TDP Meeting: నెల్లూరు జిల్లాలోని కందుకూరులో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 8 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరచిపోకముందే తాజాగా అదే చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఆదివారం గుంటూరులో జరిగిన సభలో ఒక్కసారిగా అభిమానులు, కార్యకర్తలు దూసుకురావడంతో తోపులాట జరిగింది. టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో చంద్రన్న సంక్రాంతి కానుక వస్త్రాల పంపిణీలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ తోపులాటలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలంలో ఓ మహిళ మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారు గోపిరెడ్డి రమాదేవి, ఆసియాగా గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే సభా నిర్వాహకులపై స్థానికులు మండిపడుతున్నారు. నూతన సంవత్సరం తొలిరోజే గుంటూరులో ఈ ఘటన జరగడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సంక్రాంతికి వస్త్రాలు పంపిణీ చేస్తామని టీడీపీ గత పది రోజులుగా ప్రచారం చేస్తోంది.
Kabaddi Player: కబడ్డీ ఆటలో అపశ్రుతి.. కూతకొచ్చిన ఆటగాడు మృతి
సంక్రాంతికి చంద్రన్న కానుకలు ఇస్తామంటూ టీడీపీ నేతల ప్రచారం కారణంగా సభకు పెద్ద ఎత్తున మహిళలను, వృద్ధులను టీడీపీ నేతలు తరలించారు. ఈ క్రమంలో కొందరికి మాత్రమే కానుకలు ఇచ్చి మిగతా వారిని టీడీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోమన్నారు. దీంతో, తమకు కూడా కానుకలు ఇవ్వాలని మహిళలు దూసుకొచ్చారు. జనం ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఊపిరాడక ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ క్రమంలో సభ నిర్వాహకులు, చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ వైఫల్యంతో ఒక్కసారిగా సభాప్రాంగణం వద్ద తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. సభా ప్రాంగణం వద్ద అంబులెన్సులు కూడా లేకపోవడంతో ప్రైవేట్ వాహనాల్లో గాయపడిన వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సభ నిర్వాహకులపై ప్రజలు మండిపడుతున్నారు. పండుగ రోజు తీసుకువచ్చి మమ్మల్ని చంపుదాం అనుకున్నారా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.