తెలుగుదేశం పార్టీని ఇప్పుడు పెన్షన్ టెన్షన్ వెంటాడుతోందా? వైసీపీ మైండ్‌గేమ్‌తో టీడీపీ నాయకులు కంగారు పడుతున్నారా? దానివల్ల సైకిల్ పార్టీకి ఎంత నష్టమో… వైసీపీకి కూడా అంతే ఎఫెక్ట్ అన్న వాదనలో నిజమెంత? అలా వాదిస్తున్నవారు చెప్పే రీజన్స్ ఏంటి? ఏతావాతా ఇప్పుడు పెన్షన్స్ చుట్టూ మొదలైన కొత్త రాజకీయం ఏ టర్న్ తీసుకునే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు సామాజిక భద్రత పెన్షన్ల అంశమే హాట్ టాపిక్ అయింది. పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉండమని ఈసీ ఆదేశించడమేకాకుండా… వాళ్ల దగ్గరున్న ట్యాబులు, సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకోమంది. దీనికి ఇప్పుడు ఫుల్ పొలిటికల్ కలర్ వచ్చేసి…అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. వాలంటీర్ల వ్యవహారాన్ని అడ్డం పెట్టుకుని ఎత్తుకు పైఎత్తు వేసుకుంటున్నాయి పార్టీలు. అయితే దీనిమీద టీడీపీ వర్గాల్లో ఆందోళన కన్పిస్తోందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఎపిసోడ్ అనవసరంగా ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందనే భయం ఆ పార్టీలో ఉందట. అసలే ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో పెన్షన్ కోసం బయటకొచ్చిన వృద్ధుల్లో ఎవరికైనా.. ఏమైనా అయితే.. దాన్ని ఆసరా చేసుకుని వైసీపీ నానా రచ్చ చేస్తుందన్న భయం తెలుగుదేశం వర్గాల్లో కనిపిస్తోందట. వాస్తవాలు ఎలా ఉన్నా.. ఇప్పటికే గీతాంజలి ఎపిసోడ్ ద్వారా టీడీపీని టార్గెట్ చేసుకున్న వైసీపీ.. ఇప్పుడు పెన్షన్ అంశాన్ని అడ్డం పెట్టుకుని.. రాజకీయం చేస్తే…. ఇబ్బందేనన్నది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అందుకే ఈ ఎపిసోడ్‌ను వీలైనంత టోన్ డౌన్ చేస్తేనే బెటరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది టీడీపీలో. వాస్తవానికి సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ వేసిన పిటిషన్‌కు, తమకు ఎలాంటి సంబంధం లేకున్నా.. దాన్ని తమకు అంటగట్టేలా వైసీపీ వ్యూహాత్మకంగా వెళ్తోందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి తెలుగుదేశం వర్గాలు.
ఈ క్రమంలో టీడీపీ కావచ్చు.. కూటమి పార్టీలకు కావచ్చు.. ఇప్పుడు పెన్షన్ టెన్షన్ అనసరంగా చుట్టుకుంటోందనే ఫీలింగ్ కలుగుతోంది. దీని ప్రభావం కేవలం పెన్షన్ లబ్దిదారులే కాకుండా.. ఇతర లబ్దిదారుల మీద కూడా పడుతుందన్న ఆందోళన పార్టీ వర్గాల్లో కన్పిస్తోందట. ఇదే సందర్భంలో టీడీపీ వర్గాల్లో మరో చర్చా జరుగుతోంది. వాలంటీర్లను వారి విధుల నుంచి దూరం చేయడం.. వారి వద్ద సెల్‌ఫోన్లు.. ట్యాబులు స్వాధీనం చేసుకోవడం వల్ల వైసీపీకి కళ్లు, ముక్కు, నోరు, చెవులుగా ఉన్న వ్యవస్థ ఆ పార్టీకి దూరం జరిగినట్టయిందని అంటున్నారు. వాలంటీర్లను వైసీపీ విపరీతంగా భుజాన వేసుకోవడం వల్ల ఆ పార్టీ కార్యకర్తలు, చిన్నా చితకా నాయకులు అసంతృప్తితో ఉన్నారని, ఇప్పుడు వలంటీర్లు అందుబాటులో లేక.. కేడర్ సరిగా పని చేయకుంటే.. అది టీడీపీకి కలిసి వచ్చే అంశమేకదా అన్నది కొందరి వాదన. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్ని గుర్తు చేసుకోవాలంటున్నాయట పార్టీ వర్గాలు. నాడు ఎన్నికలకు ముందు పడాల్సిన రైతు బంధు నిధులు ఈసీ ఆదేశాలతో ఆగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ వల్లే ఇదంతా జరిగిందని బీఆర్‌ఎస్ నేతలు కూడా ప్రస్తుతం వైసీపీ నేతల తరహాలో విపరీతమైన హడావుడి చేసి విమర్శలు గుప్పించారని, అయినా కాంగ్రెస్ పార్టీ గెలవలేదా..? అక్కడి రైతులు హస్తం గుర్తుకు ఓటేయలేదా..? అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ గెలుస్తుందనే వాతావరణం ఇప్పటికే వచ్చేసిందని.. ఇలాంటి ప్రచారం వల్ల వైసీపీ నేతలకు నోళ్లు నొప్పి పుట్టడమే తప్ప.. ఎలాంటి ప్రయోజనం ఉండదనే వాదన సైతం సైకిల్ పార్టీలో లేకపోలేదు. ఇదే సందర్భంలో మరో చర్చా జరుగుతోంది. ఇప్పుడు పెన్షన్ల పంపిణీ ఆలస్యం అయితే.. దానికి వైసీపీ కూడా కారణమవుతుందని ప్రజలకు తమ వైపు నుంచి వివరించే ప్రయత్నం కచ్చితంగా చేస్తామంటున్నాయి టీడీపీ వర్గాలు. సొమ్మును కాంట్రాక్టర్లకు చెల్లించేయడం ద్వారా పెన్షన్లు రాకుండా వైసీపీనే అడ్డుకుందనే ప్రచారాన్ని తాము ముమ్మరంగా చేపట్టేందుకు సిద్దంగా ఉన్నామంటున్నారు టీడీపీ లీడర్స్. ఇప్పటికే ఇదే విషయాన్ని చంద్రబాబు సహా చాలా మంది నేతలు ప్రస్తావించడాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే ఇంటింటికి పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రత్యామ్నాయాలు చూసుకోమని.. ప్రభుత్వోద్యోగుల ద్వారా మాత్రమే పెన్షన్లను పంపిణీ చేయాలని ఈసీ చెబితే.. దానికి విరుద్దంగా సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి గైడ్ లైన్స్ విడుదల చేయడాన్ని తప్పు పడుతున్నాయి టీడీపీ వర్గాలు. సజ్జల ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలనే సెర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి గైడ్‌లైన్స్ కింద సర్కులర్ జారీ చేశారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఈ తరహాలో వాదన చేసేవారు టీడీపీలో ఉన్నా.. ఈ పెన్షన్ల వ్యవహారం అంతిమంగా ఎటు దారి తీస్తుందో.. ఎవరి పీకల మీదకు తెస్తుందోననే ఆందోళనైతే మెజార్టీ నేతల్లో లేకపోలేదు. దీంతో ఇప్పుడు ఏపీలో పెన్షన్ పాలిటిక్స్ సమ్మర్ హీట్‌తో పోటీ పడుతున్నాయి.