Uttam Kumar Reddy : మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు, గోబెల్స్ ప్రచారమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ద్వారా 30 టీఎంసీల నీరు అందాల్సి ఉండగా, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పనులను పూర్తి చేయకుండా వదిలేసిందని మండిపడ్డారు. ఆ పనులు పూర్తయి ఉంటే నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చేదని పేర్కొన్నారు.
ఈ ప్రమాదాన్ని అందరూ చూడటానికి ప్రభుత్వం పూర్తి అనుమతిని ఇచ్చిందని, ఎవరినీ అడ్డుకోవడం లేదని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎన్నో ప్రమాదాలు జరిగినా, అప్పటి ప్రతిపక్ష నాయకులైన తమకు అనుమతులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రెండు, మూడు నెలల్లో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పనులను పునఃప్రారంభిస్తామని, కొన్ని రోజుల్లో సహాయక చర్యలు పూర్తవుతాయని తెలిపారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడే అనుమతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా, పనులు నామమాత్రంగానే మిగిలిపోయాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వారి పాలనలో నీటిపారుదల శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్, హరీష్ రావులకే దక్కుతుందని ధ్వజమెత్తారు.
తాము పూర్తిగా పారదర్శకంగా, ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగిస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో బ్లాస్ట్ జరిగి 9 మంది మృతిచెందినప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు పరామర్శకు రాలేదని ప్రశ్నించారు. ఆ రోజు రేవంత్ రెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసుల ద్వారా అరెస్టు చేయించారని గుర్తుచేశారు.
దేవాదుల ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, వారి ఆస్తిపంజరాలు ఐదేళ్ల తర్వాతే లభించాయని తెలిపారు. హరీష్ రావు ఎప్పుడైనా ఈ ఘటనల గురించి మాట్లాడారా? అని నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్నో ప్రమాదాలు జరిగినా, వారిని ప్రశ్నించే నాథుడే లేకపోయాడని విమర్శించారు. ఇప్పుడు మాత్రం హరీష్ రావు ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం హాస్యాస్పదంగా మారిందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్‌తో కుమ్మక్కై, ప్రగతిభవన్‌లో విందులు, వినోదాలు చేసుకుంటూ కృష్ణానదిని దోచుకుపోయేలా చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ కోసం రూ.27,500 కోట్లు ఖర్చు చేసినా, ఒక్క ఎకరానికి కూడా నీరు అందించలేకపోయారని తీవ్ర విమర్శలు చేశారు.
ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌కు కరెంట్ కట్ చేయడంతో డీ-వాటరింగ్ చేయలేక పనులు నిలిచిపోయాయని వెల్లడించారు. అప్పటి మంత్రి జగదీశ్ రెడ్డి ఏమి చేశారని ప్రశ్నించారు. ఇదే సమయంలో, తనకు హెలికాప్టర్‌లో తిరిగే శ్రద్ధ లేదని, తాను గతంలో వైమానిక దళంలో పైలట్‌గా పనిచేశానని గుర్తుచేశారు.
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు అత్యంత అనుభవజ్ఞులైన 11 రక్షణ బృందాలను రంగంలోకి దించి, సమర్థవంతంగా సహాయక చర్యలు చేపట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ విపత్తును సమర్థంగా నిర్వహించడంలో ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి తప్పులు చేయలేదని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఖండించారు. హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు చెప్పే మాటల్లో ఎటువంటి నిజం లేదని, అవన్నీ పూర్తిగా అసత్యాలని తేల్చిచెప్పారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఉందని, ఎలాంటి అనవసర ఆరోపణలకూ తాము లొంగబోమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.