రెండు విడతలుగా పోటీకి దూరంగా ఉంటున్నా…, పార్టీ కోసమే ప్రచారం చేస్తున్నా….. ఆ సీనియర్ లీడర్‌ని టీడీపీ అధిష్టానం లైట్ తీసుకుంటోందా? ఆయన పార్టీలోకి వచ్చేటప్పుడు ఇచ్చిన హామీల్ని సైతం మర్చిపోయిందా? అందరికీ పదవులు ఇస్తున్నా… ఆయన్ని మాత్రం ఎందుకు పట్టించుకోలేదు? స్వయంగా చంద్రబాబు ఇచ్చిన హామీ ఎందుకు అమలవడం లేదు? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా ల్యాగింగ్ స్టోరీ? వంగవీటి రాధా…మాజీ ఎమ్మెల్యేగా కంటే దివంగత నాయకుడు వంగవీటి రంగా కుమారుడిగానే ఆయనకు ఎక్కువ గుర్తింపు ఉందన్నది పోలిటికల్ సర్కిల్స్‌లో వినిపించే మాట. 2004లో తొలిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన రాధాకు అదే ఫస్ట్ పోస్ట్. ఆ తర్వాత రెండు ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారాయన. ఇంకో రెండు ఎన్నికల్లో అసలు పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. 2019లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో రాధాకు సన్నిహితంగా ఉండే కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ ఆయన్ని వైసీపీలోకి తీసుకెళ్ళే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అదే సమయంలో రాధాకు వైసీపీ నుంచి ఎమ్మెల్సీ కూడా ఆఫర్ చేసిందన్న ప్రచారం గట్టిగానే జరిగింది. టీడీపీలో చేరిక సమయంలో, చేరిక తర్వాత కూడా అనేక విమర్శలు వచ్చినా రాధా అలాగే కొనసాగారు తప్ప వైసీపీలో చేరలేదు. దీంతో తెలుగుదేశం అధికారంలోకి వస్తే రాధాకు ఖచ్చితంగా సముచిత స్థానం దక్కుతుందని భావించిందట ఆయన వర్గం. కట్ చేస్తే… 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. 164 సీట్లతో తిరుగులేని మెజార్టీతో ఏపీలో విజయఢంకా మోగించింది. రాధాకు ఎమ్మెల్సీ ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించారు. అయితే…పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురికి ఎమ్మెల్సీ అవకాశం దక్కిందిగానీ… ఎక్కడా వంగవీటి ఊసే లేదు. తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఐదుగురికి అవకాశం కల్పించింది కూటమి.
అందులో మూడు టీడీపీ, జనసేన బీజేపీ చెరొకటి తీసుకున్నాయి. ఖచ్చితంగా కాపు కోటాలో రాధాకు అవకాశం దక్కుతుందని ఆయన వర్గం గట్టిగానే ఆశపడిందట. రాధా పేరు కూడా ఎమ్మెల్సీ ఆశావహుల జాబితాలో బాగా చక్కర్లు కొట్టింది. కానీ…ఈసారి కూడా రాధా వర్గీయులకు నిరాశే మిగిలింది. అయితే… ఎమ్మెల్సీగా అవకాశం రానిదానికంటే… సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాజీ ఎమ్మెల్యే వర్గాన్ని మరింత బాధ పెడుతున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీల ప్రకటన సమయంలోనే రాధాపై ఈ ప్రచారం ఎక్కువగా జరగటంతో ఆయన వర్గం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ వద్దని రాధానే స్వయంగా చెప్పారని ఒకవైపు, ఎమ్మెల్సీ మాత్రమే కాదు మంత్రి పదవి కూడా కావాలన్నారనిమరోవైపు, అసలాయన రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారని, కుటుంబ కలహాలే అందుకు కారణం అని ఇంకో వైపు… ఇలా ఎవరికి వారు తమకు నచ్చిన విధంగా… పోస్టింగ్స్ పెడుతుండటం ఇబ్బందిగా మారిందట. పదవుల పంపకం పూర్తయ్యాక ఎమ్మెల్సీ ఆశావహులు కొందర్ని టీడీపీ అధిష్టానం బుజ్జగించినా… రాధాతో ఎవరూ టచ్ లోకి రాలేదన్నది ఆయన వర్గం చెబుతున్న మాట. అసలు పదవి ఇవ్వకపోగా…. దానికి రాధానే కారణమంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగటంతో వంగవీటి వర్గం మాంఛి కాక మీద ఉందట. టీడీపీలో చేరవద్దని పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా ఆయన వెనకడుగు వేయలేదని, పార్టీలో కొనసాగుతూ రెండుసార్లు ప్రచారం చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నది రాధా వర్గం భావన. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం ప్రత్యర్థుల పనా లేక సొంత పార్టీకి చెందిన వారే చేస్తున్నారా అని ఆరా తీస్తున్నారట రాధా వర్గీయులు. బీజేపీ, జనసేన కాపు వర్గానికి ఎమ్మెల్సీలను కేటాయించగా… టీడీపీ రాధాను పక్కనపెట్టడం, ఆయన పార్టీ చేరిక సమయంలో వచ్చిన వారెవరూ దీనిపై స్పందించకపోవటంపై కూడా గుర్రుగా ఉందట వంగవీటి వర్గం. దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.