ఈ నెల 9న చిత్తూరులో జగన్ పర్యటన:
చిత్తూరు జిల్లాలో ఈ నెల 9వ తేదీన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. బంగారుపాళ్యం మ్యాంగో మార్కెట్ యార్డు చిన్నది కావడంతో కేవలం 500 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నామని తెలిపారు. అలాగే, ఇప్పటికే హెలిప్యాడ్ కు అనుమతిచ్చిన చిత్తూరు పోలీసులు.. హెలిపాడ్ వద్ద 30 మందికి అనుమతి ఉంటుంది.. ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదు అన్నారు.
రేపు వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు:
కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. రేపు (జూలై 8న) దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించనున్నారు. ఈ రోజు రాత్రికి పులివెందులలోనే బస చేయనున్నారు జగన్. రేపు ఉదయం 6.45 గంటలకు పులివెందులలోని తన స్వగృహం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 7.30 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని.. 8.15 గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు.
ఈ నెల 25 నుంచి ఆగస్టు 24 వరకు శ్రావణ మాసోత్సవాలు:
నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో 25వ తేది నుంచి ఆగష్టు 24 వరకు శ్రావణా మాసోత్సవాలు జరగనున్నాయి. శ్రావణ మాసోత్సవాలపై దేవస్థానం అధికారులు, సిబ్బందితో ఆలయ ఈవో శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రావణమాసంలో భక్తుల రద్దీ దృశ్య మొత్తం 16 రోజులు గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలుపుదల చేస్తున్నారు. శ్రావణ మాసంలో ఆగస్టు 15 నుంచి 18 వరకు స్పర్శ దర్శనం ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఇక, భక్తులందరికి శ్రీస్వామివారి అలంకార దర్శనం.. శ్రావణ మాసంలో శనివారం, ఆదివారం, సోమవారం, పర్వదినాలలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలుపుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, ఆగష్టు 15 నుంచి 18వ తేదీ మినహా మిగిలిన రోజులలో రోజుకు 3 విడుతలుగా స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతి ఉంటుందని ప్రకటించారు. శ్రావణమాసంలో భక్తుల సౌకర్యార్థమై రెండుసార్లు ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్లు శ్రీశైల ఆలయ అధికారులు వెల్లడించారు.
దారికి అడ్డంగా కట్టిన గోడ తీస్తే 3:
దారికి అడ్డంగా కట్టిన గోడ వేలాది మంది ప్రజలకు గోసగా మారింది. ఆఖరికి అది పోరాటంగా మారింది. ఔటర్ రింగు రోడ్డు ఎగ్జిట్ 4 నుంచి మల్లంపేట, బాచుపల్లి క్రాస్‌రోడ్స్ మీదుగా ప్రగతినగర్‌కు సులభంగా చేరుకునే మార్గం దొరకక అవస్థలు పడినవారు కొంతమంది అయితే.. మాది గేటెడ్ కమ్యూనిటీ మా కాలనీలోంచి రాకపోకలు బంద్ అంటూ అడ్డు గోడలు కడుతున్నవారు మరికొంతమంది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండలంలోని మల్లంపేట – బాచుపల్లి గ్రామాల మధ్య నెలకొన్న వివాదం ఇది. మల్లంపేట ఔటర్ రింగురోడ్డు ఎగ్జిట్ నుంచి బాచుపల్లి క్రాస్ రోడ్స్ మీదుగా ప్రగతినగర్ కు కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తే సరిపోతోంది. కాని దారి మధ్యలో ప్రణీత్ ఆంటిల్యా వారు నిర్మించిన అడ్డుగోడతో 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని మల్లంపేట గ్రామప్రజలతో పాటు.. మరో 10 కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రణీత్ ఆంటిల్యా వారు అడ్డుగోడ తీసేస్తే 60 నుంచి 40 ఫీట్ల వెడల్పుతో ఉన్న అడ్డ దారి దొరుకుతుందంటున్నారు. వాస్తవానికి గేటెడ్ కమ్యూనిటీ కాదు.. అయినా గోడ కట్టి మాది గేటెడ్ కమ్యూనిటీ అంటూ రాకపోకలను అడ్డుకుంటున్నారని మల్లంపేట వాసులు వాపోతున్నారు.
యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష:
అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మైనర్ బాలికను మోసగించి అత్యాచారం చేసిన కేసులో ఓ యువకుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 21 ఏళ్ల కార్ వాషర్ జనపాల అఖిల్‌కు పోక్సో చట్టం కింద 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను నాంపల్లి కోర్టు విధించింది. మైనర్ బాలికను మోసగించి గర్భవతిని చేసిన కేసులో నిందితుడిపై దర్యాప్తు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేసిన పోలీసులు, 18 మంది సాక్షులను హాజరుపర్చి, ప్రాసిక్యూషన్ వాదనలు నిలబెట్టగలిగింది. నిందితుడికి రూ.5,000 జరిమానా, అలాగే బాధితురాలికి 8 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు హైదరాబాద్ సౌత్ జోన్ చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్‌లో దాఖలైన కేసులో వెలువడింది.
జాకీల సాయంతో వందేళ్ల నాటి ఆలయాలు లిఫ్ట్:
జాకీల సాయంతో ఇళ్లను లిఫ్ట్ చేసి.. ఎత్తు పెంచడం మనందరికీ తెలిసిందే. మొదటిసారిగా ఆలయాలను కూడా లిఫ్ట్ చేస్తున్నారు. తమిళనాడులో ఎప్పుడో కట్టిన ఆలయాలు కావడంతో.. వాటి చుట్టూ రోడ్ల ఎత్తు పెరిగి సమస్యలు ఎదురవుతున్నాయి. గుడులు రోడ్డకు దిగువన ఉండడంతో వర్షాకాలంలో ముంపు సమస్య ఎదురవుతోంది. ఈ సమస్య నుంచి బయటపడడాని పలు ఆలయ కమిటీలు లిఫ్ట్ చేసే పద్దతిని అనుసరిస్తున్నాయి. హిందూ రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ అనుమతితో ఇప్పటికే 15 ఆలయాల ఎత్తు పెంచాయి. ఈ పనులను మామచంద్ హౌస్ లిఫ్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపడుతోంది.
పూర్నియాలో మంత్రాల నెపంతో దారుణం:
శాస్త్ర, సాంకేతిక రంగాలలో దూసుకెళ్తుంటే.. సమాజంలో మాత్రం మూఢనమ్మకాలు, చేతబడులు అనే రుగ్మతలు నిర్మూళించబడడం లేదు. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో దాడులకు పాల్పడడం, చంపేందుకు కూడా వెనకాడడం లేదు. తాజాగా బీహార్ లోని పూర్ణియాలో ఘోరం జరిగింది. మంత్రాల నెపంతో ఒక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కొట్టి సజీవ దహనం చేసిన దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెట్గామా గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం.. అదే గ్రామానికి చెందిన రామ్‌దేవ్ ఒరాన్ కుమారుడు అనారోగ్యానికి గురై మరణించాడు. మరొక కుమారుడి ఆరోగ్యం క్షీణిస్తోంది. దీనంతటికి మరణాలే కారణమని గ్రామస్తులు ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
పక్షవాతానికి గురైన భర్తను ప్రియుడి సాయంతో:
భార్యాభర్తల బంధంలో అక్రమ సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. పరాయి వ్యక్తుల మోజులో పడి భర్తలను అంతమొందిస్తున్నారు కొందరు భార్యలు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ, ప్రియుడితో కలిసి మంచం పట్టిన భర్తను దిండుతో గొంతు నులిమి హత్య చేసి, దానిని సహజ మరణంలా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దిశా రామ్‌టేకే (30), చంద్రసేన్ రామ్‌టేకే (38) 13 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. సుమారు రెండు సంవత్సరాల క్రితం, భర్త పక్షవాతం బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలో భర్త తరచుగా తన భార్య ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేసేవాడు.
బ్రియాన్ లారా వరల్డ్ రికార్డ్ సేఫ్:
వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘400’ స్కోర్. 2024లో ఇంగ్లండ్‌పై లారా 400 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 21 ఏళ్లుగా టెస్టుల్లో ఆ రికార్డు పదిలంగా ఉంది. చాలా మంది ప్లేయర్స్ 400 చేరువకు వచ్చి.. ఔట్ అయ్యారు. ఇన్నాళ్లకు లారా వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టే ఛాన్స్ దక్షిణాఫ్రికా కెప్టెన్ వియాన్ ముల్డర్‌కు వచ్చింది. అయితే అతడు 400 వద్దనుకోవడంతో లారా ప్రపంచ రికార్డు సేఫ్‌గా ఉంది. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వే, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు జరుగుతోంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌట్ కాగా.. దక్షిణాఫ్రికా 626/5 వద్ద డిక్లేర్ చేసింది. ప్రొటీస్ కెప్టెన్ వియాన్ ముల్డర్ (367 నాటౌట్; 334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్‌లు) ట్రిపుల్ సెంచరీ చేశాడు. ముల్డర్ మరో 34 రన్స్ చేస్తే.. బ్రియాన్ లారా ప్రపంచ రికార్డు 400 స్కోరును బ్రేక్ చేసేవాడు. టెస్టుల్లో వరల్డ్ రికార్డ్బ్రేక్ అయ్యే అవకాశం ఉన్నా.. ముల్డర్ వద్దనుకున్నాడు. తనకు రికార్డు కన్నా.. జట్టు ప్రయోజనమే ముఖ్యమని భావించి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. తానే కెప్టెన్ అయి ఉండి.. ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. క్రికెట్ ఫాన్స్ ముల్డర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
డీపీఎల్ వేలంలో కోహ్లీ, సెహ్వాగ్ కుమారులు:
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025 వేలంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ అన్న వికాస్ కోహ్లీ కుమారుడు ఆర్యవీర్ కోహ్లీ పాల్గొన్నాడు. ఆర్యవీర్ కోహ్లీని సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ రూ.1 లక్షకు కొనుగోలు చేసింది. టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్‌ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ రూ.8 లక్షల భారీ ధరకు కైవసం చేసుకుంది. వికాస్, సెహ్వాగ్ కుమారులు డీపీఎల్ 2025 వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇద్దరి పేరు ఆర్యవీర్ కావడం ఇక్కడ విశేషం.
రవితేజ తమ్ముడు కొడుకు ‘మారెమ్మ’ లుక్:
మాస్ మహారాజా రవితేజ బ్రదర్ యాక్టర్ రఘు కుమారుడు యంగ్ చాప్ మాధవ్ రూరల్ రస్టిక్ మూవీ ‘మారెమ్మ’తో హీరోగా సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ హై-ఆక్టేన్ ప్రాజెక్ట్‌ను మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు తమ ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మిస్తున్నారు. ఈరోజు మేకర్స్ ఈ చిత్రం ఇంపాక్ట్ ఫుల్ టైటిల్, అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్ రెండింటినీ రిలీజ్ చేశారు. ఇది పవర్ ఫుల్ రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా ఉంటుందని హామీ ఇస్తోంది. ఫస్ట్ లుక్ మాధవ్‌ను రూరల్ అవతార్‌లో పరిచయం చేస్తుంది. చెక్డ్ షర్ట్, లుంగీ ధరించి, మెడలో క్యాజువల్‌గా చుట్టుకున్న టవల్‌తో, మాధవ్ రగ్గడ్ రూరల్ హీరోగా కనిపించారు. అతని చెదిరిన జుట్టు, గడ్డం ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాయి. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఉంచబడిన ఒక గేదె, బలం, ఆధిపత్యాన్ని సూచిస్తుంది. మాధవ్ పొడవాటి కర్రను పట్టుకుని ఏదైనా సవాలును ఎదుర్కోవడానికి సిద్ధం గా వున్నట్లు కనిపించారు. పోస్టర్, టైటిల్ అదిరిపోయాయి.
‘కింగ్‌డమ్’ రిలీజ్ ఆరోజే.. ఇట్స్ అఫీషియల్!
విజయ్ దేవరకొండ ఖుషి సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన కింగ్‌డమ్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తయింది, రిలీజ్ కావాల్సి ఉంది. కానీ సినిమా అవుట్‌పుట్ విషయంలో టీం సంతృప్తిగా లేకపోవడంతో చాలా రీషూట్స్ చేశారు. అయితే, సినిమా ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడింది. ఇక తాజాగా సినిమా రిలీజ్ డేట్ ప్రోమోతో లేటెస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సినిమా రిలీజ్ డేట్ ప్రోమోతో మరోసారి ఒక్కసారిగా అంచనాలు పెంచే ప్రయత్నం చేసింది కింగ్‌డమ్ టీం. ఇక తాజా ప్రకటన మేరకు ఈ సినిమా ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 24వ తేదీన హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా వచ్చిన వారం రోజులకు కింగ్‌డమ్ కూడా బరిలోకి దిగబోతోంది.
బాలయ్య్య రెండో వైపు చూపిస్తారట:
నందమూరి బాలకృష్ణ కెరీర్ ఇప్పుడు పీక్స్‌లో ఉంది. ఆయన చేస్తున్న సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి, షోలు బాగా ఆడుతున్నాయి. రాజకీయాల్లో కూడా ఆయన తిరుగులేనట్టు దూసుకుపోతున్నారు. ప్రస్తుతానికి ఆయన అఖండ సెకండ్ పార్ట్‌లో నటిస్తున్నారు. రాబోయే సినిమాలకు భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అమెరికాలోని తానా సభలకు హాజరయ్యారు. అదే సభకు హాజరైన ఆయన తర్వాతి సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని, ఈ సినిమాలో బాలయ్య నెవర్ బిఫోర్ లుక్‌లో ఉండబోతున్నారని వెల్లడించారు. ఇప్పటివరకు బాలకృష్ణలో చూడని కొత్త యాంగిల్‌ను చూపించబోతున్నానని, ఇంతకుముందే గోపీచంద్ మలినేని ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో నటిస్తూ, మాస్ ఎంటర్‌టైనర్‌గా సినిమా చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ జరుగుతోంది.