Sandeep Reddy Vanga: షాహిద్ కపూర్ కెరీర్‌లో అతిపెద్ద సినిమాల్లో “కబీర్ సింగ్” ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 2019లో విడుదలైన ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటించింది. 2017లో వచ్చిన తెలుగు సూపర్ హిట్ “అర్జున్ రెడ్డి”కి హిందీ రీమేక్‌గా రూపొందిన ఈ సినిమా, సాక్‌నిల్‌క్ లెక్కల ప్రకారం బాక్సాఫీస్ వద్ద రూ.275 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం చాలా మందికి తెలియదు. కబీర్ సింగ్ పాత్రకు మొదటగా ఎంపికైన నటుడు షాహిద్ కపూర్ కాదు. అతడికి ముందు ఈ పాత్రను రణవీర్ సింగ్‌కు ఆఫర్ చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్వయంగా ఓ పాత ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం “ధురంధర్” విజయంతో మంచి ఫామ్‌లో ఉన్న రణవీర్ సింగ్, ఆ సమయంలో ఈ కథ తనకు “చాలా డార్క్‌గా ఉంది” అనిపించి సినిమాను తిరస్కరించారని డైరెక్టర్ వెల్లడించారు.
READ MORE: Team India: టీమిండియాకు కొత్త కెప్టెన్, కోచ్, సెలెక్టర్.. భారత క్రికెట్‌లో సంచలన మార్పులు?
ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. అర్జున్ రెడ్డి ఘనవిజయం తర్వాత హిందీలో రీమేక్ చేయాలని బాలీవుడ్ నుంచి తనకు వరుసగా ఫోన్లు వచ్చాయని తెలిపారు. అయితే అంతగా ప్రేక్షకులు చూసిన సినిమాను మళ్లీ తీయడం అంత ఈజీ కాదని అంగీకరించారు. “ముంబై నుంచి నిరంతరం కాల్స్ వస్తూనే ఉండేవి. మొదట ఈ సినిమాను రణవీర్ సింగ్‌కు చెప్పాం. ఆయనతోనే చేయాలని నా కోరిక. కానీ రణవీర్‌కు ఈ స్టోరీ చాలా డార్క్‌గా అనిపించిందని చెప్పి తిరస్కరిచాడు.” అని వంగా తెలిపారు.
రణవీర్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న తర్వాత ఈ సినిమా షాహిద్ కపూర్ దగ్గరకు వెళ్లింది. అయితే ఆ సమయంలో షాహిద్‌కు బలమైన సోలో బాక్సాఫీస్ రికార్డు లేదు. ఈ కారణంగా చాలా మంది షాహిద్ ఎంపికపై అనుమానం వ్యక్తం చేశారని దర్శకుడు గుర్తు చేసుకున్నారు. “రణవీర్ తర్వాత షాహిద్‌ను సంప్రదించాం. కానీ చాలామందికి నమ్మకం లేదు. అప్పటివరకు షాహిద్ సోలోగా రూ.100 కోట్ల సినిమాను చేయలేదు. షాహిద్ టాప్ కలెక్షన్స్ రూ.65 కోట్లు మాత్రమే. ‘ఇలాంటి వసూళ్లు తెలుగు సినిమాలకు సైతం వస్తాయి. ఈ నటుడితో ఎందుకు చేస్తున్నావు? రణవీర్ అయితే కలెక్షన్లు ఎక్కువగా ఉండేవి’ అని చాలా మంది నాతో అనేవారు. కానీ నాకు షాహిద్‌పై ఎప్పుడూ నమ్మకం ఉండేది. అతను అద్భుతమైన నటుడు” అని సందీప్ రెడ్డి వంగా అన్నారు. కానీ.. కాలక్రమేణా చరిత్రే దీనికి సమాధానం చెప్పింది. కబీర్ సింగ్ షాహిద్ కపూర్ కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమాగా కబీర్ దాస్ నిలిచింది.