వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేద్దామనుకున్నా.. చంద్రబాబు నేడు వారిపై కల్లబొల్లి ప్రేమ వలకపోస్తున్నాడు అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు కుటీల వాగ్దానాలను ఎవరు నమ్మరు.. ప్రజల్లో తిరుగుబాటు రావడంతోనే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నాడు అని పేర్కొన్నారు. సేవ కోసం పని చేసే వాలంటీర్లు.. చంద్రబాబు గాలానికి పడరు.. బూటకపు మాటలు.. నయవంచనకు ప్రతిరూపం చంద్రబాబు అని ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజలకు గాలెం వెయ్యడం.. వారిని వాడుకొని వదిలేయడం అయిపోయింది.. ఇప్పుడు కొత్తగా వాలంటీర్లకు పది వేల జీతం పెంచుతామని కొత్త ఎర వేస్తున్నాడు.. వాలంటీర్ల ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ.. వారి వ్యక్తిత్వాన్ని హననం చేసిన చంద్రబాబు ఇప్పుడు నీతి వాక్యాలు చెబుతున్నాడన్నారు. మూడు పదులు నిండని వాలంటీర్లపై.. చంద్రబాబు అండ్ కో చాలా దారుణంగా మాట్లాడారు అని పేర్నినాని ఆరోపించారు.
Read Also: Dil Raju: రావిపూడితో వెంకీ మూడో సినిమా.. దిల్ మామ మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాడు!
ప్రభుత్వ సేవలను నేరుగా పేద, మధ్య తరగతి వర్గాలకు వాలంటీర్ల ద్వారా అందించడంతో.. సీఎం జగన్ ప్రభుత్వంపై ప్రజలందరికీ నమ్మకం ఏర్పడింది అని పేర్నినాని అన్నారు. నేడు ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో వాలంటీర్లను దుర్భాషలాడిన చంద్రబాబు.. వారిపై ఇప్పుడు కల్లబొల్లి ప్రేమ వొలకపోస్తున్నాడు.. ఒక వైపు ప్రజాస్వామ్య ముసుగులో చంద్రబాబు మాట్లాడుతున్నాడు.. మరో వైపు ఆయన తాబేదారు నిమ్మగడ్డ రమేష్ వాలంటీర్లపై ఫిర్యాదులు చేస్తాడు.. చంద్రబాబు, నిమ్మగడ్డ కుటిల రాజకీయాలతో వాలంటీర్ల సేవలు అందక లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని ఆయన చెప్పుకొచ్చారు. సేవా దృక్పథంతోనే విద్యావంతులు వాలంటీర్లుగా పని చేస్తున్నారు.. చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలు.. నమ్మే రోజులు ఎప్పుడో పోయాయని మాజీ మంత్రి పేర్నినాని వెల్లడించారు.