బీఆర్ఎస్ నాయకులు మాటలు నేతీ బీరకాయలో నేతీ చెందంలాగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత పది సంవత్సరాలలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన అనేక సందర్భాలలో కేవలం ఎన్నికల సంవత్సరంలో ఎకరానికి 10 వేల పరిహారం ప్రకటించి హడావిడి చేసి కేవలం 150 కోట్లు మాత్రమే విడుదల చేసారు అని విమర్శించారు. ఆ తర్వాత 350 కోట్లకి ఉతర్వూలు జారీ చేసి పరిహారం అందించిన పాపాన పోలేదన్నారు. అదే విధంగా అదే నెలలో మరోసారి1,25,000 ఎకరాల పంట నష్టం సంబవించిన పట్టించుకున్న దాఖలాలు లేవు అని ఆయన ఆరోపించారు. గోదావరి వరదలు వచ్చిన సందర్భంగా 100కు 100 శాతం పంటలు నష్టపోయి ఇసుక మేటలు వేసిన సందర్భంలో అప్పటి ప్రభుత్వంలోని నాయకులు ఏ ఒక్కరూ పట్టించుకోలేదు.. రుణమాఫీ అమలు చేస్తామని గొప్పగా చెప్పుకున్న బీఆర్ఎస్ నాయకులు మొదటి విడత మాఫీని నాలుగు విడతలుగా ఇవ్వడంతో ఆ మొత్తం అసలుకు బదులు వడ్డీ జమైన సందర్భం ప్రతి ఒక్క రైతుకి అనుభవమే అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
Read Also: Warangal: వరంగల్లోని పలు ఆస్పత్రులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నోటీసులు..
ఇక, 2018లో ప్రకటించిన రెండవ విడత రుణమాఫీ 19,600 కోట్ల రూపాయలకు గాను కేవలం 9500 కోట్ల రూపాయలను విడుదల చేసి మమ అనిపించి.. ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ముసలి కన్నీళ్ళు పెడుతున్నారు అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అధికారంలో ఉండగా ఏనాడూ రైతు కష్టాలను పట్టించుకోని ప్రభుత్వం గొప్పలకి పోయి నీళ్ళు అవసరంలేని సందర్భాలలో కూడా కాలువలకు నీళ్ళు విడుదల చేసి నీరు వృథా చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ఎప్పటికీ రైతుల పక్షపాత ప్రభుత్వమే.. గత రెండు మూడు రోజుల నుంచి కురిసిన వర్షం వల్ల జరిగిన పంట నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. ఈ ప్రభుత్వం రైతులను కష్టకాలంలో ఆదుకునేందుకు ఎప్పుడు సిద్దంగా ఉంటుందన్నారు. ఎన్నికల కోసం లేదా రాజకీయాల కోసం ఉత్తుత్తి మాటలు ఉత్తుత్తి పథకాలు ప్రకటించదు.. అదే విధంగా వ్యవసాయ శాఖ కార్యదర్శి, పంట నష్టంపై రైతు వారి సర్వే చేసి నివేదిక సమర్పించవల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.