ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ మొత్తంలో నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో యశ్వంత్ వర్మ వ్యవహారంలో సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు తిరిగి పంపాలని నిర్ణయించింది. మార్చి 20, 24 తేదీలలో జరిగిన రెండు సమావేశాలలో ఈ సిఫార్సు చేసినట్లు కొలీజియం వెల్లడించింది. దీనిపై కేంద్రం ఆమోదం లభించాక తుది ప్రకటన వెలువడనుంది. న్యాయమూర్తి బదిలీని వ్యతిరేకిస్తూ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ సిఫార్సు వెలువడింది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్ ప్రకారం.. కొలీజియం గతంలో జరిగిన సమావేశంలో జస్టిస్ వర్మ బదిలీపై అంగీకరించింది.
Read Also: Adhi Dha Surprisu: మాకు అది బూతు అనిపించలేదు
కాగా.. మార్చి 14న జస్టిస్ వర్మ నివాసంలో జరిగిన అగ్నిప్రమాదం క్రమంలో గణనీయమైన మొత్తంలో నగదు గుర్తించారు. ఈ నగదుకు ఆయన, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని జస్టిస్ వర్మ స్పష్టం చేశారు. ఈ సంఘటన తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరిగిన కుట్రలో భాగమని ఆయన పేర్కొన్నారు. 1969లో అలహాబాద్‌లో జన్మించిన జస్టిస్ యశ్వంత్ వర్మ.. 2014లో అలహాబాద్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఆయన 2021లో ఢిల్లీ హైకోర్టుకు నియమితులయ్యారు.
Read Also: Flight Break Fail: తృటిలో పెను ప్రమాదం తప్పించుకున్న డిప్యూటీ సీఎం..
జస్టిస్ వర్మ నివాసంలో కనుగొనబడిన నగదు వ్యవహారం నేపథ్యంలో సుప్రీంకోర్టు మరింత దర్యాప్తు అవసరం అని తెలిపింది. దీనిపై విచారణ నివేదికను శనివారం రాత్రి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు తిరిగి బదిలీ చేయాలని సిఫార్సు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా.. జస్టిస్ వర్మపై వేసిన ఆరోపణలను పరిశీలించేందుకు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఈ వివాదంపై మరింత దర్యాప్తు చేయనుంది.