నేటి కాలం విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే షాకింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని, చదువులో రాణించలేకపోతున్నానని, చదువు ఇష్టం లేదని వంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ పదో తరగతి విద్యార్థి బాగా చదువుకోవాలని తండ్రి మందలించడంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన దోమల్ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ మైసమ్మ నగర్ లో చోటుచేసుకుంది.
రాకేష్, లత దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడైన కొల్లా అరవింద్(15) గాంధీ నగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. పదో తరగతిలో బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని తండ్రి కుమారుడిని మందలించాడు. మనస్థాపానికి గురైన పదో తరగతి విద్యార్థి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అరవింద్ మృతి చెందినట్లు ధ్రువీకరించారు గాంధీ ఆసుపత్రి వైద్యులు. తండ్రి రాకేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దోమలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.