి పార్టీని మార్చి, బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టిన పరిస్థితి లేదు.. నేను అలాంటి వాడిని కాదన్నారు. ఏదైతే డబ్బు నా దగ్గర లేదని.. వారి దగ్గర ఎక్కువ ఉందని చెప్పారో వారికి తెలియాలన్నారు. అయితే, ఇప్పుడు నా స్నేహితుల ద్వారా డబ్బు సమకూర్చుకోగలుగుతున్నాను అని వ్యాఖ్యానించారు శ్రీనివాస్ వర్మ.. మరోవైపు.. పాలకొల్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడాల గోపిపై విమర్శలు సందించారు.. ఇక్కడ వైసీపీ అభ్యర్థిపై పేకాట కేసు, గోవా మద్యం కేసు ఉన్నాయని విన్నాను అంటూ ఎద్దేవా చేశారు నరసాపురం లోకసభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ.
మోడీ ప్రచారానికి వచ్చినా మాకు ఇబ్బంది లేదు.. ప్రజలు మాకు అండగా ఉన్నారు..
ధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా చేస్తున్న ఆయన.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.. మరోవైపు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరు అసెంబ్లీ స్థానం నుంచి మరోసారి బరిలోకి దిగుతున్న ఆయన.. అక్కడ కూడా ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో మోడీ ప్రచారానికి వచ్చినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదన్నారు.. ప్రజలంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, నేను ఎవరికీ చిన్న ఇబ్బంది కలిగించలేదు.. నేను ఏ ఇబ్బంది పెట్టలేదని ప్రజలందరికీ తెలుసన్నారు పెద్దిరెడ్డి.. కావాలని రౌడీయిజం నాకు అంటగట్టి.. నాపై దుష్ప్రచారానికి తెలుగుదేశం పార్టీ పూనుకుంది అని మండిపడ్డారు.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా రౌడీయిజం చేసింది టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డే అన్నారు. ఆయన కారణంగా ఒక పోలీసు కన్ను కూడా కోల్పోయాడని విమర్శించారు.. ఇలాంటి వారికి మద్దతు ఇవ్వకూడదని ప్రజలను కోరుతున్నా.. రానున్న రోజుల్లో పుంగనూరికి మరిన్ని పరిశ్రమలు తెస్తాం అని హామీ ఇచ్చారు మంత్రి, వైసీపీ పుంగనూరు అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
ఈసీకి ఫిర్యాదులు.. ఇద్దరు డీఎస్పీలపై వేటు
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి (ఎన్డీఏ) కూటమి నేతల ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లా రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషా, అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఇటీవల అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం మండలం విఠలం వద్ద తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రచార రథాన్ని దుండగులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ప్రమాదంలో ప్రచార రథం పూర్తిగా దగ్ధం కాగా, ప్రచార వాహన డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన నిందితులను గుర్తించి అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని ఎన్డీఏ కూటమి నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇక, ఎన్డీఏ కూటమి నేతలు ఫిర్యాదుతో రాయచోటి డీఎస్పీ మహబూ బాషపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. మరోవైపు అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిపై కూడా చర్యలకు పూనుకుంది ఎన్నికల కమిషన్.. అనంతపురం డీఎస్పీ రాఘవరెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపి బదిలీ చేసింది ఈసీ.. ఇక, ఎన్నికల కమిషన్ ఆదేశాలో డీజీపీ ఇద్దరు డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇద్దరు డీఎస్పీలు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
కేకే లైన్‌లో ట్రాక్‌పై జారిపడ్డ బండరాయి.. ఢీకొట్టిన రైలు.. నిలిచిపోయిన రైళ్ల రాకపోకలు
అల్లూరి సీతారామరాజు జిల్లా కేకే లైన్‌లో శివలింగపురం వద్ద రైల్వే ట్రాక్ పై జారిపడింది పెద్ద బండరాయి.. అయితే, ఆ బండరాయిని ఢీకొని గూడ్స్ రైలు ఇంజిన్ దెబ్బతింది.. దీంతో.. ఈ రూట్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు రైల్వే అధికారులు.. కేకే లైన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనతో.. ఎస్.కోటలో విశాఖ – కిరండోల్ పాసింజర్ రైలు నిలిచిపోగా.. రైల్వేశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తు్నారు.. ఎస్ కోట రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు, పర్యాటకులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది.. వీలైనంత త్వరగా కేకే లైన్‌ను క్లియర్ చేసి.. రైళ్ల రాకపోకలు యథావిథిగా సాగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు.. కాగా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొత్తవలస-కిరండూల్ (కేకే) లైన్‌పై గతంలోనూ రైల్వే ట్రాక్ పై బండరాళ్లు పడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి.. ముఖ్యంగా వర్షా కాలంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగిన విషయం విదితమే.
జై కేసీఆర్, జై రేవంత్ రెడ్డి అనాలా..?
మోడీనీ ప్రధాని చేయడానికి కిషన్ రెడ్డినీ గెలిపించాలి అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. గతంలో ఎవరికి ఓటు వేసినా.. ఇప్పుడు మాత్రం మోడీకే ఓటు వేస్తామని ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు.. దళిత వాడల్లో ప్రజలంతా మోడీనే కోరుకుంటున్నారు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసం చేసి గెలుస్తున్నారు.. తప్ప ప్రజలకు ఒరుగా పెట్టింది ఏమి లేదన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారం చేపట్టి ఐదు నెలలు గడుస్తున్నా.. ఆ హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు.. ఇప్పటికే రాష్ర్టంలో కరెంటు కోతలు, నీటి ఎద్దడి ప్రారంభమయ్యాయని ప్రజలు వాపోతున్నారంటూ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. ఇక, కాంగ్రెస్ పార్టీ మోడీ చేసిన అభివృద్ధి అంశాలు చర్చించకుండా.. రాజ్యాంగం రద్ధని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని భూటకపు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు.మాట్లాడితే గాడిద గుడ్డు అని అలా అంటున్నారు.. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎలాంటి సేవలు అందించారని ప్రజలకు పూర్తి అవగాహన ఉంది.. మీరు చెప్పే మాయ మాటలకు మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు.. మైనారిటీలకు బీజేపీనీ బూచ్చిగా చూపించి రాజకీయంగా చీలికలు తీసుకొచ్చి ఓట్లు దందుకుందామంటే అందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రామ మందిరం గురించి మాట్లాడితే ఎందుకు విషం చిమ్ముతున్నారో అర్థం కావడం లేదు.. హిందువుల పట్ల ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. జై శ్రీరామ్ అంటే ఏమైనా పాపమా.. జై శ్రీరామ్ కి బదులు జై కేసీఆర్, జై రేవంత్ రెడ్డి అనాలా..? అంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు.
జేపీ నడ్డా, అమిత్ మాల్వియాలపై ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ ఫిర్యాదు
దేశవ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు బీజేపీ నేతలపై కాంగ్రెస్ చీఫ్ ఎలక్టోరల్ అధికారికి ఫిర్యాదు చేసింది. షెడ్యూల్డ్ కులాలు, తెగల సభ్యులను ఫలానా అభ్యర్థికి ఓటు వేయవద్దని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపించిన వీడియోను బీజేపీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని ఆమె ఆరోపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ అమిత్ మాల్వియా, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్రలపై కాంగ్రెస్ పార్టీ ఈ ఫిర్యాదు చేసింది. దీనిపై కాంగ్రెస్ మీడియా ఇన్‌ఛార్జ్ రమేష్ బాబు ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, ‘ఈ వీడియో ఉద్దేశ్యం ప్రజలలో శత్రుత్వ భావనను పెంచడం.. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై విద్వేషాన్ని వ్యాప్తి చేయడం. ఈ వీడియో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలను ఫలానా మతానికి మద్దతిచ్చి ఎస్సీ, ఎస్టీ వర్గాలను దోపిడి చేస్తున్నట్టుగా చూపించే ప్రయత్నం జరుగుతోందన్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సికార్ నుంచి త్రినేత్ర గణేష్ ఆలయానికి వెళ్తుండగా రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని బనాస్ కల్వర్టు సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదంలో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం వీరు ప్రయాణిస్తున్న వెహికిల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అమాయక చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. గణేశుడిని దర్శించుకోవడానికి సికార్ నుండి రణతంబోర్‌కు వెళ్తున్నారు. సమాచారం అందుకున్న బౌలి పోలీస్ స్టేషన్, అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకుని మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. కారులో ఉన్న వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని తెలుస్తోంది. కుటుంబం గణేశుడిని దర్శించుకోవడానికి సికార్ నుండి రణతంబోర్‌కు వెళుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రణతంబోర్‌లో ఉన్న త్రినేత్ర గణేష్‌జీని దర్శించుకునేందుకు ఓ కుటుంబం కారులో వెళుతోంది. ఇంతలో బౌన్లీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బనాస్ పులియా సమీపంలో ఆయన కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఈ కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
దినేష్ కార్తీక్ ముందు తలవంచిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్..
ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటి అర్ధ భాగంలో కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలవగా, ఆ తర్వాత రెండవ అర్థభాగంలో మాత్రం వరుస విజయాలతో మిగతా టీమ్స్ కు పోటీగా నిలబడుతోంది. మ్యాచ్ మ్యాచ్ కు విజయం సాధించుకుంటూ పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో నుంచి తాజాగా ఏడవ స్థానానికి ఎగబాకింది. ఇకపోతే తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ మ్యాచ్ తర్వాత ప్రజెంటేషన్ సెర్మని అయిపోయిన తర్వాత ఓ సరదా సన్నివేశాన్ని సృష్టించాడు. ఈ విషయం సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యాచ్ అనంతరం ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మీడియా ముందుకు దినేష్ కార్తీక్ వెళ్లాడు. అయితే అదే సమయంలో మరోసారి విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ ధరించాలన్న విషయం చెప్పడంతో.. విరాట్ కోహ్లీ అక్కడికి చేరుకుంటాడు. అయితే ఆ సమయంలో దినేష్ కార్తీక్ ఆరెంజ్ క్యాప్ ను విరాట్ కోహ్లీకి అందించమని కోరారు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ చేసిన పని అందరికీ షాక్ ఇచ్చింది.
ఎన్నికలకు మూడు రోజుల ముందు వచ్చేస్తున్న ప్రతినిధి 2
టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా కాలం గ్యాప్ తరువాత నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రతినిధి 2’. గతంలో సూపర్ హిట్ అయిన “ప్రతినిధి” సినిమాకు సీక్వెల్ గా “ప్రతినిధి 2 ” సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ గా కనిపించనున్నాడు. సిరీ లెల్లా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా మరియు సచిన్ ఖేడేకర్ ముఖ్యపాత్రలు పోషించారు.ఈ సినిమాకు మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాను వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల మరియు ఆంజనేయులు శ్రీ తో కలిసి సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించగా జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.. ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రం రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా ఎన్నికలకు మూడు రోజుల ముందు థియేటర్లలోకి వస్తోంది. అనగా మే 10వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని మే 10న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్,ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది..అయితే ఈ సినిమా ఏ పొలిటికల్ పార్టీకి ఈ సినిమా వ్యతిరేకం కాదని ప్రస్తుత వ్యవస్థలో ఉన్న లోపాన్ని ప్రశ్నించేలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు .
అప్పుడే షూటింగ్ మొదలు పెట్టేసారుగా..
రీసెంట్ మలయాళం బ్లాక్ బస్టర్ మూవీస్ లో ప్రేమలు మూవీ ఒకటి.మలయాళంలో ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.మమిత బైజు, నస్లెన్ గఫూర్, అఖిల భార్గవన్, సంగీత్ ప్రతాప్ మరియు శ్యామ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి గిరీష్ దర్శకత్వం వహించారు.మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ సినిమాని నిర్మించారు.అయితే ప్రేమలు మూవీ కేవలం మూడు కోట్లతో తెరకెక్కింది.కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 136 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించి అదిరిపోయే రికార్డు క్రియేట్ చేసింది .మలయాళంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో దర్శక ధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ సినిమాను తెలుగులో డబ్ చేయించి రిలీజ్ చేసారు. ప్రేమలు సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.తెలుగులో కూడా ప్రేమలు మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్ ని తీసుకు రావాలని భావించారు. ఈక్రమంలోనే ఇటీవలే ఈ మూవీ సీక్వెల్ ని కూడా అనౌన్స్ చేసారు. అయితే అలా అనౌన్స్ చేసారో లేదో వెంటనే షూటింగ్ ని కూడా మొదలు పెట్టేసారు.ప్రేమలు 2 షూటింగ్ మొదలైందని తెలియజేస్తూ హీరోయిన్ మమిత బైజు తాజాగా ఒక ఫోటోను షేర్ చేసారు. ఈ ఫోటో చూసిన నెటిజన్స్ ..ఇంత ఫాస్ట్ గా వున్నరేంట్రా బాబు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.మీ స్పీడ్ చూస్తుంటే ఈ సంవత్సరమే సీక్వెల్ దించేలా ఉన్నారుగా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
మూడోసారి విడాకులు తీసుకున్న స్టార్ సింగర్!
హాలీవుడ్ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకున్నారు. భర్త సామ్ అస్గారితో ఆమె అధికారికంగా విడిపోయారు. వీరిద్దరూ విడిపోయిన 8 నెలల తర్వాత విడాకులు మంజూరయ్యాయి. బ్రిట్నీ, సామ్ పిటిషన్లపై లాస్ ఏంజెల్స్ న్యాయమూర్తి గురువారం (మే 2) తీర్పునిచ్చారు. మొత్తంగా పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఈ జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. బ్రిట్నీ స్పియర్స్, సామ్ అస్గారి జంట గతేడాది జూలైలో తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇద్దరు ఆగస్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా వీరికి లాస్ ఏంజెల్స్ కోర్టు విడాకులు మంజూరు చేసింది. పెళ్లికి ముందు వీరిద్దరూ దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్‌లో ఉండడం విశేషం. బ్రిట్నీ, అస్గారికి పిల్లలు లేరు. అయితే వివాహంకు ఒక నెల ముందు బ్రిట్నీకి గర్భస్రావం అయింది. వీరిద్దరి మధ్య భవిష్యత్తులో ఏవైనా వివాదాలు ఉంటే.. ప్రైవేట్ ఆర్బిట్రేషన్‌లో పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.