తమలో ఒకరికి మంత్రి పదవి కావాలంటూ ఆ నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారా? పార్టీ పెద్దలకు ప్రేమలేఖ రాయబోతున్నారా? ముందంతా అభిప్రాయాలు పంచేసుకుని… తమలో తామే మాట్లాడేసుకున్న ఎమ్మెల్యేలు తీరా లేఖ మీద సంతకం చేయాల్సి వచ్చేసరికి వెనక్కి తగ్గుతున్నారా? ఇంతకీ వాళ్ళకి పదవి కావాల్నా? వద్దా? ఎవరా నలుగురు? ఏంటా కథ? తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు టైం దగ్గరపడుతున్న కొద్దీ….ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని జిల్లాలో అయితే… రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కతాటిపైకి వచ్చారట. జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేనందున… ఈసారి కచ్చితంగా మాకు ఛాన్స్ ఇవ్వాల్సందేనని కోరుతున్నట్టు సమాచారం. ఇన్నాళ్ళు విడివిడిగా… ఒక్క ఛాన్స్ అంటూ ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోగా… వర్కౌట్ అవకపోవడంతో… ఇప్పుడు అంతా కలిసికట్టుగా బృందగానం ఆలపిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. తమలో ఎవరో ఒకరికి అవకాశం కల్పించమని కోరుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని మొత్తం 14 స్థానాలకుగాను…. నాలుగు చోట్ల మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యేగా గడ్డం ప్రసాద్‌కుమార్, పరిగిలో టి.రామ్మోహన్‌రెడ్డి, తాండూరు నుంచి మనోహర్‌రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచారు. అయితే… ప్రసాద్‌కుమార్‌కు స్పీకర్ ఛాన్స్ దక్కింది. కానీ… కీలకమైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేకపోవడం కొన్ని దశాబ్దాల్లో ఇదే తొలిసారి అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతోంది. అందుకే తమలో ఒకరికి అవకాశం ఇవ్వాలని ఆ నలుగురు కలిసి కోరుతున్నారట. ఆమేరకు అధిష్టానానికి లేఖ ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో తమ జిల్లాకు బెర్త్ కోరుతూ…. లేఖను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సిద్ధం చేశారట. మొత్తం తెలంగాణ జనాభాలో… ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే 42 శాతంఉందని, అందుకే మంత్రి పదవి ఇచ్చి ఇక్కడి ప్రజలకు న్యాయం చేయాలన్నది ఆ నలుగురి విన్నపం. పైగా త్వరలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాబోతున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని పలుసార్లు ప్రస్తావించారు మల్ రెడ్డి రంగారెడ్డి. మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న రామ్మోహన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి తమ అభిప్రాయాన్ని బహిరంగంగానే వెల్లడించారు.
అన్ని జిల్లాల మాదిరిగానే మంత్రివర్గంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు స్థానం కల్పించాలన్నది వాళ్ల డిమాండ్. అయితే ఇక్కడే ఓ చిక్కు ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే తెలంగాణ మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి మెజార్టీ ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు రంగారెడ్డిలో కాంగ్రెస్ గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు రెడ్లే. మరొకరు ఎస్సీ కాగా… ఆయనకు స్పీకర్ పదవి దక్కింది. అయితే.. అన్నిటికీ మించి ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉందట. కాంగ్రెస్ బీ ఫామ్ మీద గెలిచిన నలుగురిలో ఇప్పటిదాకా లేఖ మీద ఒక్కరే సంతకం చేశారని, మిగతా వాళ్ళ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాకు మంత్రి పదవి కావాలని అందరికీ ఉన్నా… అధిష్టానానికి పంపాల్సిన లేఖ మీద సంతకం పెట్టడానికి మిగతా ముగ్గురు వెనకాడుతున్నట్టు తెలిసింది. తాము సంతకాలు చేస్తే… తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయోనని భయపడుతున్నట్టు సమాచారం. సహజంగానే ఇలాంటి వాటికి స్పీకర్ దూరంగా ఉండవచ్చు. ఆయన్ని వదిలేసినా… మిగతా అందరి సంతకాలు తీసుకుని… ఢిల్లీ వెళ్లి రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను కలవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఆదివారం నాడు ఎమ్మెల్యేలు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతను కలిసి మద్దతు కోరారని, ఆయన సూచన మేరకే హస్తిన బాట పట్టాలనుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మంత్రి పదవి ఇవ్వకున్నా… ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు స్పీకర్, ప్రభుత్వ చీఫ్ పోస్ట్ ఇచ్చారని, జిల్లా నాయకులు ఆవిషయాన్ని మర్పిపోకూడదని అంటున్నారు కొందరు కాంగ్రెస్ నాయకులు. అన్ని సమీకరణల మధ్య విస్తరణలో జిల్లాకు పదవి దక్కుతుందో లేదో చూడాలి మరి.