ఢిల్లీలో సీఎం వైఎస్ జగన్ బిజీబిజీ..
మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు.. మూడు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్ వరుసగా రెండోరోజు షెడ్యూల్ బిజీగా సాగింది.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్‌పై ప్రధానంగా చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచాన వ్యయం నిధులు సహా పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కేంద్ర మంత్రి షెకావత్‌కు సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. అరగంట సేపు వీరిద్దరి సమావేశం కొనసాగింది. సీఎం జగన్ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించినట్లు తెలసింది. ఇక, నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశంలో సీఎం జగన్.. ఆరోగ్యకరమైన పెట్టుబడులు, మౌలిక సదుపాయాల బలోపేతంతో ఆర్థికవ్యవస్థ మరింత వేగంగా పరుగులెడుతోందన్నారు. ఏపీ సాధించిన ప్రగతిపై నీతిఆయోగ్ సమావేశానికి నోట్ ఇచ్చిన సీఎం జగన్.. భారత్‌లో లాజిస్టిక్స్ కోసం పెడుతున్న ఖర్చు జీడీపీలో 14శాతంగా ఉందన్నారు. లాజిస్టిక్స్ ఖర్చు ఎక్కువగా ఉండడంతో.., భారత్ ఉత్పత్తులు ప్రపంచస్థాయిలో పోటీపడేందుకు ప్రతిబంధకంగా మారిందన్నారు. ఏపీ ప్రభుత్వం పోర్ట్ ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు సీఎం జగన్. ఏపీలో కొత్తగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటవుతున్నాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మూడేళ్లుగా దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. విలేజ్ క్లినిక్ కాన్సెప్ట్‌ను పూర్తి సామర్థ్యంతో అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం చేపట్టిందన్నారు. దేశ GDPలో తయారీ, సేవల రంగం వాటా 85 శాతం దాటినప్పుడే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందన్నారు సీఎం జగన్.
నెల్లూరులో ఫ్లెక్సీ వార్.. వైసీపీ వర్సెస్ జనసేన..
ఆంధ్రప్రదేశ్‌లో అధికార, విపక్షాల మధ్య ఫ్లెక్సీ వార్ కొనసాగుతూనే ఉంది.. ఇప్పుడు నెల్లూరు నగరంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ నేతల మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం అనే టైటిల్ తో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పల్లకిలో మోస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్న చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఈ ఫ్లెక్సీలను పెట్టారు.. అయితే, దీనిపై ఆగ్రహించిన జనసేన పార్టీ నాయకులు.. నెల్లూరు నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద పాపం పసివాడు పేరుతో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 450 కోట్ల రూపాయల అవినీతి ఇసుక గ్రావెల్ రూపంలో అక్రమ సంపాదన పేదల భూములను లాక్కోవడం లాంటి సబ్ టైటిల్స్ ను పెట్టారు. ఇక, ఈ విషయం తెలియడంతో బాలాజీ నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నించారు.. అయితే, దీనిని జనసేన పార్టీ నేతలు అడ్డుకొని వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే లేని అభ్యంతరం.. ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. పోలీసుల తీరుపై జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మ ఫ్లెక్సీలతో పాటు వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా తొలగించాలన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా చూస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి ఫ్లెక్సీలనే ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు.. వీటికి కౌంటర్‌గా తెలుగుదేశం పార్టీ నేతలు, జనసేన నేతలు ఫ్లెక్సీలు పెడుతున్నారు..
ఎన్టీఆర్ నిజమైన వారసుడు ఆయనే.. లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు
స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన సతీమణి లక్ష్మీపార్వతి.. వైసీపీ నేతల నేతృత్వంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి సభ నిర్వహించారు.. ముఖ్య అతిథులుగా సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి హాజరుకాగా.. మాజీ మంత్రి వెల్లంపల్లి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ను కష్టకాలంలో అండగా నిలబడిన దేవినేని నెహ్రూ నిజమైన వారసుడు అని తెలిపారు.. ఇక, ఇంత అద్భుతంగా ఎన్టీఆర్ కార్యక్రమం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదన్న ఆమె.. అప్పట్లో నా గొంతు వినిపించకుండా మీడియా అడ్డుకుంది.. జగన్ వల్ల నా గొంతును ఇంత మంది వింటున్నారు.. ఈ శతాబ్ది ఎన్టీఆర్ ది అని పేర్కొన్నారు. నోటి మాట రాని లోకేష్ కూడా వారసుడిని అంటున్నాడు అంటూ ఎద్దేవా చేశారు లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్ అధికారాన్ని లాక్కున్న వాళ్ళు వారసులు ఎలా అవుతారు? అని ప్రశ్నించిన ఆమె.. సొంత మనుషులే వెన్నుపోటు పొడవటంతో ఎన్టీఆర్ ఎంతో ఆవేదన చెందారు.. మోసం చేసిన చంద్రబాబును అండమాన్ జైలుకు పంపిస్తానని ఎన్టీఆర్ తీర్మానం చేశారు.. చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరు పలికే అర్హత లేదు అని ఫైర్ అయ్యారు. ఎన్టీఆర్ ఆశయాలను మట్టిలో కలిపేశాడు చంద్రబాబు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ను కష్టకాలంలో అండగా నిలబడిన దేవినేని నెహ్రూ నిజమైన వారసుడన్న ఆమె.. ఇక, సంబంధం లేకపోయినా గౌరవంతో ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు అంటూ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు.. ఒక సామాజిక వివక్ష నుంచి కాపాడి నా గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన వ్యక్తి వైఎస్ జగన్ అన్న ఆమె.. ఆర్జీవీ గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు..
దేశంలో ఏ దిక్కుకైనా వెళ్లవచ్చు.. దిక్కుమాలిన చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండి..
దేశంలో ఏ దిక్కుకైనా వెళ్లవచ్చు.. కానీ, దిక్కుమాలిన చంద్రబాబు వైపు మాత్రం వెళ్లకండి అంటూ సంచన వ్యాఖ్యలు చేశారు సినీ నటుడు, దర్శక నిర్మాత, ఏపీఎఫ్సీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి.. విజయవాడలో వైసీపీ నేతల నేతృత్వంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి సభ నిర్వహించారు.. ముఖ్య అతిథులుగా సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి హాజరు అయ్యారు.. మాజీ మంత్రి వెల్లంపల్లి, పేర్నినాని, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, పలువురు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేతిలో చనిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు పోసాని.. ఏ కులం వారితో అయినా స్నేహం చేయవచ్చు.. దేశంలో గుణం లేని ఏకైక వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.. దేశంలో ఏ దిక్కుకైనా వెళ్ళవచ్చు.. కానీ, దిక్కుమాలిన చంద్రబాబు వైపు వెళ్ళకండి అని సూచించారు.. మూడు సార్లు గుండె పోటు వస్తే ఎన్టీఆర్ ను ప్రాణంలా చూసుకున్నారు లక్ష్మీపార్వతి అని గుర్తుచేసిన ఆయన.. ఎన్టీఆర్ తో పెళ్ళి తర్వాత లక్ష్మీ పార్వతి పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో లక్ష్మీ పార్వతిని చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చేవాళ్ళు.. ఎన్టీఆర్ ను బతికించుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు పోసాని కృష్ణమురళి.
కొత్త పార్లమెంట్ శవపేటికలా ఉందన్న ఆర్జేడీ.. బొందపెడతామన్న బీజేపీ
కొత్త పార్లమెంట్ ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం అయింది. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ తో పాటు ఆర్జేడీ, ఎస్పీ, ఎన్సీపీ, టీఎంసీ, జేడీయూ, ఆప్, వామపక్షాలు వంటి 20 ప్రతిపక్ష పార్టీలు హాజరుకాలేదు. బీఎస్పీ, బీజేడీ, అకాలీదల్, టీడీపీ, వైసీపీ వంటి 25 పార్టీలు హాజరవుతున్నట్లు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోడీ కాకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం జరగాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేశాయి. ఇదిలా ఉంటే లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ‘‘రాష్ట్రీయ జనతాదల్(ఆర్జేడీ)’’ కొత్త పార్లమెంట్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కొత్త పార్లమెంట్ శవపేటికలా ఉందని ఆర్జేడీ ట్వీట్ చేసింది. దీనికి అంతే స్ట్రాంగ్ గా బీజేపీ స్పందించింది. ఈ వ్యాఖ్యలపై దేశద్రోహం కేసు పెట్టాలని బీజేపీ విమర్శించింది. బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి,బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోడీ మాట్లాడుతూ.. ఇంతకన్నా దురదృష్టం ఏం ఉండదని, వారికి మెదడు లేదని విమర్శించారు. ఆర్జేడీ పార్లమెంట్ ను శాశ్వతంగా బహిష్కరించాలని చూస్తుందా…? వారి ఎంపీలు రాజీనామా చేస్తారా..? అని ప్రశ్నించారు. కొత్త పార్లమెంట్ దేశానికి గర్వకారణం.. ఇలాంటి వారిపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ.. 2024లో దేశ ప్రజలు మిమ్మల్ని ఒకే శవపేటికలో పాతిపెడతారని, ప్రజాస్వామ్యం అనే కొత్త దేవాలయంలోకి అడుగుపెట్టే అవకాశం ఇవ్వరని, పార్లమెంటు భవనం దేశానిదని అన్నారు. ఆర్జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ మాట్లాడుతూ.. మా ట్వీట్ లో శవపేటిక ప్రజాస్వామ్యాన్ని ఖననం చేయడాన్ని సూచిస్తోందని, పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయం, చర్చలకు వేదిక, అయితే బీజేపీ దాన్ని వేరే మార్గంలో తీసుకెళ్తోందని, దేశం దీన్ని అంగీకరించదని అన్నారు. రాష్ట్రపతిని పిలవకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆయన అన్నారు.
నేను మగాణ్ని ఎక్కడ తిరిగితే నీకెందుకు.. భార్యపై సాంబార్ పోసిన భర్త
వారిది అనోన్యంగా సాగిపోతున్న కాపురం. వారి దాంపత్యానికి నిదర్శనంగా పండండి ఇద్దరు పిల్లలు కలిగారు. అలాంటి కాపురంలో వివాహేతర సంబంధం చిక్కుపెట్టింది. భర్త వేరే మహిళతో చనువుగా ఉంటున్న విషయం భార్యకు తెలిసింది. దీంతో వారి మధ్య గొడవలు తలెత్తాయి. భర్త తీరు మారడంతో భార్య నిలదీశారు. కోపోద్రిక్తుడు అయిన భర్త.. ఆమెపై సలసల మసులుతున్న సాంబార్ పోశాడు. ఈ ఘటన పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. విల్లుపురం జిల్లాలోని కొండూరు గ్రామానికి చెందిన ఆరోగ్య స్వామి(40), పెరియనాయకి(30)కి కొన్నే్ళ్ల కిందట పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆరోగ్యస్వామి జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి మరో మహిళ పరిచయం అయ్యింది. ఆమెతో వివాహేతర బంధం ఏర్పడింది. దాంతో ఆరోగ్య స్వామి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఈ విషయాన్ని భార్య గమనించింది. కొంత కాలం తరువాత ఆమెకు భర్త గుట్టు తెలిసింది. దీంతో భర్తను నిలదీసింది. ఆమె మాటలు వినకుండానే వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో గత శుక్రవారం కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో పెరియనాయకి వంట చేస్తోంది. గొడవ ముదిరింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆరోగ్య స్వామి తన భార్యపై వేడి సాంబార్ పోశాడు. దీంతో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. నొప్పిని భరించలేక గట్టిగా అరవడంతో చుట్టుపక్కల నివసించేవారు పరిగెత్తుకొచ్చారు. ఆమె పరిస్థితి చూసి చలించిపోయారు. వెంటనే అంబులెన్స్ లో ముండియంబాక్కం గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె అక్కడే చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై తిరువెన్నెనల్లూర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నేడే ఫైనల్.. కప్ కొట్టేదెవరు..? ఎవరి బలం ఏంటి..?
క్రికెట్ ఫ్యాన్స్‌లో జోష్ నింపిన పొట్టి ఫార్మాట్ ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది.. రెండు నెలలుగా క్రికెట్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. చెన్నై పాంచ్ పటాకానా? గుజరాత్ డబుల్ ధమాకానా అనేది ఇవాళ తేలిపోనుంది. ఐపీఎల్ 16 సీజన్ విజేత ఎవరో ఈ రోజు ఫైనల్ కానుంది.. సీనియర్ ధోనీ వ్యూహాలు ఫలిస్తాయా? చెన్నై ఫ్యాన్స్ కలల్ని సాకారం చేస్తాడా?.. లేకపోతే హార్థిక్ పాండ్యా దూకుడుతో గుజరాత్‌కు కప్ అందిస్తాడా? అనేది ఇవాళ రాత్రికి తేలిపోనుంది. క్వాలిఫైయర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో దెబ్బతిన్న గుజరాత్ టైటాన్స్ మళ్లీ ఫైనల్‌లో అదే జట్టుతో తలపడి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న ఇరుజట్ల ఫైనల్ ఫైట్‌తో అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియం మోతెక్కిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడిన చెన్నై, గుజరాత్ జట్లే ఫైనల్‌లో తలపడనుండడం విశేషం. పదోసారి ఐపీఎల్ ఫైనల్‌లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్‌కింగ్స్.., ఐదోసారి కప్ గెలవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగనుంది. ఇవాళ ఫైనల్ గెలిస్తే.., ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేస్తుంది చెన్నై. గతేడాది లీగ్ దశలోనే ఇంటికెళ్లిన చెన్నై ఈసారి పట్టుదలతో, ధోని మార్క్ వ్యూహాలతో, సమిష్టి కృషితో ఫైనల్‌కు చేరింది. ఇటు వరుసగా రెండోసారి కప్ గెల్చి తమకు తిరుగులేదని నిరూపించుకోవాలకుంటోంది గుజరాత్ టీమ్. క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో ఈ సీజన్‌లో తలపడిన ప్రతిసారి గుజరాత్‌నే విజయం వరించింది. ఇక, జట్ల విజయానికి వస్తే.. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డేవన్ కాన్వే ఇద్దరూ నిలకడగా రాణిస్తున్నారు. శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఆజింక్య రహానెతో మిడిల్ ఆర్డర్‌గా పటిష్టంగా ఉంది. రాయుడు కూడా సత్తా చాటుతున్నాడు. ఫినిషర్ ధోనీ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిందేమీ లేదు. బౌలింగ్‌లో తుషార్ దేశ్‌పాండే, పతిరణ, దీపక్‌చాహర్, తీక్షణ, జడేజా సత్తా చాటుతున్నారు. అటు గుజరాత్ ఓపెనర్ శుభమన్ గిల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఏకంగా మూడు సెంచరీలు కొట్టాడు. గిల్ మరోసారి చెలరేగితే చెన్నైకు కష్టాలు తప్పవు. దీంతో గిల్‌ను త్వరగా ఔట్ చేయడంపై దృష్టి సారిస్తోంది ధోనీ టీమ్. సాహా, విజయ్‌శంకర్, హార్ధిక్‌పాండ్యాలు కూడా రాణిస్తే గుజరాత్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లో చెన్నైతో పోలిస్తే గుజరాత్ బలంగా ఉంది. షమీ, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ దుమ్మురేపుతున్నారు. పర్పుల్ క్యాప్ రేస్‌లో తొలి మూడు స్థానాల్లో ఉన్నది కూడా ఈ ముగ్గురే. అటు ఆరంజ్ క్యాప్ ఎలానూ శుభమన్ గిల్ వద్దే ఉంది. ఓవరాల్‌గా మిస్టర్‌కూల్ వ్యూహాలకు హార్ధిక్ పాండ్యా ఎలా చెక్ పెడతాడో చూడాలి.
ఐపీఎల్‌లో మిస్టర్ కూల్ అరుదైన రికార్డు
ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్‌లోనూ సత్తా చాటుతూనే ఉన్నారు.. వన్డే క్రికెట్, టెస్ట్‌లకు, టీ-20లకు గుడ్‌బై చెప్పినా.. ఐపీఎల్‌లో మాత్రం ఏ మాత్రం దూకుడు తగ్గలేదు.. చెన్నై సూపర్‌కింగ్స్‌ను తనదైన వ్యూహాలతో ఫైనల్‌కు తీసుకెళ్లిన కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ఇవాళ్టి మ్యాచ్‌తో ఐపీఎల్‌లో రికార్డులకెక్కనున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్‌లో తలపడుతున్న చెన్నై కెప్టెన్ ధోనీ.. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా రికార్డులకెక్కుతున్నాడు. ధోనీ ఇంతవరకు 249 ఐపీఎల్ మ్యాచ్‌లాడాడు. 39.09 సగటుతో 5వేల 82 పరుగులు చేశాడు. ఇందులో 24 హాఫ్ సెంచరీలున్నాయి. వికెట్ కీపర్‌గా 41 స్టంపింగ్‌లు చేశాడు. 141 క్యాచ్‌లు పట్టుకున్నాడు. ఐపీఎల్‌లో ధోనీ తర్వాత అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లీ ఉన్నారు. ఐపీఎల్‌లో రోహిత్ శర్మ 243 మ్యాచ్‌లాడితే, దినేశ్ కార్తీక్ 242, కోహ్లీ 237 మ్యాచ్‌లు ఆడారు. ఇక, ఇవాళ్టి ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే.. జట్టును ఐదుసార్లు విజేతగా నిలిపిన కెప్టెన్‌గా ధోనీ నిలుస్తాడు. కప్ కొడితే అటు రోహిత్ శర్మ రికార్డును ధోనీ సమం చేసినట్లవుతుంది. ఐపీఎల్‌లో అత్యధికంగా ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు విజేతగా నిలిపాడు రోహిత్ శర్మ. ఇప్పటికే చెన్నై సూపర్‌కింగ్స్ కప్ అందించిన ధోనీ.. ఇవాళ ఫైనల్ గెలిస్తే రోహిత్ శర్మ సరసన చేరతాడు. అటు మహేంద్ర సింగ్ ధోనీ కోసమైనా చెన్నై జట్టు గెలవాలని దేశవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.
ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి ఎగ్జైటింగ్ గా ఉన్నా…
గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్… విక్రమ్ వేద సినిమాలో ప్లే చేసిన వేద క్యారెక్టర్ కి చాలా మంచి పేరొచ్చింది. తనలోని యాక్టర్ కి నెగటివ్ టచ్ ఇచ్చి కొత్తగా ప్రెజెంట్ చేసిన హ్రితిక్ రోషన్ కి ‘ఐఫా’లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ లభించింది. అబుదాబిలో జరుగుతున్న అవార్డ్స్ ఈవెంట్ లో హ్రితిక్, ఈ అవార్డుని గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఐఫా ఈవెంట్స్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయిన హ్రితిక్ రోషన్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాడు. “ఫైటర్ సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. వార్ 2 రెడీ అవుతోంది. ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి ఎగ్జైటింగ్ గా ఉన్నా…” అని హ్రితిక్ చెప్పాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హ్రితిక్ రోషన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ బర్త్ డే రోజున కూడా హ్రితిక్ రోషన్ ‘యుద్ధ భూమిలో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను మిత్రమా’ అని ట్వీట్ చేసి వార్ 2 సినిమాని కన్ఫర్మ్ చేసాడు. ఎలాంటి రోల్ లో అయినా ఈజీగా పెర్ఫార్మ్ చెయ్యగల ఈ హ్రితిక్ రోషన్, ఎన్టీఆర్ లాంటి యాక్టర్స్ ని ఒకేసారి తెరపై చూడడం మంచి కిక్ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. నటన మాత్రమే కాదు డాన్స్ విషయంలో కూడా ఎవరూ తగ్గకుండా పోటీ పడగల సత్తా ఈ ఇద్దరి సొంతం. ఇలాంటి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోలు ఒక సినిమాలో కలిసి నటిస్తుంటే ఎలా ఉంటుందో తెలియాలి అంటే వార్ 2 వచ్చే వరకూ వెయిట్ చెయ్యాల్సిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వగానే ‘వార్ 2’ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది.
90 రోజులుగా ‘ఆదిపురుష్’దే హవా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న ఆదిపురుష్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున, రికార్డ్ స్థాయి థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. ట్రైలర్, సాంగ్స్‌తో సినిమా పై అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్లారు. ఈ నెల 29న రామ్ సియా రామ్ అనే మరో గూస్ బంప్స్ సాంగ్ రాబోతోంది. జూన్ 6న తిరుపతిలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి జూన్ 16 వరకు థియేటర్లన్నీ రాముడిగా ఉన్న ప్రభాస్ కటౌట్స్‌తో నిండిపోనున్నాయి. జూన్ నెల మొత్తంగా ఆదిపురుష్ సందడి ఉండనుంది. కానీ గత 90 రోజులుగా యూట్యూబ్‌లో ఆదిపురుష్‌దే హవా నడుస్తోంది. మూడు నెలలుగా యూట్యూబ్‌లో అత్యధికంగా వెతికిన టాపిక్‌గా ఆదిపురుష్ ట్రైలర్ నిలిచింది. ఇప్పటికే ఆదిపురుష్ ట్రైలర్ యూట్యూబ్‌ని షేక్ చేసేసింది. ఫస్ట్ సింగిల్ జైశ్రీరామ్ సాంగ్ అన్ని భాషల్లో కలిపి ఏకంగా 100 మిలియన్ వ్యూస్‌ని అందుకొని.. ప్రభాస్ కెరీర్లో మరో 100 మిలియన్ వ్యూస్ కలిగిన సాంగ్‌గా నిలిచింది. నెక్స్ట్ సాంగ్ పై కూడా గూస్ బంప్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఒక్క యూట్యూబ్ అనే కాదు.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్.. ఇలా అన్నింటిలోను ఆదిపురుష్ ట్రెండింగ్‌లో ఉంటోంది. ఆదిపురుష్ థియేటర్లోకి వచ్చే వరకు బిజినెస్, వ్యూస్, లైక్స్ లాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తే.. సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ లెక్కలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయనుందని చెప్పొచ్చు.