వాలంటీర్లపై వైసీపీ అభ్యర్థి వివాదాస్పద వ్యాఖ్యలు.. రాజీనామా చేస్తేనే..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాలంటీర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి.. కొన్నిసార్లు విపక్ష నేతలు.. మరికొన్నిసార్లు అధికార పక్షం నుంచి వాలంటీర్లపై చేస్తున్న కామెంట్లు వివాదాస్పదంగా మారుతూనే ఉన్నాయి.. తాజాగా ఈ జాబితాలో చేరారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకర్గ వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్.. ఈ నెల 10వ తేదీన వాలంటీర్ల విధులపై హైకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి. వాలంటీర్లు రాజీనామాలు చేసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు రాజీనామాలు చేసిన వారినే జూన్ 5వ తేదీ నుండి మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు.. రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకొని ప్రచారం చేయాలన్నారు.. అలాంటి వారినే మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతే కాదు.. మేం చెప్పిన మాటలు వినని, రాజీనామాలు చేయని వారిని విధుల్లో నుంచి తొలగిస్తామని.. వారి స్థానంలో మరొకరు వస్తారంటూ హెచ్చరించారు. టెక్కలిలో నిర్వహించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వాలంటీర్ల రాజీనామాలపై దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.
వివాదానికి దారితీసిన.. టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు..!
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అనుచిత వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.. వైసీపీ ప్రచార రథం ఫ్లెక్సీని టీడీపీ మద్దతుదారులు చించేశారు. దీనితో మెర్నిపాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జోగేశ్వరరావు చర్యలతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దిడంతో వివాదం సద్దుమనిగింది.. అయితే, రౌడీరాజ్యం.. గూండా రాజ్యం అంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు.. తాజాగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.. మండలంలోని మెర్నిపాడు ఎన్నికల ప్రచారంలో ‘ఎదురుగా ఉన్న అధికార పక్షం ప్రచార రథాన్ని తొక్కించుకుపోండి.. ఎవడు అడ్డు వచ్చి ఆపుతాడో నేను చూస్తా’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వేగుళ్ల వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన మెర్నిపాడు గ్రామంలో చోటుచేసుకుంది. వైసీపీ ఎన్నికల ప్రచార రథం అదే గ్రామంలో తిరుగుతోంది. ఇదే సమయంలో టీడీపీ అభ్యర్థి జోగేశ్వరరావు ఎన్నికల ప్రచారం కోసం అదే గ్రామానికి వచ్చారు. ఎదురుగా వైసీపీ ప్రచార రథం కనిపించడంతో ఆయన విచక్షణ కోల్పోయారు. వాస్తవానికి వేగుళ్ల ప్రచార రథానికి వైసీపీ ప్రచార రథం ఏమాత్రం అడ్డుగా లేదు. అయినప్పటికీ కొందరు టీడీపీ కార్యకర్తలు ఆటోపై పడి ఫ్లెక్సీలు చింపి వేశారు. అయితే ఆటో డ్రైవర్ స్థానికుడు కావడంతో ఇదేం దౌర్జన్యం అంటూ టీడీపీ కార్యకర్తలను నిలదీశాడు. ఈ దశలో టీడీపీ కార్యకర్తలకు ఆటో డ్రైవర్ కు మధ్య వాగ్వాదం తలెత్తింది.
ఏపీలో పెన్షన్‌దారులకు కొత్త కష్టాలు..! స్పాట్ మారింది క్యూ తప్పడంలేదు..
ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్‌దారులకు కష్టాలు తప్పడం లేదు.. గత నెలలో గ్రామ/వార్డు సచివాలయ దగ్గర పడిగాపులు పడిన వృద్ధులు.. ఇప్పుడు బ్యాంకుల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. మే 1వ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ ద్వారా పెన్షన్ డబ్బులు జమ చేస్తూ వస్తుంది ప్రభుత్వం.. ఈ రోజు, రేపు కూడా ఈ కార్యక్రమం కొనసాగనుంది.. ఇక, ఆన్‌లైన్ లేనివారికి నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేయనున్నారు అధికారులు.. అయితే, తమ బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ సొమ్ము జమ అవుతుండడంతో.. వాటి కోసం ఇప్పుడు బ్యాంకుల దగ్గర బారులు తీరారు వృద్ధులు, పెన్షన్ దారులు.. ఓవైపు తీవ్రమైన ఎండలు దంచికొడుతున్నా.. బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు. ఇక, పార్వతీపురం మన్యం గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన వృద్ధులకు పెన్షన్ తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం నుండి అందవలసిన వృద్ధాప్య పెన్షన్ తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవ్వడంతో గిరిశికర ప్రాంతాల నుండి మండల కేంద్రాలకు అష్ట కష్టాలు పడుతూ బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ప్రతి నెల వాలంటీర్లు ఇంటికి వచ్చి పెన్షన్ అందించే వారిని.. ఇప్పుడు ఇలా బ్యాంకులకు వెళ్లి పెన్షన్ తీసుకోవడం కష్టంగా ఉందని వృద్దులు వాపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు అవుతున్న తరుణంలో వేడిని తట్టుకోలేక, బ్యాంకుల ముందు పడిగాపులు కాయలేక లబోదిబోమంటున్నారు. గతంలో ఇంటి దగ్గరకే వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు కూడా.. ఇప్పుడు.. ఎన్నికల సమయంలో వారికి కొత్త కష్టాలు తప్పడంలేదు.
హోం ఓటింగ్ ప్రక్రియ షురూ..
ఈ నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ్టి నుండి హోం ఓటింగ్ ప్రక్రియను తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించారు అధికారులు.. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హోమ్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. హోం ఓటింగు కోసం క్షేత్ర స్థాయిలో బృందాల పర్యటిస్తున్నాయి. జిల్లాలోని 7 నియోజక వర్గాలలో హోం ఓటింగు కోసం 69 బృందాలు, 400 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అంగీకారం తెలియ చేసిన 1306 మంది ఓటర్లు ఇంటికే వెళ్లి అధికారులు ఓట్లు వేయిస్తున్నారు. అంగీకారం తెలిపిన 85 వయస్సు పైబడిన ఓటర్లు 648, పీడబ్ల్యూడీ ఓటర్లు 658 మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే, ఎన్నికల కమిషన్ నూతనంగా ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ ప్రక్రియ తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుందని అంటున్నారు అధికారులు, సిబ్బంది. ఇక, జిల్లాలో అంగీకారం తెలియ చేసిన 1306 మంది ఓటర్లు ఇంటికి అధికారులు వెళ్లి ఓట్లు వేయిస్తున్నారని.. ఈ ప్రక్రియలో 400 మంది ఎన్నికలు సిబ్బందిని 69 బృందాలుగా ఏర్పాటు చేసి హోం ఓటింగ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ మాధవిలత తెలిపారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. హోమ్ ఓటింగ్ కు అంగీకారం పత్రం సమర్పించిన ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాధవిలత.
మరో ప్రాణం తీసిన పెన్షన్.. బ్యాంక్ దగ్గర కుప్పకూలి వృద్ధుడు మృతి
ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల కోసం వృద్ధులు బ్యాంకుల వద్ద బారులు తీరారు. నిన్నటి నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతోంది.. ఈ రోజు, రేపు కూడా ఈ ప్రక్రియ కొనసాగనుండగా.. ఈ రోజు ఉదయం నుంచి పెన్షన్ డబ్బులు డ్రా చేయడం కోసం బ్యాంకుల దగ్గర వేచి ఉన్న ఫలితం లేదని ఆవేదన చెందుతున్నారు వృద్దులు. కొందరికి అకౌంట్లు పనిచేయకపోవడం.. మరికొందరికి డబ్బులు పడకపోవడంతో ఉసురుమంటూ వెను తిరుగుతున్నారు వృద్దులు. కొందరికి ఆధార్ లింకు కాకపోవడం, మరికొందరికి అకౌంట్లు ఫ్రీజ్ కావడం వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు.. ఇక, అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది.. రాయచోటిలోని కెనరా బ్యాంకుకు పెన్షన్ కోసం వెళ్లి బ్యాంక్ ముందు కుప్పకూలిన వృద్దుడు అక్కడికక్కడే కన్నుమూశాడు.. మృతుడు సుబ్బన్న (80)గా గుర్తించారు. లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకుకు చెందిన ముద్రగడ సుబ్బన్న.. పెన్షన్ కోసం వెళ్లి.. బ్యాంకు వద్ద కుప్పకూలి మృత్యువాత పడ్డారు. ఎండలు మండిపోతూ ఉండడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కాగా, గత నెల గ్రామ, వార్డు సచివాలయల దగ్గర కూడా పెన్షన్ డబ్బుల కోసం పడిగాపులు పడి.. కొందరు వృద్ధులు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం విదితమే.
గాజు గ్లాసు గుర్తుపై తేల్చేసిన ఈసీ.. హైకోర్టులో విచారణ వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల సమయంలో.. గాజు గ్లాసు గుర్తుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. కామన్ సింబల్స్ జాబితాలో గాజు గ్లాసు గుర్తును చేర్చింది కేంద్ర ఎన్నికల కమిషన్.. ఇప్పుడు ఇదే జనసేన పార్టీకి సెగ పెడుతోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంలో జనసేన హైకోర్టు మెట్లు ఎక్కిన విషయం విదితమే కాగా.. ఆ తర్వాత టీడీపీ కూడా ఏపీ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది.. ఆ పిటిషన్‌పై విచారణ సందర్భంగా గాజు గ్లాసు గుర్తుపై కీలక వ్యాఖ్యలు చేసింది ఎన్నికల కమిషన్.. ఏపీ వ్యాప్తంగా గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేయలేమని హైకోర్టుకు తెలిపింది ఎన్నికల సంఘం.. ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ఈ సమయంలో వేరే వారికి ఇచ్చిన సింబల్ మార్చలేమని కోర్టుకు తెలిపిన ఈసీ.. ఈ పిటిషన్ కు విచారణ అర్హత లేదని పేర్కొంది. ఇక, ఇలా చేస్తే ఎన్నికలు జరిగే వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని కోర్టు ముందు వాదనలు వినిపించింది ఎన్నికల కమిషన్.. ఇప్పటికే ఎలక్ట్రానిక్ బ్యాలెట్ లను ఆర్మెడ్ ఫోర్స్ కు పంపించినట్లు కోర్టుకు తెలిపింది.. ప్రీ పోల్ అలయన్స్ ను గుర్తించాలని చట్టబద్ధత లేదని కోర్టుకు తెలిపిన ఈసీ.. జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై నిన్నే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు కోర్టుకు వెల్లడించింది.. అయితే, జనసేన పార్టీ.. టీడీపీ – బీజేపీలతో ప్రీ పోల్ అలియెన్స్ లో ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది టీడీపీ.. పొత్తులో భాగంగా అన్ని పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని, ప్రచారం చేస్తున్నాయని తెలిపారు టీడీపీ న్యాయవాది.. ఇక, ఇప్పటికీ సింబల్స్ మార్చటానికి స్కోప్ ఉందని ఈసీ తెలపగా.. 62 అసెంబ్లీ, 5 పార్లమెంట్ పరిధిలో గాజు గ్లాస్ గుర్తు అలానే ఉందని కోర్టులో పేర్కొంది టీడీపీ.. నిరక్షరాస్యులైన ఓటర్లు కన్ ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఈ సింబల్ ను మార్చి వేరే వాటిని స్వతంత్య్ర అభ్యర్థులకు ఇవ్వాలని కోరింది.. ప్రీ పోల్ అలయన్స్ లో ఇబ్బందులను ఈసీ గుర్తించాలని కోరింది టీడీపీ.. దీంతో, విచారణను రేపటికి వాయిదా వేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
కరెంటుని అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచుకున్నావు.. కేసీఆర్ పై పొంగులేటి ఫైర్
కరెంటుని అడ్డం పెట్టుకొని అడ్డంగా దోచుకుంది నువ్వే.. కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కమెంట్ చేశారు. ఖమ్మం జిల్లా తిరుమల పాలెం మండలం దమ్మాయిగూడెం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ కార్నర్ మీటింగ్ మంత్రి పొంగులేటి మట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని దొంగ మాటలు అని మండిపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే ఆ రెండు పార్టీలను ఏడు లోతుల గొయ్యి తీసి పాతి పెట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. బయ్యారం ఉప్పు ఫ్యాక్టరీ విషయంలో మోసం చేసిన బీజేపీని ఎందుకు నిలదీయలేదన్నారు. బీజేపీని ప్రశ్నిస్తే జైల్లో పెడతారని భయమన్నారు. పట్ట పగులు తిట్టుకోవడం రాత్రిపూట బతిమాలు కోవటం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక్క సీటు రాని కేసీఆర్ నామా నాగేశ్వరాని మంత్రి ఎలా చేస్తారు? అని ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు ఉందని చెప్పకనే చెబుతున్నా కేసిఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ మంచినీళ్ల కోసం ఇబ్బంది పడొద్దన్నారు. తన నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా ఇబ్బంది పడనీయకుండా చూసుకునే బాధ్యత నాది అన్నారు. కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది అంటున్న కేసీఆర్.. నువ్వు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మూడు రూపాయల యూనిట్ని 20 రూపాయితో కొన్నావని గుర్తు చేశారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం యూనిటీ మూడు రూపాయల 50 పైసలకే కరెంటు కొంటున్నామన్నారు. కరెంటుని అడ్డం పెట్టుకొని అడ్డంగా దోచుకుంది నువ్వే అంటూ కేసీఆర్ పై పొంగులేటి మండిపడ్డారు.
ఆ సర్టిఫికేట్లో నుంచి మోడీ ఫోటో తొలగింపు..
కొవిషీల్డ్ టీకా వేసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు ఇటీవల ఆ టీకా తయారు చేసిన ఆస్ట్రాజెనికా కంపెనీ చెప్పడంతో.. భారత్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోవిడ్- 19 టీకా తీసుకున్న వారికి ఇచ్చే కోవిన్ సర్టిఫికేట్‌లో ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోటోను కేంద్ర ఆరోగ్య మంత్విత్వ శాఖ ఆ సర్టిఫికేట్ నుంచి తొలగించింది. చాలా అరుదైన కేసుల్లో కొవిషీల్డ్ వల్ల .. రక్తం గడ్డకట్టే ఛాన్స్ ఉందని ఆస్ట్రాజెనికా కంపెనీ ఇటీవల కోర్టులో అంగీకరించింది. కానీ, భారత్‌లో ఎన్నికల నియమావళిని దృష్టిలో పెట్టుకుని కోవిన్ సర్టిఫికేట్‌లో మోడీ ఫోటోను తొలగించినట్లు అధికార వర్గాలు చెప్పుకొచ్చాయి. కాగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆప్ ఇండియా (ఈసీఐ) ఇచ్చిన ఆదేశాల మేరకు కోవిన్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను తొలగించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. అయితే, బ్రిటన్‌కు చెందిన ఆస్ట్రాజెనికా కంపెనీ యూరోప్ దేశాల్లో వాక్స్‌జెవేరియా పేరుతో టీకాను పంపిణీ చేస్తుంది. ఆ టీకానే కొవిషీల్డ్ పేరుతో భారత్ లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ తయారు చేసింది. కొవిషీల్డ్ వల్ల కొన్ని అరుదైన కేసుల్లో రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది.
బ్రిజ్ భూషణ్‌కు బీజేపీ షాక్.. టికెట్ కట్!
సార్వత్రిక ఎన్నికల వేల బీజేపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే 400 సీట్లు లక్ష్యంగా ప్రచారంలో కమలం పార్టీ దూసుకెళ్లోంది. ఇలాంటి తరుణంలో హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివాదాస్పద నేత, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు బీజేపీ అధిష్టానం షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ కట్ చేసినట్లు సమాచారం. కైసర్‌గంజ్ నుంచి ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా గత కొంతకాలంగా జాతీయ స్థాయి రెజ్లర్ల ఆందోళన చేపట్టారు. దీని ఫలితంగానే కాషాయ పార్టీ ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలే ఓ జాతీయ మీడియాకు వెల్లడించాయి. అతని స్థానంలో కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌కు టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. మరోవైపు బ్రిజ్ భూషణ్ కూడా తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరోసారి టికెట్ సంపాదించేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదో విడతలో భాగంగా మే20వ తేదీన కైసర్‌గంజ్‌లో పోలింగ్ జరగనుంది. ఇక్కడ నామినేషన్ దాఖలు చేయడానికి తుది గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో గురువారం అభ్యర్థని ప్రకటించే అవకాశాలున్నాయి. జాతీయ రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణ విషయంలో బ్రిజ్‌భూషణ్ వార్తల్లో నిలిచారు. గతేడాది ఆయన రెజ్లింగ్ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా క్రీడా రాజకీయాలకు స్వస్తి చెప్పినట్లు ప్రకటించారు. తన స్థానంలో సన్నిహితుడైన సంజయ్‌సింగ్‌ను ఎంపికయ్యేందుకు కృషి చేశాడు. బ్రిజ్‌భూషణ్ ఉత్తరప్రదేశ్‌లో అతిపెద్ద బాహుబలి నేతల్లో ఒకరిగా పేరున్న వ్యక్తి. ఎంపీగా ఏకంగా ఆరుసార్లు పార్లమెంట్‌లో అడుగుపెట్టిన నాయకుడు.
రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని పాకిస్థాన్ తహతహలాడుతోంది
లోక్‌సభ మూడో దశ ఎన్నికలకు ముందు గుజరాత్‌లోని ఆనంద్ నగర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. గత 60 ఏళ్లుగా బ్యాంకులను కాంగ్రెస్ కబ్జా చేసిందని అన్నారు. కాంగ్రెస్ యువరాజులు రాజ్యాంగాన్ని నుదిటిపై పెట్టుకుని నృత్యం చేస్తున్నారు.. మోడీ రాకముందు ఈ దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండేవారన్నారు. కాశ్మీర్‌లో భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ అనుమతించలేదు.. ఆర్టికల్ 370 గోడలా కూర్చుంది. సర్దార్ పటేల్ భూమి నుంచి వచ్చిన నేను.. ఆర్టికల్ 370ని రద్దు చేశానని చెప్పుకొచ్చారు. ఇక, కాశ్మీర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి, భారత రాజ్యాంగాన్ని అమలు చేశాను అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.
కరోనా కొత్త వేరియంట్.. బూస్టర్ డోస్ వేసుకున్న వారు కూడా తప్పించుకోలేరు
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పీడ ఇంకా పోలేదు. వైరస్ మరోసారి మ్యుటేషన్‌కు గురైందని.. దీని కారణంగా కొత్త వేరియంట్‌లు కనిపిస్తున్నాయని సూచిస్తున్నాయి. కరోనా వైరస్‌లోని మ్యుటేషన్ కారణంగా ఉత్పన్నమయ్యే ఉప-వేరియంట్‌కు ‘FLiRT’ అని పేరు పెట్టారు. ఈ కొత్త వేరియంట్ కూడా ఓమిక్రాన్ కుటుంబానికి చెందినదేనని పరిశోధకులు తెలిపారు. ఇది JN.1 వేరియంట్ ఒక రూపం. దీని కారణంగా గత సంవత్సరం అనేక దేశాలలో సంక్రమణ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కరోనా ఈ కొత్త వేరియంట్ వ్యర్థ జలాల పర్యవేక్షణలో కనుగొనబడింది. డేటా సైంటిస్ట్ జె. వీలాండ్ గత వారం విడుదల చేసిన మోడల్‌లో, కరోనా ఇన్‌ఫెక్షన్ గురించి అప్రమత్తంగా ఉండాలని మళ్లీ ప్రజలకు సూచించారు. కరోనా ఈ కొత్త వేరియంట్‌లో ఇలాంటి కొన్ని ఉత్పరివర్తనలు కనిపించాయని, ఇది చాలా ఆందోళన కలిగిస్తుందని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. వేసవిలో అమెరికాతో సహా అనేక దేశాల్లో కొత్త వేరియంట్‌ల కారణంగా కరోనా కేసులు పెరిగే అవకాశం ఉంది. అమెరికాలోని యేల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో డీన్ అయిన డాక్టర్ మేగాన్ ఎల్. కరోనా ‘ఫిలిర్ట్’.. కొత్త వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌లో మార్పులు కనిపించాయని రైనీ చెప్పారు. ఇది శరీరం రోగనిరోధక శక్తిని అధిగమించి ప్రజలకు సులభంగా సోకుతుంది.
చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐదుగురు స్టార్ బౌలర్లు దూరం!
ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు భారీ షాక్ తగిలింది. వివిధ కారణాలతో ఐదుగురు సీఎస్‌కే స్టార్ బౌలర్లు జట్టుకు దూరం అయ్యారు. దీపక్ చహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రహ్మాన్, మతీషా పతిరణా, మహేశ్ తీక్షణ ప్రస్తుతం జట్టుకు అందుబాటులో లేరు. ఈ ఐదుగురు తిరిగి జట్టులోకి ఎప్పుడు వస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న చెన్నైకి ఇలా ఒకేసారి బౌలర్లు అందరూ దూరమవడం భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. జింబాబ్వేతో బంగ్లాదేశ్ ఐదు మ్యాచ్‌ల టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహ్మాన్ స్వదేశానికి వెళ్తున్నాడు. జింబాబ్వేతో సిరీస్ మే 12తో ముగిసినా.. 20 నుంచి అమెరికాతో బంగ్లా మరో టీ20 సిరీస్ ఆడనుంది. దాంతో ముస్తాఫిజుర్ ఐపీఎల్ 2024లో ఆడడం దాదాపు అసాధ్యమే. బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దీపక్ చహర్ గాయపడ్డాడు. మొదటి ఓవర్లో రెండు బంతులే వేసి.. మైదానాన్ని వీడాడు. చహర్ గాయం గురించి ఎలాంటి సమాచారం లేదు. అతడు కోలుకోవడానికి కనీసం 4-5 రోజుల సమయం పడుతుందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ దేవరకు పోటీనే లేదా.. వార్ వన్ సైడేనా..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “దేవర”..టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కల్యాణ్ రామ్ ,సుధాకర్ మిక్కిలినేని మరియు కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది .ఈ సినిమాతోనే ఈ భామ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది.అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న దేవర సినిమాను ఏప్రిల్ 5 న రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు.కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది .అక్టోబర్ 10 న దసరా కానుకగా దేవర సినిమాను రిలీజ్ చేయనున్నారు.దేవర చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ,గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు భారీగా పెంచేసాయి .ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇదిలా ఉంటే మే 20 న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కు మేకర్స్ సర్ప్రైజ్ ప్లాన్ చేసారు .ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగల్ రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే దసరా కానుకగా వస్తున్నఎన్టీఆర్ దేవర మూవీకి పోటీగా ఎలాంటి బిగ్ మూవీ విడుదల కావట్లేదు.దీనితో దసరాకు ఎన్టీఆర్ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.దీనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
మరోసారి లవ్ టుడే కాంబినేషన్ రిపీట్.. ఈ సారి దర్శకుడు ఎవరంటే..?
తెలుగు లో రిలీజ్ అయిన తమిళ్ డబ్బింగ్ మూవీ “లవ్ టుడే” ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాలో హీరోగా ప్రదీప్ రంగనాథన్ నటించాడు.హీరోయిన్ గా ఇవాన నటించింది.ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది.అయితే ఈ చిత్రంలో హీరోగా నటిస్తూనే ప్రదీప్ రంగనాథన్ సినిమాను డైరెక్ట్ చేశారు.ఈ సినిమా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది.తాజాగా తెరకెక్కబోయే ఈ చిత్రానికి కల్పాతి ఎస్. అఘోరం, కల్పాతి ఎస్. గణేష్ మరియు కల్పాతి ఎస్. సురేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘ఓ మై కడవులే’ (తెలుగులో ఓరి దేవుడా) ఫేమ్ అశ్వత్ మారిముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా మెప్పించనున్నారు. మే నెల నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ససమాచారం.ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఈ సినిమా 26 వ చిత్రంగా తెరకెక్కుతుంది .ఇదిలా ఉంటే ఈ కొత్త సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియోను మేకర్స్ విడుదల చేయగా, సోషల్ మీడియాలో వీడియో తెగ వైరల్ అవుతోంది.
సినిమాల్లోకి వెళ్లాలనుకునే వాళ్ళకి ప్రశాంత్ వర్మ ఓపెన్ ఆఫర్..
హనుమాన్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను చెయ్యబోతున్నాడు.. జైహనుమాన్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు… ప్రీక్వెల్ అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో పాటు అతని తర్వాతి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.. ప్రశాంత్ వర్మ తన తదుపరి ప్రణాళికలను వెల్లడించాడు. తన నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం దర్శకుడు ఒక పెద్ద స్టార్‌తో కలిసి పని చేయనున్నారు.. జై హనుమాన్ కన్నా ముందే ఈ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. తెలుగు సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిభావంతులందరినీ తన పీవీసీయూలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. యువకులు మరియు ఔత్సాహిక సాంకేతిక నిపుణులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇదొక పెద్ద అవకాశం. ఈనేపథ్యంలో డైరెక్టర్ ఒక పోస్ట్ చేశారు.. కళాకారులందరికి సూపర్ పవర్స్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాడు.. అలాగే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ ప్రత్యేక నైపుణ్యం ఏమిటి? అది స్పిన్నింగ్ కథలు, ఎడిటింగ్, నైపుణ్యం కలిగిన గ్రాఫిక్స్ లేదా బహుశా మీరు మార్కెటింగ్ మేవెన్, ఊపిరి పీల్చుకోండి. మీ కళాత్మక నైపుణ్యాలతో ప్రపంచంలోకి ప్రవేశించాలా? మీ పోర్ట్‌ఫోలియోలను మాతో చేరడానికి “talent@thepvcu.com”కి పంపండి అని పేర్కొన్నాడు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలను అందించడం గురించి మాట్లాడాడు.మీకు వీటిపై ఆసక్తి ఉంటే ఇక ఆలస్యం ఎందుకు వెంటనే పనిని ప్రారంభించండి..