Rahul Gandhi: జగ్గారెడ్డిని గెలిపిస్తున్నారా లేదా అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్లను అడిగారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో రాహుల్ ప్రసంగించారు. దొరల తెలంగాణకి, ప్రజల తెలంగాణ కి మధ్య పోరాటం ఇది అంటూ ఆయన అన్నారు. కేసీఆర్ ప్రజల భూములు లాక్కుంటున్నారని.. వందల కోట్లు దోచుకుంటున్నారని, కాళేశ్వరం పేరుతో ప్రజల సొమ్ము దోచుకున్నారని ఆయన ఆరోపించారు. నేను వెళ్లి కాళేశ్వరం చూశానన్న రాహుల్ గాంధీ.. ప్రాజెక్టు కుంగిపోయిందన్నారు. లక్ష కోట్ల ప్రజల సొమ్మును కేసీఆర్ దోచుకున్నారని రాహుల్ విమర్శలు గుప్పించారు. నిన్న యువకులతో మాట్లాడానన్న రాహుల్ గాంధీ.. లక్షల రూపాయలు కోచింగ్‌లకు పెడుతున్నారని, కానీ ఉద్యోగాలు మాత్రం రాలేదన్నారు. ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం ఇబ్బంది పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వాళ్ళ కోసం ఏం చేయలేదని, మీకు చెందిన వ్యక్తులు పేపర్ లీకు చేశారు.. అయినా మీరు పట్టించుకోలేదని మండిపడ్డారు. రైతులు, విద్యార్థుల నుంచి ప్రభుత్వం దోచుకున్న సొమ్ము వెనక్కి ఇస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్‌లోనే ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు రాహుల్ గాంధీ. గ్యాస్ సిలిండర్ ఇప్పుడు1200 అని.. కాంగ్రెస్ గెలవగానే రూ.500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇచ్చిన గ్యారంటీలు అన్ని మొదటి కేబినెట్‌లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
Also Read: CM KCR: ఈసారి గెలిచిన తర్వాత రేషన్ పై అందరికి సన్న బియ్యం పంపిణీ చేస్తాం..
బీజేపీ వాళ్ళు వచ్చి ఛాతీ చూపెట్టి తిరుగుతున్నారని, బీజేపీ వాళ్ళ గాలి తీసేశామన్నారు. కారు నాలుగు టైర్లలో గాలి పోయిందన్నారు. బీజేపీ, ఎంఐఎం, బీఆర్‌ఎస్ కలిసి పనిచేస్తున్నాయని ప్రజలు గమనించాలన్నారు. బీజేపీ నా ఎంపీ పదవి కూడా లేకుండా చేశారని.. ఇల్లు కూడా తీసుకున్నారన్నారు. తీసుకుంటే తీసుకోండి.. మీ ఇల్లు నాకు అక్కరలేదు అని చెప్పానని.. దేశంలో ప్రతి పేద ఇంట్లో నేను ఉన్నానన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఇద్దరి లక్ష్యం కాంగ్రెస్‌ని ఓడించడమేనని ఆయన చెప్పరారు. ఎంఐఎం కూడా కాంగ్రెస్ ఎక్కడైతే గెలుస్తుందో అక్కడ ఎంఐఎం పోటీ చేస్తుందన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గఢ్‌లో ఎంఐఎం పోటీ చేసిందన్నారు. మా ఓట్లు చీల్చడానికి ఎంఐఎం పోటీ చేసి బీజేపీకి లాభం చేస్తుందన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే పోటీ అంటూ రాహుల్ తెలిపారు. ఇక్కడ మేము బీఆర్‌ఎస్‌ను ఓడించబోతున్నాం..సందేహం అక్కరలేదన్నారు. మోడీని ఢిల్లీలో ఓడించపోతున్నామన్నారు. బీజేపీ పెంచిన ద్వేషం అనే సమాజంలో ప్రేమ అనే దుకాణాన్ని మేము తెరిచామన్నారు. జగ్గారెడ్డి కష్టపడి పని చేస్తారని.. జగ్గారెడ్డిని పెద్ద మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.