గుంటూరు జిల్లాలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి.. పల్నాడులో భారీ బందోబస్తు..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలకు రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.. పల్నాడు జిల్లా కౌంటింగ్ నరసరావుపేటలోని జేఎన్టీయూ కళాశాలలో, గుంటూరు జిల్లా కౌంటింగ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో , బాపట్ల జిల్లా కౌంటింగ్‌కు బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు.. ప్రతి జిల్లాలో 2000 మందికి తగ్గకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.. గుంటూరు జిల్లాలో 2500 మంది పోలీసులతో పోలీస్ పహార ఏర్పాటు చేయగా.. అత్యధికంగా పల్నాడు జిల్లాలో 3000 మందికి పైగా పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి అసెంబ్లీ స్థానానికి 14 టేబుళ్లతో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు.. నియోజకవర్గ ఓటర్లను బట్టి గరిష్టంగా 22 రౌండ్లు కౌంటింగ్ జరిగే అవకాశం ఉండగా.. అసెంబ్లీ స్థానానికి, పార్లమెంటు స్థానానికి, ప్రత్యేక హాళ్లు కేటాయించారు అధికారులు.. ఎంపీ స్థానానికి, ఎమ్మెల్యే స్థానానికి ప్రత్యేకంగా టేబుళ్లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
అనంతపురం జిల్లాలో భారీ వర్షం.. రాయదుర్గం-బళ్లారి రాకపోకలకు బ్రేక్..
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. వేదవతి హగరి, వాగులు వంకలు వరద నీటితో పొంగి ప్రవహిస్తున్నాయి. డి.హీరేహాల్ మండలం చెర్లోపల్లి వద్ద బొమ్మనహల్ సెక్షన్ పరిధిలోని హెచ్‌ఎల్సీ కాల్వకు భారీగా వరద వచ్చింది. చెర్లోపల్లి వద్ద హెచ్‌ఎల్సీ అండర్ టన్నెల్ ఛానల్‌కు రంధ్రం పడి వంకలోకి వరద నీరు వృథాగా వెళుతున్నాయి. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తూ మొక్కజొన్న, పత్తి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. బొమ్మనహల్ హెచ్.ఎల్.సి సెక్షన్ పరిధిలోని డి హీరేహాల్ మండలం చెర్లోపల్లి వద్ద గల తుంగభద్ర ఎగువ కాలువకు ( హెచ్ ఎల్ సి) అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రధాన కాలువలో వరద నీటికి 119-400 కిలోమీటరు వద్ద (ut) అండర్ టెన్నల్ ఛానల్ కు రంధ్రం పడి దెబ్బతిని వరద నీరు వంకలోకి వృధాగా వెళుతున్నాయి. బొమ్మనహల్ మండలంలో 91.0 మీ. మీ వర్షపాతం నమోదయింది. కర్ణాటక ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి డి.హీరేహాల్ మండలం సొములాపురం గ్రామం వద్ద భారీ గా ప్రవహిస్తున్న చిన్న హగరి.. దీంతో రాయదుర్గం, బళ్లారి రాకపోకలు అంతరాయం ఏర్పడింది.. కనేకల్ మండలంలో భారీ వర్షానికి వేదవతి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో, కనేకల్, ఉరవకొండ నడుమ బస్సుల రాకపోకలు నిలిచాయి. వేదావతి హగరికి జలకళ సంతరించుకుంది. రైతులు బోరుబావుల కింద వేసుకున్న మొక్కజొన్న, పత్తి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. వరదనీటిలో కొట్టుకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
అల్లర్లకు పాల్పడితే అంతే.. ఎస్పీ సీరియస్ వార్నింగ్
ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో నాలుగంచెల భద్రత చేపట్టాం.. అల్లర్లకు పాల్పడేవారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాము అని హెచ్చరించారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి. జిల్లా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద 4 అంచెల భద్రత చేపట్టామని పేర్కొన్నారు. రెండు కౌంటింగ్ సెంటర్లలో 1500 మందితో పాటు 500 మందికి జిల్లావ్యాప్తంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశాం. జిల్లావ్యాప్తంగా 101 సమస్యాత్మక గ్రామాలను గుర్తించి పికెట్ ఏర్పాటు చేశామన్నారు. 30 మందిని జిల్లా బహిష్కరణ చేశామని.. 1500 మందిని బైండోవర్ చేశామన్నారు. సమస్యాత్మక పట్టణాల్లో డ్రోన్ సీసీ కెమెరాలతో పర్యవేక్షణ చేపట్టామని తెలియజేశారు. అల్లర్లకు పాల్పడేవారు ఎంతటి వారైనా తాట తీస్తామని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శాంతి భద్రతలకు సంబంధించి ఎటువంటి విఘాతం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు.. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎస్పీ స్థాయి అధికారులతో పర్యవేక్షణ కలిగి ఉంటుందని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లతో పాటు సమస్యలను సృష్టించే వారిని మొత్తం 1500 మందినీ బైండోవర్ చేసి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి శాంతి భద్రతల గురించి వివరించామని.. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ గొడవలు సృష్టించాలనుకున్న వాటిని అణచివేసేందుకు పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. గొడవలు జరగక ముందే వాటిని అరికట్టేందుకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవ రెడ్డి.
ఎమ్మెల్యే పిన్నెల్లిపై సుప్రీం సీరియస్.. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆంక్షలు
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఆంక్షలు విధించింది సుప్రీంకోర్టు.. ఎమ్మెల్యే పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రానికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంపై ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు నంబూరు శేషగిరిరావు.. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ సెంటర్ కు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేసింది.. ఇదే సమయంలో.. ఈ నెల 6వ తేదీన హైకోర్టు పిన్నెల్లి కేసును విచారించి.. పరిష్కరించాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్.. కాగా, పోలింగ్ సమయంలో.. ఓ పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారానికి సంబంధించిన వీడియోను న్యాయమూర్తులకు చూపించారు.. పిన్నెల్ని ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోను ప్రదర్శించారు పిటిషనర్ తరఫు న్యాయవాదులు.. అయితే, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది.. ఓ ప్రజాప్రతినిధిగా ఉండి.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తి.. ఈవీఎంను ధ్వంసం చేయడం ఏంటి? అని ఆగ్రహం వ్యక్తం చేసింది.. ఇక, పోలింగ్ సమయంలో.. పోలింగ్ బూత్‌లోనే ఈవీఎం పగలగొట్టిన పిన్నెల్లి.. కౌంటింగ్ స్టేషన్‌లోకి వెళ్లకూడదని నిషేధం విధించింది సుప్రీంకోర్టు..
సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు.. డీజీపీ సీరియస్ వార్నింగ్
ఏపీలో పోలింగ్ అనంతరం కొన్ని ప్రాంతాల్లో అల్లలర్లు చెలరేగాయి.. దీంతో, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ కొందరు అధికారులపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది.. మరోవైపు.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రత్యర్థులను బెదిరించే వ్యక్తులు కూడా లేకపోలేదు.. అయితే, సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ.. కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారు. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని పేర్కొన్న డీజీపీ.. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేయటం, పీడీ యాక్ట్ ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తన ప్రకటనలో వార్నింగ్ ఇచ్చారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. అట్టి పోస్టులు ఎవరి ప్రోద్భలంతో పెడుతున్నారో కూడా విచారణ చేస్తామని.. వారిని కూడా ఉపేక్షించబోమని హెచ్చరించారు. అట్టి పోస్టులను, ఫోటోలను , వీడియోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం లేదా షేర్ చేయడం కూడా నిషిద్ధం. గ్రూప్ అడ్మిన్ లు కూడా అటువంటి వాటిని ప్రోత్సహించకూడదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అందరు గమనించగలరు. సోషల్ మీడియా పోస్టులపై పోలీస్ శాఖ నిరంతర నిఘా ఉంటుందనే విషయాన్ని గుర్తించుకోవాలని తన ప్రకటనలో పేర్కొన్నారు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.
కవిత జ్యుడీషియల్ కస్టడీ జులై 3 వరకూ పొడిగింపు..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈసారి కస్టడీని మరో నెలపాటు పొడిగిస్తూ ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న కవితను జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని జూలై 3 వరకు పొడిగించిన రూస్ అవెన్యూ కోర్టు.. మరోవైపు సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. ఇందుకోసం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుకానున్నారు. కాగా.. మద్యం కేసులో కవితను ఈడీ అధికారులు మార్చి 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో అదుపులో తీసుకున్నారు అధికారులు. ఈ కేసులో తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆమెను ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లోనూ ట్రయల్ కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 10న, కవితతో పాటు చరణ్‌ప్రీత్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్‌లను నిందితులుగా పేర్కొంటూ ఈడీ రూస్ అవెన్యూ కోర్టులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది.
పాలిసెట్ ఫలితాలు విడుదల
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ పాలిసెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పాలిసెట్ పరీక్షను మే 24న నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా 82, 809 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫిషరీస్, హార్టికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారన్న సంగతి తెలిసిందే.
వడదెబ్బతో 3 రోజుల్లో 20 మంది మృతి
దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. వడదెబ్బ కారణంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒడిశాలో గత మూడు రోజులుగా వడదెబ్బ కారణంగా 20 మంది మరణించారు. ఒడిశా తీవ్రమైన వేడిగాలులతో అల్లాడుతున్నట్లు అధికారిక ప్రకటన తెలిపింది. శుక్రవారం నుంచి వివిధ జిల్లాల్లో మొత్తం 99 మంది వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి. పోస్ట్‌మార్టం, విచారణ తర్వాత 20 మంది వడదెబ్బ మరణాలుగా నిర్ధారించారు. అయితే రెండు మరణాలు ఇతర కారణాల వల్ల సంభవించాయని పేర్కొంది. మిగిలిన కేసుల్లో విచారణ కొనసాగుతోందని తెలిపారు. దీనికి ముందు 42 అనుమానాస్పద వడదెబ్బ మరణాలు నమోదయ్యాయి. వాటిలో ఆరు కేసులు నిర్ధారించబడ్డాయి. మరో ఆరు మరణాలు ఇతర కారణాల వల్ల సంభవించినట్లు ఆ ప్రకటన ద్వారా తెలిసింది. బోలంగీర్, సంబల్‌పూర్, జార్సుగూడ, కియోంజర్, సోనేపూర్, సుందర్‌గఢ్, బాలాసోర్ జిల్లాల్లో మరణాలు ఎక్కువగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
మాల్దీవులు కీలక నిర్ణయం.. ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం!
మాల్దీవులు ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. పాలస్తీనాకు మద్దతుగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని సాకారం చేసేందుకు హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీప దేశం చట్టపరమైన సవరణలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయెల్ పౌరులు తమ దేశంలోకి రాకుండా ఆ దేశ మంత్రిమండలి ఆదివారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఇజ్రాయెల్ పాస్ పోర్టు ఉన్న పౌరులను దేశంలోకి రాకుండా చేసేందుకు చట్ట సవరణ చేస్తామని ఆ దేశ హోం మంత్రి అన్నారు. ఈ క్రమంలోనే మాల్దీవులకు వెళ్లకుండా ఉండాలని ఇజ్రాయెల్ తన పౌరులకు కూడా సూచించింది. మాల్దీవుల హోం వ్యవహారాలు, సాంకేతిక మంత్రి అలీ ఇహ్సాన్ ఆదివారం మాల్దీవుల అధ్యక్షుడి కార్యాలయంలో ఈ విషయాన్ని ప్రకటించారు. క్యాబినెట్ సిఫారసు మేరకు ఇజ్రాయెల్ పాస్‌పోర్ట్ హోల్డర్లు దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధించడాన్ని అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు ఆమోదించినట్లు ఒక పత్రికా ప్రకటన తెలిపింది. పాలస్తీనియన్ల అవసరాలను అర్థం చేసుకోవడానికి ఒక ప్రత్యేక రాయబారిని నియమించాలని మహమ్మద్ ముయిజ్జు నిర్ణయించారు. పాలస్తీనా ప్రజలకు సహాయం చేసేందుకు నిధులను సేకరించే ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నారు. పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి సహాయ సంస్థ సహాయాన్ని తీసుకునే అవకాశం ఉంది. పాలస్తీనియన్లకు సంఘీభావం తెలిపేందుకు మాల్దీవులు ఈ చర్య తీసుకుంది.
భారీగా తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్స్ ఇవే!
బంగారం ధరలు ఇటీవల భారీగా పెరిగి.. జీవనకాల గరిష్టాల్ని తాకిన సంగతి తెలిసిందే. పసిడి ధరలు ఏప్రిల్ నెలలో భారీగా పెరిగాయనుకుంటే.. మేలో అయితే చుక్కలు చూపించాయి. అయితే పెరిగిన ధరలు ఇటీవలి రోజుల్లో కాస్త తగ్గుముఖం పట్టాయి. గత 5-6 రోజుల నుంచి పసిడి ధరలు స్థిరంగా లేదా తగ్గుతూ వస్తున్నాయి. నేడు 22 క్యారెట్ల బంగారంపై రూ.400, 24 క్యారెట్ల బంగారంపై రూ.440 తగ్గింది. సోమవారం (జూన్ 3) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 66,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,110గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. సోమవారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,100 కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,110గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.66,250గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,260గా నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.66,100 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,110గా ఉంది. ఇక బెంగళూరు, కోల్‌కతా, కేరళలలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.66,100 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.72,110గా ఉంది.
విశ్వక్ సేన్ మూవీ మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ” గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”.ఈ సినిమాను ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కించాడు.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది.ఈ సినిమా మే 31 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఈ సినిమాలో విశ్వక్ సేన్ మాస్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది . అలాగే సినిమాను తన అద్భుతమైన టేకింగ్ తో దర్శకుడు కృష్ణ చైతన్య అద్భుతంగా తెరకెక్కించాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు చేరువైంది.సోమవారం నాటికీ ఈసినిమా లాభాల్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.ఈ సినిమా ఈ మూడు రోజులలో 14 కోట్ల వరకు గ్రాస్ ,6.62 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 8 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం.దీనితో ఈ సినిమా మొదటి వారంలోనే లాభాలలోకి అడుగు పెట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.అయితే ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి అయ్యేనాటికి భారీగా కలెక్షన్స్ సాదిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా వుంది.
అలా చేస్తే ప్రభాస్ తో మరోసారి నటిస్తా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు.ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “.నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీ గా వుంది.ఈ మూవీని మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రభాస్ లైనప్ లో కల్కి తరువాత భారీ సినిమాలే వున్నాయి.ఇదిలా ఉంటే ప్రభాస్ తన సినిమా షూటింగ్ వుంది అంటే చాలు అక్కడ వర్క్ చేసే టెక్నిషియన్స్ అందరికి కూడా స్పెషల్ గా తన ఇంటి నుంచి ఫుడ్ తెప్పిస్తుంటారు.ప్రభాస్ తన ఇంటికి వచ్చిన గెస్ట్స్ కి కూడా పలు రకాల ఫుడ్ తో మర్యాద చేస్తుంటాడు. ప్రభాస్ ఫుడ్ తో చేసే మర్యాద చుసిన హీరోయిన్స్ ఫిదా అయిపోయి ప్రభాస్ కు స్పెషల్ థాంక్స్ చెబుతూ పోస్ట్స్ కూడా పెడుతుంటారు..తాజాగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది.ఈ భామ ప్రభాస్ సాహో సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో తన ఫోటోలు పోస్ట్ చేయగా ఓ నెటిజన్ ప్రభాస్ తో మళ్ళీ ఎప్పుడు నటిస్తారు అని కామెంట్ చేసారు.. ప్రభాస్ మళ్ళీ తన ఇంటి నుంచి ఫుడ్ పంపించినప్పుడు అని శ్రద్ధ కపూర్ రిప్లై ఇచ్చింది.ఈ భామ ఇప్పటికి ప్రభాస్ పంపించిన ఫుడ్ గుర్తుంచుకుంది అంటే ప్రభాస్ ఏ రేంజ్ లో ఫుడ్ పంపించి ఉంటాడో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.