Team India: భారత పురుషుల క్రికెట్ జట్టు 2026లోకి అడుగుపెడుతూ మిశ్రమ అనుభవాలతో ముందుకు కొనసాగుతోంది. ఒకవైపు 2025 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్‌ను గెలుచుకొని ఘన విజయాలు సాధించడంతో పాటు మరోవైపు స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై చరిత్రాత్మక పరాభవాన్ని చవిచూసింది. గత రెండేళ్లలో ఇది రెండోసారి స్వదేశంలో టెస్టుల్లో ఇలా జరగడం. అయితే, కొత్త సంవత్సరం ప్రారంభం నుంచే డ్రెస్సింగ్ రూమ్‌లో అసంతృప్తి, ఆఫ్-ఫీల్డ్ వివాదాలు జట్టును వెంటాడాయి. ఇవన్నీ కలిసి జట్టు నాయకత్వంపై తీవ్రమైన ఒత్తిడిని తీసుకొచ్చాయి. కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న వేళ జట్టులో కీలక మార్పులు జరగనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
పురుషుల జట్టు కెప్టెన్ మార్పు..
అయితే, యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ను ఈ ఏడాది వన్డే, టెస్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వయసు కూడా అతడికి అనుకూలంగా ఉండటంతో ఈ రెండు ఫార్మాట్లలో సుదీర్ఘకాలం కొనసాగనున్నట్లు కనిపిస్తోంది. కానీ, టీ20 ఫార్మాట్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ వయస్సు 35గా ఉంది. అలాగే, ఇటీవలి కాలంలో అతని బ్యాటింగ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2026 టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఫలితం ఎలా ఉన్నా సరే కొత్త కెప్టెన్ కోసం బీసీసీఐ ఆలోచించే అవకాశం ఉంది. 2028 ఒలింపిక్స్, టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని యువ నాయకత్వానికి జట్టు పగ్గాలు అప్పగించాలని భారత క్రికెట్ భావిస్తోంది. అప్పటికి సూర్య కుమార్ వయస్సు 37కి చేరుకుంటాడు. దీంతో గిల్ టీ20 వరల్డ్ కప్ జట్టులో లేకపోయినా, కెప్టెన్సీ రేసులో అతడి పేరు వినిపిస్తోంది. అలాగే, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, హార్థిక్ పాండ్యాలు కూడా జాబితాలో ఉన్నారు. సూర్య మాత్రం న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్‌లో పరుగులు సాధించాల్సిన పరిస్థితి నెలకొంది.
Read Also: Karimnagar: సబ్ రిజిస్టర్కు బెదిరింపులు.. డబ్బులు చల్లి ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని వార్నింగ్!
మహిళల జట్టుకు కొత్త కెప్టెన్..
ఇక, భారత మహిళల జట్టు మాత్రం 2026ను అత్యంత ఉత్సాహంతో ప్రారంభిస్తోంది. తొలిసారిగా వరల్డ్ కప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించిన ఉమెన్స్. ఆ విజయాన్ని కొనసాగించడమే లక్ష్యంగా పెట్టుకుని కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతోంది. అయితే, ముందున్న సవాళ్లను దృష్టిలో పెట్టుకుని జట్టు కూర్పుపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాగా, మహిళల టీ20 వరల్డ్ కప్ (జూన్ 2026) అనంతరం నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉంది. 2028 నాటికి హర్మన్‌ప్రీత్ కౌర్ వయస్సు 38కి వస్తుండటంతో, స్మృతి మంధానాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
కోచ్ వ్యవహారం
గౌతమ్ గంభీర్ భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైట్‌బాల్ క్రికెట్‌లో టీమిండియా అద్భుతంగా ఆడుతున్నప్పటికీ, టెస్టు క్రికెట్‌లో మాత్రం ఘోర ఓటములను చవిచూసింది. ఆయన హయాంలో స్వదేశంలో రెండు సార్లు వైట్‌వాష్ కావడం భారత క్రికెట్ కు మాయని మచ్చగా మిగిలింది. జూన్ వరకు భారత్‌కు టెస్టు మ్యాచ్‌లు లేకపోయినా, రెడ్ బాల్ క్రికెట్‌లో మార్పులు తప్పవన్న అభిప్రాయం బలపడుతోంది. ప్రత్యేక రెడ్‌బాల్ కోచ్ లేదా క్రికెట్ డైరెక్టర్ నియామకం జరిగే ఛాన్స్ ఉంది. 2014లో డంకన్ ఫ్లెచర్‌తో పాటు రవిశాస్త్రిని నియమించిన తరహాలో మరో ప్రయోగం జరగవచ్చని అంచనా. ఇటీవల టెస్టు కోచ్ కోసం వీవీఎస్ లక్ష్మణ్‌ను సంప్రదించారన్న వార్తలు వచ్చినప్పటికీ, అతడు తిరస్కరించినట్లు తెలుస్తుంది. అలాగే, మహిళల జట్టును వరల్డ్ కప్ విజేతగా నిలిపిన అమోల్ మజుందార్‌కు మాత్రం సేఫ్ గా ఉన్నారు. స్వచ్ఛందంగా తప్పుకుంటే తప్ప ఆయన పదవికి ముప్పు లేదని టాక్.
చీఫ్ సెలెక్టర్ మార్పు..
చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఒప్పందం ఈ ఏడాదితో ముగియనుంది. న్యూజిలాండ్ సిరీస్, టీ20 వరల్డ్ కప్ జట్టు ఎంపికలే అతడికి చివరి నిర్ణయాలయ్యే అవకాశం ఉంది. గతేడాది పొడిగింపు ఇచ్చినా, మరోసారి కొనసాగడం కష్టమేనని తెలుస్తుంది. దీంతో కొత్త చీఫ్ సెలెక్టర్ నియామకం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత కమిటీ సభ్యుల్లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ప్రగ్యాన్ ఓజా తదుపరి చీఫ్ సెలక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు, మహిళల సెలక్షన్ కమిటీలో ఇప్పటికే మార్పులు చేపట్టారు. నీతూ డేవిడ్ పదవీకాలం వరల్డ్ కప్ జట్టుతో ముగియగా, సెప్టెంబరులో అమితా శర్మను నియమించారు. ఆమె ఇటీవల శ్రీలంకతో జరిగే ఐదు టీ20ల సిరీస్‌కు తన తొలి జట్టును ప్రకటించింది. ఇక, 2026 భారత క్రికెట్‌కు మార్పుల సంవత్సరంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెప్టెన్, కోచ్, సెలెక్టర్ వంటి మూడు కీలక స్థాయిల్లోనూ నిర్ణయాత్మక మార్పులు జరగనుండటంతో భారత క్రికెట్ భవిష్యత్ పై అందరు దృష్టి పెట్టారు.