Andhrapradesh: బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందన్నారు.
Read Also: AP High Court: ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనపై ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వ్
అనంతరం వాయవ్య దిశగా కదిలి 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశముందని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తున్నాయని తెలిపారు. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చన్నారు. నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలకు అవకాశముందని స్పష్టం చేశారు.