Anaparthi: తూర్పు గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ ఎన్డీయే కూటమి అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించిన శివరామ కృష్ణం రాజు ఎన్నికల ప్రచారాన్ని స్థానిక తెలుగు దేశం పార్టీ నేతలు అడ్డుకోవడంతో ఘోర అవమానం జరిగింది. అనపర్తి ఎన్డీయే కూటమి అభ్యర్థి శివరామకృష్ణంరాజు ఇవాళ (బుధవారం) బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచారంలో భాగంగా శివరామ కృష్ణంరాజు పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీడీపీ- జనసేన- బీజేపీ కండువాలు ధరించి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం టిక్కెట్ ఆశించి బంగపడ్డ మాజీ ఎమ్మెల్యే రామ కృష్ణారెడ్డి ఆయనను అడ్డగించి ఆయన మెడలో టీడీపీ కండువా ధరించడానికి వీల్లేదంటూ బలవంతంగా కండువా తీయించేసారు. ప్రస్తుతానికి కూటమి ప్రకటించిన అభ్యర్థిని అని శివరామ కృష్ణంరాజు ఎంత చెప్పినా టీడీపీ జెండాతో ప్రచారం చేయటం కుదరదని మాజీ ఎమ్మెల్యే రామ కృష్ణారెడ్డి భీష్మించి కూర్చున్నారు.
Read Also: AP Weather Report: ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండండి.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ..!
ఇక, ఈ సంఘటన జరిగిన ప్రదేశంలో పలువురు బీజేపీ పరిస్థితి కూటమిలో ఎంత దారుణంగా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. అధ్యక్షరాలు పురందేశ్వరి బీజేపీని ఇంత దారుణంగా తయారు చేసిందా అని కరుడుగట్టిన బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. దీనిపై పురందేశ్వరి రాష్ట్ర కన్వీనర్లు చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి శివరామ కృష్ణంరాజు వేసుకున్న టీడీపీ కండువాని బలవంతంగా తొలగించడంతో జనసేన- బీజేపీ కండువాలతో ఆయన ప్రచారం కొనసాగించారు. కాగా, టీడీపీ కండువా వేసుకొని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి శివరామ కృష్ణంరాజు ఎన్నికల ప్రచారానికి తిరగవద్దని బిక్కవోలు చౌదరి హెచ్చరించారు. అయితే, టీడీపీ శ్రేణుల చర్యలపై బీజేపీ- జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు.