ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గెలుపు విషయమై నాగబాబు కావాలనే అలాంటి వ్యాఖ్యలు చేశారా? పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను కించపరిచే ఉద్దేశ్యం ఉందన్న ప్రచారంలో నిజమెంత? అసలా కామెంట్స్‌ని వర్మ ఎలా తీసుకుంటున్నారు? తెలుగు తమ్ముళ్ళు ఏమంటున్నారు? ఈ రచ్చ ఇక్కడితో ఆగుతుందా? లేక కథలో ఊహించని మలుపులు ఉండబోతున్నాయా? లెట్స్ వాచ్. జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. ఆయన ఆ మాటల్ని కావాలనే అన్నారా? లేక కాకతాళీయంగా అన్నారా అనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో కాకతాళీయం కాకపోవచ్చని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేరే ఉండవచ్చన్న అభిప్రాయాలే పెరుగుతున్నాయి రాజకీయ వర్గాల్లో. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇంత మెజారిటీతో గెలవడానికి రెండే ఫ్యాక్టర్స్ ఉన్నాయని, ఒకటి పవన్ కళ్యాణ్ అయితే.. రెండు పిఠాపురం ప్రజలు, జనసైనికులు అంటూ కుండ బద్దలు కొట్టారు నాగబాబు. ఈ రెండూ కాకుండా ఇంకా ఎవరో ఉన్నారని అనుకుంటే అది వారి ఖర్మ అని అన్నారాయన. ఈ వ్యాఖ్యల చుట్టూనే ఇప్పుడు రాజకీయ రాద్ధాంతం మొదలైంది. నాగబాబు పరోక్షంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను ఉద్దేశించే ఆ మాటలు అన్నారంటూ ఫైరైపోతున్నారు తమ్ముళ్ళు. అసలు పిఠాపురంలో ఇంత మంది పని చేయాల్సిన అవసరం లేదని, మా సంతృప్తి కోసం మాత్రమే ఉన్నామన్న మరో స్టేట్‌మెంట్‌తో మండిపోతున్నారట టీడీపీ కార్యకర్తలు. ఇప్పుడీ వ్యవహారంపై పిఠాపురంలో మిత్రపక్షాల మధ్య నానా రచ్చ జరుగుతోందని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి 70వేల 279 ఓట్ల మెజారిటీతో గెలిచారు పవన్‌కళ్యాణ్. ఇప్పటిదాకా పిఠాపురంలో ఇంత మెజార్టీ ఎవరికీ రాలేదు. అంతా కలిసి చేస్తేనే అంత మెజార్టీ వచ్చిందని, కేవలం జనసేన నాయకులు, అభిమానులు మాత్రమే పని చేసి, ఓట్లేసి ఉంటే అలా జరిగేదా అంటూ నిలదీస్తున్నారట లోకల్ టీడీపీ లీడర్స్. ఎన్నికల ప్రచారంలో వర్మను ఉద్దేశించి స్వయంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్‌ని బయటికి తీసి వైరల్ చేస్తున్నారట. తన గెలుపు వర్మ బాధ్యత అని, ఆయన చేతులలో పిఠాపురం బాధ్యతలు పెడుతున్నానని పవన్ ఓపెన్‌గా అన్న మాటల్ని గుర్తు చేస్తూ… ఓడ దిగాక వర్మ బోడి మల్లయ్య అయ్యాడా అని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.
పవన్ అప్పుడు అలా ఎందుకు మాట్లాడారు? ఇప్పుడు ఆయన అన్న ఇలా ఎందుకు అంటున్నారంటూ నియోజకవర్గంలో చర్చ పెడుతున్నారట టీడీపీ లీడర్స్. సోషల్ మీడియాలో అయితే…. ఓడ మల్లన్న, బోడి మల్లన్న సామెత తెగ తిరిగేస్తోందట. అసలు సంబంధం లేకుండా నాగబాబు అలా ఎందుకు మాట్లాడారు? ఆవిర్భావ దినోత్సవంలో అనవసరంగా టంగ్ స్లిప్ అయ్యారా,లేక దాని ఉద్దేశ్యం వేరే ఉందా అంటూ వాళ్ళలో వాళ్లే ప్రశ్నించుకుంటున్నారట. పిఠాపురం టిడిపి కోఆర్డినేటర్ గా ఉన్న వర్మ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ…నియోజకవర్గంలో మారిన పరిణామాలతో టిడిపి అధిష్టానం ఆయన్ని హోల్డ్ లో పెట్టింది. అసలు ఎన్నికల తర్వాత పిఠాపురం జనసేనకు, వర్మకి మధ్య చాలా గ్యాప్ వచ్చిందని చెప్పుకుంటున్నారు. రెండు పక్షాలు కనీసం కలిసి వేదిక కూడా పంచుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఒక్క పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు తప్ప… మిగతా ఏ సమయంలోనూ రెండు పార్టీల నాయకులు కలిసి కనిపించడం లేదు. అటు ఎమ్మెల్సీ నామినేషన్ అఫిడవిట్‌లో తనను పిఠాపురం వాసిగా చెబుతూ…ఇక్కడి పవన్‌కళ్యాణ్ ఇంటి అడ్రస్‌నే ఇచ్చారు నాగబాబు. ఈ క్రమంలో జనసేన అభ్యంతరాలవల్లే తనకు ఎమ్మెల్సీ రాలేదని భావిస్తున్నారట వర్మ. అవసరమైనప్పుడు వాడుకుని వదిలేశారని, ఇప్పుడు ఎన్నైనా మాట్లాడతారంటూ సన్నిహితుల దగ్గర మాజీ ఎమ్మెల్యే వాపోతున్నట్టు సమాచారం. ఇవే మాటలు ఎన్నికల సమయంలో మాట్లాడి ఉంటే సరిపోయేది కదా అని ఆయన అంటున్నట్టు తెలిసింది. అటు పిఠాపురం టీడీపీ కార్యకర్తలు నాగబాబు చేసిన కామెంట్స్‌తో గుర్రుగా ఉన్నారట. అసలు జనసేన స్టాండ్ ఏంటన్నది వాళ్ళ క్వశ్చన్. వర్మ లేకుండా ఆరోజు ఈ స్థాయి విజయం అంత ఈజీనా అని కౌంటర్ ఇస్తున్నారట.. మరోవైపు జనసేన కార్యకర్తలు కూడా పార్టీ నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో ఓపెన్ అయిపోతున్నారట. పవన్ వల్లనే పిఠాపురంలో గెలిచామని క్లారిటీ ఇస్తున్నట్టు సమాచారం. అందరిలాగే వర్మ కూడా ప్రచారం చేశారని, ఆయన వల్లే గెలిచామంటే ఒప్పుకోబోమని రీ సౌండ్ వచ్చేలా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఇలా…మొత్తంగా…. పిఠాపురం కూటమిలో ఇప్పటికే ఉన్న కోల్డ్‌వార్ ఇప్పుడిక ఓపెనైపోయిందన్న అభిప్రాయం పెరుగుతోంది. నాగబాబు చేసిన కామెంట్స్‌లో రాజకీయ రచ్చ రంబోలా అవుతోంది. ఓపెన్ గా స్పందించడానికి నిరాకరిస్తున్న వర్మ… ఇలాంటివి ఎన్నికల ముందే చెప్పొచ్చు కదా అని కౌంటరేస్తుండటంతో…. కథ ఇక్కడితో అయిపోలేదని, మరిన్ని ట్విస్ట్‌లు ఉంటాయని అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్.