మాజీ మంత్రి, ఆ వైసీపీ ఎమ్మెల్యే రూటు ఎటు..? సైకిల్ ఎక్కుతారా?
అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్ల మార్పులు, చేర్పులు జరుగుతోన్న వేళ.. కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి.. పార్టీకి గుగ్‌బై చెప్పేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.. ఆయనతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చలు జరిపినా.. ఆ ఎపిసోడ్ కొలిక్కిరాలేదు.. మరోసారి పార్థసారథితో చర్చలు జరిపారు వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి.. ఈ సారి 30 నిమిషాలు పాటు చర్చలు సాగాయి.. చర్చలు అనంతరం సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయావు అయోధ్య రామిరెడ్డి.. అయితే, మంగళవారం సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు పార్థసారథి.. అయినా ఆయనలో అసంతృప్తి తగ్గినట్టుగా కనిపించడంలేదు.. వచ్చే ప్రభుత్వం కేబినెట్‌లో బెర్త్ పై హామీ కోసం పట్టు బడుతున్నట్లు సమాచారం.. సారథితో జరిపిన చర్చల సారాంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు అయోధ్య రామిరెడ్డి.. దీనిపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తోంది చూడాలి.. కానీ, పార్థసారథి టీడీపీలో చేరతారని విస్తృత ప్రచారం సాగుతోంది.
కాంగ్రెస్ వైపు వైసీపీ ఎమ్మెల్యే చూపు..! రఘువీరారెడ్డితో సుదీర్ఘ చర్చలు
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు మార్పు, చేర్పుల వ్యవహారం చిచ్చు పెడుతోంది.. పలువురు సిట్టింగ్‌లు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధం అయ్యారనే ప్రచారం సాగుతోంది.. ఇక, ఈ మధ్యే సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. వైసీపీ బైబై చెప్పడం ఖాయమనిపిస్తోంది.. పార్టీ మార్పుపై ఈ రోజు స్పష్టత ఇవ్వనున్నారు ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి. రాయదుర్గంలో కాపు నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.. అక్కడే భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనున్నారు.. నిన్న మాజీ మంత్రి, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డిని కలిసిన రామచంద్రారెడ్డి.. రెండు గంటల పాటు సుదీర్ఘ మంతనాలు జరిపారు.. మడకశిర మండలం నీలకంఠాపురంలోని రఘువీరా నివాసంలో రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి భారతి, కోడలు అలేఖ్య కలిసి చర్చించారు. దీంతో, కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఈ రోజు కాపు స్పష్టత ఇస్తారనే చర్చ సాగుతోంది.
వైసీపీలోకి టీడీపీ ఎంపీ..! నేడు సీఎం జగన్‌తో భేటీ..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలయ రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.. ఆ పార్టీ నుంచి ఇటు.. ఈ పార్టీ నుంచి అటు జంపింగ్‌లు కొనసాగుతున్నాయి.. టికెట్ల పంపకాలు నేతల్లో చిచ్చు పెడుతుండగా.. మరోపార్టీ నుంచైనా పోటీకి సిద్ధపడుతున్నారు.. ఇక, ఈ మధ్య బెజవాడ రాజకీయాలు కాకరేపుతున్నాయి.. ఎంపీ సీటు తనకు రాదని తేలిపోవడంతో టీడీపీకి సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని గుడ్‌బై చెప్పేందుకు రెడీ అయ్యాడు.. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించారు.. లోక్‌సభ స్పీకర్ అపాయింట్‌మెంట్ కోరా.. మొదట ఎంపీ పదవికి రాజీనామా చేస్తా.. ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తానని వెల్లడించారు. పనిలోపనిగా తన కుమార్తె కేశినేని శ్వేతతో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయించారు. అయితే, మరోసారి బెజవాడ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు నాని.. అవసరం అయితే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతాననే సంకేతాలు ఇచ్చారు. కానీ, కేశినేని చూపు ఇప్పుడు వైసీపీపై ఉందని ప్రచారం సాగుతోంది.. ఈ రోజు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో సమాశేం అయ్యే ఛాన్స్ కూడా ఉందని తెలుస్తోంది.
చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టు తీర్పు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత.. మరికొన్ని కేసులు తెరపైకి వచ్చాయి.. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం కేసు, ఇసుక కేసు.. ఇలా పలు కేసుల్లో సీఐడీ దూకుడు చూపించింది.. అయితే, ఈ మూడు కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మొదట మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబుకు ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.. ఇక, ఐఆర్‌ఆర్, మద్యం కేసు, ఇసుక కేసుల్లో చంద్రబాబుపై సీఐడీ కేసులు నమోదు చేయగా.. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.. ఈ కేసుల్లో విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఈ రోజు అన్ని కేసుల్లో మధ్యాహ్నం 2.15 గంటలకు తీర్పు వెలువరించనుంది. దీంతో.. హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? అనే ఉత్కంఠ కొనసాగుతోంది.
నేనూ పోటీ చేస్తా.. నాది రాజమండ్రి.. నిర్ణయం అధిష్టానానిది..!
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతలు తమ అభిప్రాయాలను చెబుతూ వస్తున్నారు.. తమ మదిలో ఉన్న సీటును బయటపెడుతున్నారు.. ఫైనల్‌గా నిర్ణయం మాత్రమే పార్టీ అధిష్టానానిదే అంటున్నారు.. ఇప్పుడు బీజేపీ ఏపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు వంతు వచ్చింది.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో నేను కూడాపోటీ చేస్తానని ప్రకటించారు. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడినుండే పోటీకి సిద్ధమన్న ఆయన.. నాది రాజమండ్రి.. నిర్ణయం అధిష్టానానిది అని పేర్కొన్నారు. ఇక, సంక్రాంతి పండగలోపు 32 మందితో బీజేపీ ఎన్నికల కమిటీ నియమిస్తామన్నారు. పార్లమెంటు, అసెంబ్లీలకు వేరువేరుగా మేనేజ్మెంట్ కమిటీలు ఉంటాయన్న ఆయన.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంటు స్థానాలకు సంస్థాగత కమిటీలు వేస్తాం అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నవరత్నాలు కంటి తుడిపి చర్యగా అభివర్ణించారు సోము వీర్రాజు.. వైసీపీ అనాలోచిత నిర్ణయాలు తప్ప.. చేసిన అభివృద్ధి ఏమి లేదని దుయ్యబట్టారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే అర్హత ఎవరికి లేదన్నారు. ఇక, రాష్ట్రంలో మంత్రులు మాట్లాడుతున్న తీరులో ప్రభుత్వం ఉంటుందో ఊడిపోతుందో తెలియని భావన ఉందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కేంద్రంలోని మోడీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పేరును వైయస్సార్ ఆరోగ్య మందిర్ కింద పేరు మార్పు చేశారని ఎద్దేవా చేశారు. తనే ఇంటింటికి వైద్యం పంపిస్తున్నానని కలరింగ్ ఇస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు సోము వీర్రాజు.
చంద్రబాబు కామెంట్లపై కాటసాని కౌంటర్ ఎటాక్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలపై బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కౌంటర్ ఎటాక్‌కు దిగారు. చంద్రబాబు ఏం చేస్తాడో చెప్పకుండా, డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ జిల్లాలోని ఎమ్మెల్యేలను విమర్శిస్తున్నారని కాటసాని రామిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి.. ఏదో పేపర్ ఇచ్చారని చదివి ఆరోపణలు చేయడం సరికాదని సూచించారు. రవ్వల కొండ సంపదను బీసీ జనార్దన్ రెడ్డి దోచుకుంటే మా మీద నెపం వేస్తున్నారు ఎందుకు? అని ప్రశ్నించారు. రవ్వల కొండపై ఉన్న మోడల్ స్కూల్ పిల్లలను.. తలుపుకొట్టి లేసి.. జనార్దన్ రెడ్డి మైనింగ్ బ్లాస్టింగ్ చేసింది వాస్తవం కాదా? అని అడిగినా చెబుతారని తెలిపారు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. గతంలో బీసీ జేఆర్ అనే కాంట్రాక్టు సంస్థను పెట్టుకొని, రవ్వల కొండ, గాలేరు-నగరి, కంకర రాయిని అడ్డంగా దోచుకున్నారని ఆరోపణలు చేశారు. ఇక, సామాజిక న్యాయం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం.. స్వార్థ ప్రయోజనాల కోసమే సీఎం జగన్‌ను చంద్రబాబు విమర్శిస్తున్నారని దుయ్యబట్టారు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. కాగా, పాణ్యం ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.. కాటసాని రాంగోపాల్‌రెడ్డి కలెక్షన్ కింగ్ అని విమర్శించిన ఆయన.. కర్నూలు గ్రావెల్ ఫీల్డ్ (కేజీఎఫ్)గా మార్చారు.. 500 ఎకరాల జగన్నాథగుట్ట భుముల్ని కొట్టేశారని.. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన రవ్వల కొండను బనగానపల్లి ఎమ్మెల్యే రామిరెడ్డి మింగేశారని వ్యాఖ్యానించిన విషయం విదితమే.
పుట్టుకతో ఏ ఒక్కరూ కోటీశ్వరుడు కాదు.. కన్నీటి పర్యంతమైన మంత్రి
పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బతుకులు మారతాయి అనుకున్నాం.. కానీ, 10 ఏళ్ళు గడచిన ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉండి అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గడచిన 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగులతో పాటు సకల జనుల బ్రతుకులు మరలేదు.. రాష్ట్ర ప్రజలు మార్పు కావాలన్నారు తెచుకున్నారు.. 31 రోజుల్లోనే హామీల అమలు దిశగా ముందుకు వెళ్తుంన్నాం.. నిత్యం ప్రజాల్లోనే ఉండాలనే సంకల్పం తో వెళ్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఆ కుటుంబానికి తప్ప ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు.. ఆయన గారి కాలంలో ఏ మంత్రికి స్వేచ్ఛ లేదు.. మా మా శాఖల్లో పూర్తి స్వేచ్ఛ ఉంది.. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా కూడా మాకు మనస్సుంది మార్గం దొరుకుతుంది అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఆరు నూరైనా ఖచ్చితంగా అమలు చేస్తాం.. మేం నాయకులం కాదు సేవకులం.. రెండు పర్యాయాలు నిరుద్యోగులు వేదనకు గురయ్యారు అంటూ కన్నీటి పర్యంతమైన మంత్రి పొంగులేటి.. ఈ సందర్భంగా ఉద్వేగంతో మంత్రి మాట్లాడారు. పుట్టుకతో ఏ ఒక్కరూ కోటీశ్వరుడు కాదు అంటూ ఎంతో మనో వేదనకు గురయ్యారు.. ఆ రోజు నేను కన్నీరు పెడితే కార్యకర్తలు నిరాశ పడతారని నేను కన్నీరు చెమ్మగిళ్ళనివ్వలేదు.. ఇక్కడున్న ఇదే అధికారులు ఎంతో ఇబ్బంది, కేసులు పెట్టారు.. నన్ను పెట్టిన బాధలకు నా కృషికి, పట్టుదలకు ఈ ఫలితం దక్కింది.. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నూటికి నూరు శాతం అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
మహిళా రైతులకు శుభవార్త.. ప్రతేడాది వారి ఖాతాలో రూ.12వేలు
దేశంలో ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అంతకంటే ముందు మహిళా రైతులకు పెద్ద వార్త రావచ్చు. మహిళా రైతులకు ఏటా ఇచ్చే సమ్మాన్ నిధిని ప్రధాని నరేంద్ర మోడీ రెట్టింపు చేయనున్నారు. ఇదే జరిగితే మహిళా రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా రూ.12వేలు అందుతాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైతులకు సమ్మాన్ నిధిగా ఏటా రూ.6000 అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో సమ్మాన్ నిధిని రెట్టింపు చేయనున్నట్లు ప్రకటించవచ్చని రాయిటర్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సార్వత్రిక ఎన్నికల్లో మహిళా ఓటర్ల నుంచి ప్రభుత్వానికి భారీ మద్దతు లభించవచ్చు. ఫిబ్రవరి 1న సమర్పించే మధ్యంతర బడ్జెట్‌లో దీనిని ప్రకటించబోతున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై దాదాపు రూ.12 వేల కోట్ల అదనపు భారం పడనుంది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలోని 11 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు నవంబర్ వరకు 15 విడతలుగా రూ.2.81 లక్షల కోట్లు పంపిణీ చేశారు. బార్క్లేస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్‌కు చెందిన ఆర్థికవేత్త రాహుల్ బజోరియా మాట్లాడుతూ కిసాన్ సమ్మాన్ నిధిని పెంచడం వల్ల మహిళలకు భారీ మద్దతు లభిస్తుందని అన్నారు. దీంతో వారి ఆర్థిక బలం కూడా పెరుగుతుంది. ఏ ప్రభుత్వ పథకంలోనూ మహిళలకు ఇచ్చే నగదు మద్దతును రెట్టింపు చేసిన ఉదాహరణ లేదని నివేదికలోని ఒక మూలాధారం పేర్కొంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో మహిళల స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అయితే ఈ అంశంపై స్పందించేందుకు వ్యవసాయ శాఖ, ఆర్థిక శాఖ నిరాకరించాయి. ప్రస్తుతం దేశంలో 26 కోట్ల మంది రైతులున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 142 కోట్ల దేశ జనాభాలో మహిళల సంఖ్య దాదాపు 60 శాతం. కానీ, 13 శాతం మాత్రమే భూ యజమానులు. సమ్మాన్ నిధిని రెట్టింపు చేసినా ప్రభుత్వానికి పెద్దగా తేడా రాకపోవడానికి ఇదే కారణం.
ఉత్తరప్రదేశ్ లో దారుణం.. బాబాపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన రౌడీలు
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలోని జలేశ్వర్ ఆశ్రమంలో అర్థరాత్రి దుండగులు బాబాపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. 90 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాబాను చికిత్స నిమిత్తం వైద్య కళాశాలలో చేర్పించారు. బాబా పరిస్థితి విషమంగా మారడంతో కాన్పూర్‌కు తరలించారు. ఆశ్రమ ఆలయాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో చాలా కాలంగా వివాదం నడుస్తోందని పోలీసులు తెలిపారు. ఈ విషయం పలుమార్లు స్థానిక పోలీసులకు చేరింది. ఇరువర్గాలను పిలిచి రాజీ కుదిర్చామని, శాంతింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామం మొత్తం భయాందోళనకు గురవుతోంది.
రామమందిరం దర్శనానికి రోజుకు 3 లక్షల మంది సందర్శకులు
అయోధ్య రామ మందిరం ఈ నెల 22న ప్రారంభం కాబోతుంది. ఈ ఆలయంలో రాంలల్లా ప్రాణప్రతిష్ట కోసం భారత్ పాటు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా అయోధ్యకు ప్రతి రోజూ మూడు లక్షల మందికి పైగా ప్రజలు సందర్శిస్తారని అంచనాలు వేస్తున్నారు. వాటికన్ సిటీ, కంబోడియా, జెరూసలేంతో పాటు భారతదేశంలోని పలు రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కాగా, అయితే, రాబోయే మూడు-నాలుగేళ్లలో రోజుకు మూడు లక్షల మందికి పైగా భక్తులు అయోధ్యను సందర్శిస్తారని అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న జనాభాతో పాటు పర్యాటక అవసరాలకు అనుగుణంగా.. రోడ్లు, వంతెనలు, మురుగునీటి వ్యవస్థతో పాటు యుటిలిటీస్ వంటి ఆధునిక మౌలిక సదుపాయాలను రూపొందిస్తున్నారు. ఇక, ఆలయానికి వచ్చే భక్తుల రద్దీకి తగినట్లు ఏర్పాట్లతో పాటు సత్రాలు, హోమ్‌స్టేలపై అధికారులు దృష్టి సారించారు. అయోధ్య నగరం యొక్క చారిత్రక, సాంస్కృతిక స్వభావాన్ని తెలియజేస్తూ.. మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని సీపీ కుక్రేజా ఆర్కిటెక్ట్స్ మేనేజింగ్ ప్రిన్సిపాల్ కుక్రేజా తెలిపారు. అయోధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వారసత్వ ఆస్తులతో పాటు ఇతర వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ప్రపంచ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కుక్రేజా వెల్లడించారు.
హైదరాబాద్‌లో బీసీసీఐ అవార్డుల ఫంక్షన్.. ప్రత్యేక అతిథులు ఎవరంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తన వార్షిక అవార్డుల కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించనుంది. జనవరి 23న హైదరాబాద్‌లో బీసీసీఐ అవార్డుల వేడుక జరగనుంది. ఈ వేడుకలకు భారత జట్టుతో పాటు ఇంగ్లండ్ ప్లేయర్స్ కూడా హాజరుకానున్నారు. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా జనవరి 25 నుంచి ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. బీసీసీఐ అవార్డుల వేడుక సమయానికి ఇంగ్లండ్ ప్లేయర్స్ హైదరాబాద్‌లోనే ఉండనున్న నేపథ్యంలో వారిని కూడా బీసీసీఐ ఆహ్వానించనుంది. చివరిసారిగా బీసీసీఐ అవార్డుల ఫంక్షన్ 2020 జనవరిలో జరిగింది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ వేడుక నిలిచిపోయింది. 2018-19 క్రికెట్ ఏడాదికి గానూ అవార్డులను 2020లో బీసీసీఐ అందజేసింది. జస్ప్రీత్ బుమ్రా, పూనమ్ యాదవ్ 2020లో పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకోగా.. కృష్ణమాచారి శ్రీకాంత్, అంజుమ్ చోప్రాలు సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లు పాలీ ఉమ్రిగర్ అవార్డుకు ఎంపికవుతారన్న విషయం తెలిసిందే.
కొబ్బరి చెట్ల మధ్య హంసలా మెరిసిపోతున్న బుట్ట బొమ్మ..
టాలివుడ్ ముద్దుగుమ్మ బుట్టబొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ప్లాప్ సినిమాలు ఒకవైపు పలకరిస్తున్నా కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది.. ఇక సోషక్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది.. తాజాగా వైట్ లెహంగాలో ప్రకృతిలో వయ్యారాలను వలకబోసింది బుట్టబొమ్మ.. ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. డిఫరెంట్ స్టయిల్ డ్రెస్సులు ధరించింది. ట్రెండీ వేర్‌లో అదిరిపోయే పోజులిచ్చింది. ఇందులో సూపర్ హాట్‌గా ఉండటం విశేషం.. ఈ అమ్మడు టాలీవుడ్‌లో టాప్ స్టార్స్ తో కలిసి నటించింది. ప్రభాస్, మహేష్‌బాబు, ఎన్టీఆర్, బన్నీ, రామ్‌చరణ్ వంటి వారితోనూ కలిసి నటించింది. యంగ్ హీరోలతోనూ జోడీ కట్టింది. వరుస అవకాశాలే కాదు, వరుస విజయాలతోనూ లక్కీ హీరోయిన్‌గా మారింది… కానీ గతేడాది ఈ బ్యూటీకి కలిసి రాలేదు. ఊహించని దెబ్బలు తగిలాయి. నటించిన నాలుగు సినిమాలు ప్లాప్ అయ్యాయి..
మహేశ్.. అభిమానులకు మీరొక ఎమోషన్! నమ్రత పోస్ట్ వైరల్
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా ‘గుంటూరు కారం’. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుండడంతో.. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గుంటూరు కారం సందడి చేయనుంది. ఈ సందర్భంగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ మంగళవారం గుంటూరులో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈవెంట్‌లో మహేశ్ బాబు అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేష్ బాబు మాట్లాడిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన నమ్రత.. అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు. ‘మహేష్ అభిమానుల గురించి ఇప్పటికే ఎంతోమంది గొప్పగా చెప్పారు. ఈ విషయం గురించి మాట్లాడే చివరి వ్యక్తిని బహుశా నేనే కావచ్చు. మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆయనపై అపారమైన ప్రేమను కురిపిస్తారు. ప్రతి ప్రయత్నంలో అండగా నిలిచి, మరింత కష్టపడి పని చేసేలా చేస్తున్నారు. ఈరోజు మా సొంత ఊరు గుంటూరులో ఆయనకు, గుంటూరు కారం టీమ్‌కు లభించిన ఆదరణ చూసి ఓ విషయం చెప్పాలి. మహేశ్.. అభిమానులకు మీరొక ఎమోషన్. ఈ ప్రేమను మనం జీవించి ఉన్నంత కాలం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. మహేష్ బాబుని ఎంతో ప్రేమగా ప్రేమిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు’ అని నమ్రత పేర్కొన్నారు.