ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల జీతాల వ్యవహారం ఎట్నుంచి ఎటెటో తిరిగి ఎక్కడెక్కడికో పోతోందా? చివరికి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు తీసుకున్న శాలరీ దగ్గరికి వచ్చి ఆగబోతోందా? ఆల్రెడీ ఆ విషయంలో వైసీపీ లీడర్స్ కూపీ లాగుతున్నారా? జీతం విషయంలో బాబుకు, జగన్‌కు పోలికపెట్టి వైసీపీ కొత్త రాజకీయానికి తెరలేపబోతోందా? అసలీ జీతాల గోలేంటి? వెనకున్న రాజకీయం ఏంటి? 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే గెలిచిన వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే…40 శాతం ఓట్లు రావడాన్ని కోట్ చేస్తూ.. తమ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు జగన్. ఆ కారణంతోనే… సభకు హాజరవడం లేదు వైసీపీ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేలుగా ప్రమాణం, బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగానికి మాత్రమే హాజరైన వైసీపీ సభ్యులు ఆ తర్వాత దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీలో మాట్లాడిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొంత మంది వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వచ్చి హాజరుపట్టికలో సంతకాలు చేసి దొంగల్లా వెళ్లిపోతున్నారన్నారని అన్నారు. వై.బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, వేగం మత్స్యలింగం, బి.విరూపాక్షి, విశ్వేశ్వరరాజు, అమరనాథ్‌రెడ్డి, దాసరి సుధ ఆ లిస్ట్‌లో ఉన్నారని, వేరు వేరు తేదీల్లో వారు సంతకా లు చేసినట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పుకొచ్చారు స్పీకర్. దాంతో ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ సభకు రాకుండా సంతకాలు పెట్టడాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించాలని జనసేన సభ్యుడు కొణతాల సూచించారట. గవర్నర్ ప్రసంగానికి హాజరైతే… దాన్ని సభకు అటెండెన్స్‌గా పరిగణించబోమని, వైసీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు సభలోకి అడుగు పెట్టకుండానే వెలుపల రిజిష్టర్ లో సంతకాలు చేయడం కరెక్ట్ కాదన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. అయితే… టెక్నికల్ గా తాము సభకు వచ్చామని చెప్పుకోవడానికే వైసీపీ ఎమ్మెల్యేలు రిజిష్టర్‌లో సంతకాలు చేస్తూ నానా తంటాలు పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో తమ ప్రభుత్వ హయాంలో జగన్ వైఖరిని గుర్తు చేస్తున్నాయి వైసీపీ వర్గాలు. సీఎంగా ఉన్నప్పుడు జగన్ జీతం తీసుకోలేదు. ముఖ్యమంత్రికి నెలకు మూడున్నర లక్షల జీతంతో పాటు అనేక అలవెన్సులు ఉంటాయి. అయితే అయిదేళ్ళ కాలంలో జీతంగా నెలకు ఒక్క రూపాయి మాత్రమే జగన్ తీసుకున్నారని, ఇప్పుడు కూడా ఆయన తీసుకోవడం లేదని వైసీపీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కానీ… అధికార పక్షం వాదన మాత్రం మరోలా ఉంది. జగన్ తీసుకుంటున్నట్టు స్పీకర్ కూడా చెప్పలేదని, తీసుకుంటున్న మిగతా వాళ్ళ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ వ్యాఖ్యలపై ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మినహా మిగతా ఎవరూ స్పందించలేదు.
మేం అసెంబ్లీ సమావేశాలకు నేరుగా హాజరవబోమని చెప్పాంగానీ… ప్రజల సమస్యలపై ప్రశ్నంచబోమని ఎక్కడా చెప్పలేదుకదా? అందుకే తమ ప్రాంత సమస్యలపై అసెంబ్లీకి ప్రశ్నలు పంపిస్తున్నామంటూ లాజిక్ లాగుతున్నారాయన. తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకనే కూటమి నేతలు కొత్త డ్రామాను తెరమీదకు తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన సభ్యుల అకౌంట్ నంబర్లు తీసుకుని అడ్మినిస్ట్రేషన్ విభాగం ఆ ఖాతాల్లో జీతాలు జమ చేస్తుందని.. కొందరు ఎమ్మెల్యేలు అసలు ఆ జీతాలు డ్రా చేసే పరిస్దితి కూడా ఉండదన్నారు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు తమ ప్రశ్నలను అందచేసేందుకు రాజమార్గం లోనే లోపలకు వెళ్లి సంతకాలు చేశామే తప్ప దొంగల్లా వెళ్లలేదని అన్నారు తాటిపర్తి. మరోవైపు తమ అధినేత జగన్ తరహాలోనే పార్టీ ఎమ్మెల్యేలు కూడా జీతం తీసుకోకూడదని ఆలోచిస్తున్నట్టు సమాచారం. అలా చేసి కూటమి నేతలకు జీతాల విషయంలో గట్టిగా కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నారట. గతంలో చంద్రబాబు అసెంబ్లీకి రానప్పుడు ఆయన జీతం తీసుకున్నారా.. లేదా అని ఎంక్వైరీ చేసే పనిలో ఉన్నారట వైసీపీ ఎమ్మెల్యేలు. దానిపై అధికారిక సమాచారం కోసం ఆర్టీఐ ద్వారా కోరినట్టు తెలిసింది. ఆ సమాచారం గనుక తాము ఊహించినట్టు వస్తే… తామే జనం ముందు పెట్టి లెక్కలు చెప్పాలనుకుంటున్నారట. అసెంబ్లీకి హాజరవనప్పుడు చంద్రబాబు గనుక జీతం తీసుకుని ఉంటే…. అది రాజకీయంగా తమకే ప్లస్ అవుతుందని వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారట. ఈ వ్యవహారం ముందు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.