Supreme Court says No to Green crackers: దీపావళి వస్తుందంటే అందరూ ఎదురు చూసేది టపాసులు కాల్చడం కోసమే. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు టపాసులు కాల్చి ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అయితే వీటి వల్ల భారీగా వాయుకాలుష్యం, ధ్వని కాలుష్యం కలుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న ఢిల్లీలో టపాసులు కాల్చడం పై ప్రభుత్వం నిషేధం విధించింది. దీనిపై కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రభుత్వం నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. గ్రీన్ క్రాకర్లకు సైతం సుప్రీం కోర్టు నో చెప్పింది. బేరియంతో ఫైర్ క్రాకర్ల తయారీ, వినియోగాన్ని అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సైతం తోసిపుచ్చింది. ఈ బాణాసంచా తయారీ, విక్రయ ప్రక్రియ గురించి కేంద్ర ప్రభుత్వం, బాణసంచా తయారీదారులు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. వాటి తయారీకి అనుమతి ఇవ్వాలని ఇరు వర్గాలు అభ్యర్థించాయి. దేశంలో చాలా చోట్లా బేరియంతో కూడిన బాణసంచాపై నిషేధం విధించిన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.
Also Read: Perni Nani: చంద్రబాబు అవినీతికి ఆ నోటీసులే సాక్ష్యం..! కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ఆయనదే..
2018 నాటి నిషేధాన్ని అధికారులు విధిగా అమలు చేయాలని జస్టిస్ బోపన్న, జస్టిస్ సుందరేష్ తో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి హాజరై వాదనలు వినిపించారు. బేరియంను 2018 దీపావళి కోసం నిషేధించినట్టు వివరించారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ మినహా అన్ని చోట్లా గ్రీన్ కాకర్స్ కాల్చవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని.. బాణాసంచా కాల్చడం ముఖ్యం కాదని గతంలో కూడా కోర్టు పేర్కొంది. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే ఢిల్లీ సర్కారు క్రాకర్లు కాలుస్తున్న వారిపై కేసులు పెడుతుంది. అయితే సుప్రీం కోర్టు ఇది సరైనది కాదని అభిప్రాయపడింది. కాలుస్తున్న వారిని కాకుండా వాటి తయారీ మూలాల్లోకి వెళ్లి సమస్యను పరిష్కరించాలని సూచించింది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటి వరకు టపాసులు కాలుస్తున్నారంటూ 2,616 మంది వ్యక్తులపై కేసులు పెట్టింది. రాజధాని నగరంలో పటాకుల విక్రయాలకు తాత్కాలిక లైసెన్సులు ఇవ్వొద్దని ఢిల్లీ పోలీసులను గత వారం సుప్రీంకోర్టు ఆదేశించింది.