ఎన్నికల ‘సిరా’పై తప్పుడు ప్రచారం.. ఈసీ వార్నింగ్
ఎన్నికలు ఏవైనా సరే.. వెంటనే గుర్తుకు వచ్చేది మాత్రం ఎన్నికల ‘ సిరా’ గుర్తు. ఎన్నికలల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారు.. అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు.. ఇక, సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత చాలా మంది ఎన్నికల్లో ఓటేసిన తర్వాతా సిరా గుర్తును చూపుతూ.. సెల్ఫీలు తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడం చూస్తున్నాం.. అయితే, చెరగని సిరా ఇతరులకు అందుబాటులో ఉందనే ప్రచారం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమయంలో గుప్పుమంది.. దీనిపై సీరియస్‌గా స్పందించారు రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా.. చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటు హక్కును విని యోగించుకోకుండా చూడాలనే కుట్ర రాష్ట్రంలో జరుగుతున్నది అంటూ సోషల్ మీడియాలో జరుగుతోన్న దుష్ప్రచారాన్ని ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఖండించారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందని, మరెవరికీ ఇది అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. ఈ సిరా భారతీయ ఎన్నికల సంఘం వద్ద కాకుండా ఇతరులు ఎవరికైనా అందుబాటులో ఉంటుందనేది తప్పుడు ప్రచారం అన్నారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా..
ఎన్నికల వేళ వేల కోట్లలో బెట్టింగులు.. ఆ నియోజకవర్గాలపై బెట్టింగా రాయుళ్ల ఫోకస్..!?
దేశమంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది. గెలుపు ఎవరిదనే దానిపై హాట్ హాట్ గా చర్చ నడుస్తోంది. చర్చలే కాదు.. వేల కోట్ల రూపాయల బెట్టింగులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన బెట్టింగ్ రాయుళ్ళు కోట్ల రూపాయల బెట్టింగులు వేస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు పోటీ చేసే స్థానాలపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. ఇటు ఏపీలో మాత్రమే కాదు తెలంగాణాలోనూ ఏపీ ఎన్నికలపై బెట్టింగులు సాగుతున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాలలో ఏపీ ఎన్నికలపై బెట్టింగ్ రాయుళ్ళు కాయ్ రాజా కాయ్ అంటున్నారు. మంగళగిరిలో గెలిచేదెవరు..? కడప ఎంపీ సీటును దక్కించుకునేదెవరు..? భీమిలిలో పరిస్థితి ఏంటి..? ఇలా కొన్ని స్పెసిఫిక్ స్థానాలపై ఓ రేంజ్‌లో బెట్టింగులు జరుగుతున్నాయి. వైనాట్ కుప్పం అంటోంది వైసీపీ. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ ప్రతిజ్ఞ చేసింది. దీంతో కుప్పంలో చంద్రబాబు గెలుపుపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. అంతటా ఎవరు గెలుస్తారనే బెట్టింగ్ జరుగుతుంటే.. పులివెందులలో మాత్రం ఏపీ సీఎం జగన్‌కు వచ్చే మెజారిటీపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి.
ఇదేందయ్యా ఇది.. ఓట్ల డబ్బుల కోసం మహిళల ధర్నా..
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి తెరపడింది.. ఇదే సమయంలో ప్రలోభాల పర్వానికి తెరలేపారు నేతలు.. అయితే, ఎన్నికల సమయంలో ప్రలోభాలు కామన్‌గా మారిపోయాయి.. గెలుపు కోసం గిఫ్ట్‌లు, డబ్బులు పంచుతున్నారు ఆయా పార్టీల అభ్యర్థులు.. ఇక, విచిత్రం ఏంటంటే.. నోటు ఇస్తేనే ఓటు అంటున్నారు జనం.. అసలు మాకు ఎందుకు డబ్బులు ఇవ్వరు? అని గొడవకు దిగుతున్నారంటే నవ్వాలో.. ఏడవాలో తెలియని పరిస్థితి నెలకొంది. పోలింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది.. దీంతో, క్లైమాక్స్‌లో బ్యాక్ డోర్ తెరుస్తున్నాయి రాజకీయ పార్టీలు.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ ఓటుకు రేటు కట్టి అమ్మేస్తున్నారు. ఈ పార్టీ.. ఆ పార్టీ అనే తేడా లేకుండా.. ఎక్కడికక్కడ.. డబ్బు సంచులు దించడం.. ఓటర్లకు పంచేయడం చేస్తున్నారు. గ్యారెంటీగా తమకు ఓటు వేస్తారన్న నమ్మకం ఉన్న వ్యక్తులకు రెండేసి వేలు.. అవసరాన్ని బట్టి రూ.5 వేల వరకు పంచుతున్నట్టు టాక్ నడుస్తోంది. మరీ విచిత్రం ఏంటంటే.. కోనసీమలో కొత్తపంచాయతీ తెరపైకి వచ్చింది.. మడికి గ్రామంలో మహిళలు ఆందోళనకు దిగారు.. అదేదో మంచినీళ్లు రోడ్ల సమస్య పరిష్కారానికి కాదు.. కొన్ని పార్టీలు ఓట్ల కోసం చీరలు ఇచ్చి సరిపెడుతున్నాయట.. అయితే, తమకు డబ్బులు ఎందుకు ఇవ్వరు? అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. అలమూరు మండలం పెదపళ్లలో చీరలు ఇచ్చి డబ్బులు ఇవ్వకపోవడంతో మహిళలు ఆగ్రహంతో మండిపడ్డారు. చీరలు తీసుకెళ్లి నాయకుడి ఇంటి ముందు పడేశారు.. ఇది లోకల్‌గా హాట్ టాపిక్ అయిపోయింది. ఇక, కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం కొండెవరంలో గ్రామస్తులు ధర్నాకు దిగారు.. కొంతమందికి మాత్రమే డబ్బులు ఇచ్చి.. తమకు ఇవ్వలేదని ధర్నాకు దిగారు. దాదాపు వంద కుటుంబాలకు డబ్బులు ఇవ్వకుండా స్థానిక నేతలు కొట్టేశారని మండిపడ్డారు కొండెవరం గ్రామస్తులు. ఇక, ఏలూరు జిల్లా కొత్తపేటకు చెందిన కొన్ని కుటుంబాలు ఓటుపై వినూత్నంగా ప్రచారం చేపట్టాయి.. తమ ఓటు ఎవ్వరికీ అమ్మబడువు అంటూ ఫ్లెక్సీలు పెట్టారు.. నిజాయితీగా మాకు అభివృద్ధి చేసే నాయకుడ్ని ఎన్నుకుంటామని కరాకండీగా చెబుతున్నారు.. ఇలా ఎన్నికల వేళా చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి..
రేపే పోలింగ్.. తెలంగాణలో 144 సెక్షన్..
రాష్ట్రంలోని మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సోమవారం (మే 13) ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. మౌనదీక్ష కారణంగా ఆయా నియోజకవర్గాల నుంచి స్థానికేతరులను బయటకు పంపే ప్రక్రియ మొదలైంది. స్థానిక పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అతిథి గృహాలు, రిసార్టులు, సంక్షేమ కేంద్రాలు, ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, లాడ్జీలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.మే 13 తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుందని అన్నారు. 6 నియోజకవర్గాల్లో 3 చోట్ల 4 గంటలకు, మూడు చోట్ల 5 గంటలకే పోలింగ్ ముగుస్తుంది ఎన్నికల ప్రధానాధికారి సూచించారు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందుగా సైలెన్సు పిరియడ్ మొదలు అవుతుందని తెలిపారు. ఇవాళ సాయంత్రం ఈవీఏంలు తీసుకుని పోలింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్తారని పేర్కొన్నారు.
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.. వీటిలో వై. రామవరం మండలంలోని గుర్తెడు, పాతకోట నుండి ఈవీఎం, వీవీ ప్యాట్‌లను రంపచోడవరంలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించడానికి హెలికాప్టర్ ను సిద్ధం చేశారు. రంపచోడవరం నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 399 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రంపచోడవరం నియోజవర్గంలో 2 లక్షల 77 వేల. 317 ఉండగా ఇందులో పురుషులు లక్ష 31 వేల 901, స్త్రీలు లక్ష 14 వేల 540 , థర్డ్ జెండర్స్ 16 ఓటర్లు ఉన్నారు. రంపచోడవరం జూనియర్ కళాశాల గ్రౌండ్ ఏర్పాటు చేసిన శిబిరంలో అధికారులకు పోలింగ్ మెటీరియల్ అందజేస్తున్నారు . బస్సుల్లో ఈవీఎం బాక్స్ లను సిబ్బందితో తరలిస్తున్నారు. 3 వేల మంది సిబ్బంది ఎన్నికల విధులకు హాజరయ్యారు.
రేపే నాల్గో విడత పోలింగ్.. ఏపీ, తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో పోలింగ్..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మరో 10 రాష్ట్రాల్లో సోమవారం నాలుగో దశ లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఏపీలో లోక్‌సభ ఎన్నికలతోపాటు., అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇక సోమవారం నాడు జరగబోయే నాలుగో దశలో ఏపీ (25), తెలంగాణ (17), బీహార్ (5), జార్ఖండ్ (4), మధ్యప్రదేశ్ (8), మహారాష్ట్ర (11), ఒడిశా (4), యూపీ (13), పశ్చిమ బెంగాల్ (8), జమ్మూ & కాశ్మీర్ (1) లోక్‌సభ నియోజకవర్గాలలో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఎన్నికల సంఘం తగు ఏర్పాట్లు చేసింది. ఇక నాలుగో దశలో సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కన్నౌజ్, షాజహాన్‌పూర్, ఖేరీ, దౌరాహర, సీతాపూర్, హర్దోయి, మిస్రిఖ్, ఉన్నావ్, ఫరూఖాబాద్, ఎటా, కాన్పూర్, అక్బర్‌పూర్, బహ్రైచ్ జిల్లాల్లో సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ దశలో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో పాటు, టిఎంసి నేతలు మహువా మోయిత్రా (కృష్ణానగర్, బెంగాల్), శత్రుఘ్న సిన్హా (అసన్సోల్, బెంగాల్), బిజెపి అగ్రనేతలు గిరిరాజ్ సింగ్ (బెగుసరాయ్, బీహార్), అర్జున్ ముండా (ఖుంటి, జార్ఖండ్) నాలుగో విడతలో పేరుగాంచిన రాజకీయ నాయకులు ఎన్నికల బరిలో ఉన్నారు.
జైలుకు వెళ్లినా ముఖ్యమంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేయలేదంటే..?
ఢిల్లీ మద్యం కుంభకోణంలోని మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లినా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయకపోవడంపై తాజాగా ఆయన రియాక్ట్ అయ్యారు. సీఎం కుర్చీ నుంచి తనను తప్పించేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు అనేక కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగా తప్పుడు కేసు పెట్టి తనను జైలుకు పంపించారని పేర్కొన్నారు. ఆ విషయం అర్థమైంది కాబట్టే తాను సీఎం పదవికి రిజైన్ చేయలేదన్నారు. తాను అరెస్టైన నాటి నుంచి బీజేపీ నేతలు తన రాజీనామాకు డిమాండ్ చేసిన విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ గుర్తు చేశారు. అయితే, ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదు నాకు.. కానీ, పదవి నుంచి దింపేయడానికి తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపిచండం చూసి వారి కుట్రలు సాగనివ్వొద్దనే ఉద్దశంతోనే సీఎం పదవికి రాజీనామా చేయలేదని చెప్పుకొచ్చారు కేజ్రీవాల్. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజంగానే అవినీతిపై పోరాడాలనుకుంటే తనను చూసి నేర్చుకోవాలన్నారు. మా మంత్రులతో సహా అవినీతి నాయకులను మేం జైలుకు పంపించామని అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఎలా అణగదొక్కాలో తెలియక పార్టీ కీలక నేతలైన నలుగురిని ప్రధాని మోడీ జైలుకు పంపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్ పై విసరడానికి రాళ్లు మిగలక పోవడంతో అగ్ర శ్రేణి నాయకులను టార్గెట్ చేసి జైలుకు పంపి మా పార్టీని నామరూపాల్లేకుండా చేయాలని కుట్ర చేశారని ఆరోపణలు గుప్పించారు. అయితే, ఆమ్ ఆద్మీ కేవలం పార్టీ కాదని, ఒక ఐడియాలజీ అంటూ వివరించారు. ఆప్ ను ఎంత అణచివేయాలని ఆలోచిస్తే అంతకంటే పైకి ఎదుగుతుందని ఢిల్లీ సీఎం చెప్పారు. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తాను జైలు నుంచి బయటకు వస్తానని ఎవరూ ఊహించలేదు.. మీ అందరి ప్రార్థనల ఫలితంగానే తనకు బెయిల్ వచ్చిందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుదలపై విదేశాంగ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
చైనా- భారత్ మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంటుంది. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు. చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణంపైనే ఆధారపడి ఉందని ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో గస్తీ హక్కులు సహా పలు అంశాలపై ఇంకా సయోధ్య కుదరాల్సిన అవసరం ఉందని తెలిపారు.
16 ఏళ్ల క్రితం చైనాలో తలకిందులైన భూమి.. 87000 మంది మృతి
16 ఏళ్ల క్రితం చైనాలో భయంకరమైన ప్రకృతి వైపరీత్యం నమోదైంది. 2008లో మే 12న కేవలం రెండు క్షణాలకే భూమి తలకిందులు కావడంతో చైనాలో 87 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తులో చరిత్రలో అత్యంత భయంకరమైన భూకంపాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. వేలాది మంది ప్రజలు తప్పిపోయారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అనేక ఇళ్ళు ధ్వంసమయ్యాయి. చాలా మంది ప్రజలు వీధుల్లోకి రావాల్సి వచ్చింది. ఈ విపత్తులో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. పరిహారం చెల్లించడానికి సంవత్సరాలు పట్టింది. ఈ భూకంపంలో 87 వేల మంది చనిపోగా, నాలుగు లక్షల మంది గాయపడ్డారు. మే 12, 2008న, చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో 7.9 తీవ్రతతో భూకంపం నమోదైంది. దాదాపు 2 నిమిషాల పాటు భూకంపం సంభవించింది. భూకంపం కేంద్రం సిచువాన్ ప్రావిన్స్ రాజధాని చెంగ్డూ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాని లోతు 19 కిలోమీటర్లుగా నమోదైంది. ఈ ప్రమాదకరమైన భూకంపం దేశ రాజధాని బీజింగ్, షాంఘైకి 1,500 – 1,700 కిలోమీటర్ల దూరంలో ఉంది. బ్యాంకాక్, థాయ్‌లాండ్, వియత్నాంలోని హనోయిలో కూడా భూకంపం సంభవించింది. ఈ భయంకరమైన భూకంపం తరువాత, దేశంలో ఆర్నెళ్ల పాటు అనేక ప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా సుమారు 20 వేల కొండచరియలు విరిగిపడిన కేసులు నమోదయ్యాయి. భూకంపం కారణంగా కనీసం 4.8 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు. 1976లో తాంగ్‌షాన్ భూకంపం తర్వాత చైనాలో సంభవించిన అత్యంత ప్రమాదకరమైన భూకంపం ఇదే.
అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. అసలు ఎందుకో తెలుసా..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై కేసు నమోదైంది. షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తూ నంద్యాలకు విచ్చేశారు బన్ని. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న మిత్రుడు శిల్పా రవి ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్.. గంటన్నరకు పైగా అక్కడే ఉన్నారు. కాసేపు మీడియాతో మాట్లాడి తిరుపతి వెళ్లారు. అల్లు అర్జున్ రాక గురించి వైసీపీ నేతలు ముందే సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో.. బన్నిని చూసేందుకు వేల మంది అభిమానులు ఎమ్మెల్యే రవి ఇంటికి చేరుకున్నారు. అక్కడ హంగామా చేశారు. శిల్పారవి తనకు మంచి మిత్రుడన్నారు అల్లుఅర్జున్. ఎప్పుడు కలిసినా నంద్యాల అభివృద్ధి గురించే చెబుతుంటారన్నారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదన్న అర్జున్.. మిత్రులు ఏ రంగంలో ఉన్నా వాళ్లకోసం వెళ్తానన్నారు. అయితే, ఎమ్మెల్యే శిల్పా రవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్లడం వ్యక్తిగతమైనా, భారీగా జనం వచ్చే అవకాశం ఉండడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం అనుమతి తీసుకోవాల్సి ఉంది.. అయితే, ఎలాంటి అనుమతులు భారీ జన సమీకరణ చేసినందుకు కేసు నమోదు చేయాలని టూ టౌన్ పోలీసులను ఆదేశించారు ఆర్వో జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డి . ఈ మేరకు అల్లు అర్జున్ తో పాటు ఎమ్మెల్యే శిల్పారవిపై కూడా ఐపీసీ సెక్షన్ 188 కేసు నమోదు చేశారు సీఐ రాజారెడ్డి.
వెంకీ మూవీ కోసం భారీ రెమ్యూనరేషన్ అందుకున్న అనిల్ రావిపూడి..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల అయి ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.ఈ సినిమాను హిట్ ఫేమ్ శైలేష్ కొలను తెరకెక్కించారు .ఈ సినిమాలో శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో ఆండ్రియా,ఆర్య కీలక పాత్రలు పోషించారు.ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధికి విలన్ గా నటించారు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.దీనితో వెంకీ తన తరువాత సినిమాను అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయనున్నాడు. వెంకీ ,అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఎఫ్2, ఎఫ్ 3 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా ఈ ఇద్దరి క్రేజీ కాంబోలో మరో సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.ఈ మూవీని మేకర్స్ ఆగస్టు లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఈ మూవీ కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడికి నిర్మాత దిల్ రాజు ఏకంగా రూ.15 కోట్ల చెక్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
చార్ట్ బస్టర్ గా “పుష్ప పుష్ప” సాంగ్..పుష్ప రాజ్ మేనియా మాములుగా లేదుగా..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “…క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “పుష్ప” సినిమాకు ఈ సినిమా కొనసాగింపుగా వస్తుంది.దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు .ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న విడుదల చేయనున్నారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ పోస్టర్స్ ,టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. రీసెంట్ గా అల్లుఅర్జున్ బర్త్డే సందర్భంగా మేకర్స్ “పుష్ప పుష్ప” సాంగ్ ను రిలీజ్ చేసారు.ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుంది. ఈ సాంగ్ లో అల్లుఅర్జున్ వేసే స్టెప్స్ ట్రెండింగ్ గా నిలిచాయి.ప్రస్తుతం “పుష్ప పుష్ప” సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.ఇదిలావుంటే ఈ చిత్రం నుండి సెకండ్ సాంగ్ ను మేకర్స్ త్వరలోనే రిలీజ్ చేయనున్నారు..ఈ సాంగ్ ఎంతో స్పెషల్ గా వుండనుందని సమాచారం.పుష్ప జీవితం మొత్తం ఈ సాంగ్ లో చూపించనున్నట్లు సమాచారం. దీనితో ఫ్యాన్స్ సెకండ్ సాంగ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.