ఆ ఎమ్మెల్యే పేరుకే తప్ప… పరపతి లేకుండా పోయారా? ఆయన సిఫారసులను కనీసం పట్టించుకునే వాళ్లు లేకుండా పోయారా? నేను లోకల్ అంటున్నా… పోవయ్యా… పోపో… అంటున్నారా? అదే స్థానంలో అంతకు ముందున్న ఎమ్మెల్యే చక్రం తిప్పగా… ఇప్పుడు ఈయనేమో… చక్రం కాదు కదా… కనీసం చెయ్యి కూడా తిప్పలేక గోవిందా… నువ్వే దిక్కు అంటున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటాయన బాధ? ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి శ్రీవారి ఆలయం, టీటీడీ పరిపాలనా భవనం రెండూ…తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే ఉంటాయి.దాంతో సహజంగానే… టీటీడీలో తిరుపతి ఎమ్మెల్యేకి ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఉంటాయి. అందుకు తగ్గట్టే… వైసీపీ హయాంలో…తిరుపతి ఎమ్మెల్యేగా వున్న కరుణాకర్ రెడ్డిని రెండు విడతలు టిటిడి పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. ఆ తర్వాత మూడో విడతలో ఆయనే ఛైర్మన్ అయ్యారు. దాంతో ఆ ఐదేళ్ళ కాలంలో… టిటిడిలో తిరుపతి ఎమ్మెల్యేగా కరుణాకర్ రెడ్డి చెప్పిందే వేదంలా నడిచిందని అంటారు.ఉద్యోగుల సమస్యలైనా,స్థానికుల ఇబ్బందులైనా, స్వామివారి దర్శనానికి సిఫార్సు లేఖలు కావాలన్నా…కరుణాకర్ రెడ్డి చెబితే చాలనుకునేలా ఉండేదట పరిస్థితి. కరుణాకర్‌రెడ్డి హవా నడిచే టైంలో.. ప్రాధ్యాన్యత కలిగిన పోస్టుల్లో ఆయనకు కావాల్సినవారే ఉండేవారని, చెప్పుకుంటారు. ఇక దేవస్థానం ఉద్యోగులు దీర్ఘకాలిక సమస్య అయిన ఇంటి స్థలాల కేటాయింపు, స్థానికులకు సంబంధించిన కొన్ని సమస్యలనుక మోక్షం లభించిందన్నది అప్పట్లో లోకల్ టాక్. ఇక సిఫారసు లేఖలపై దర్శనాల గురించి అయితే చెప్పేపనేలేదంటారు. వారికంటూ ప్రత్యేక కోటా వుండేదట.ఇలా అన్ని రకాలుగా టీటీడీలో స్థానిక ఎమ్మెల్యేకి పట్టు వుండేది. కానీ… రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక ఎమ్మెల్యే పరిస్థితి తారుమారైందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో.. కూటమి తరపున జనసేన నుంచి పోటీ చేసి గెలిచారు ఆరణి శ్రీనివాసులు. తిరుపతి నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీ వచ్చింది ఆయనకు. ఒక్క తిరుపతే కాదు, 2024 ఎన్నికల్లో రాయలసీమ మొత్తం మీద వచ్చిన అత్యధిక మెజార్టీ ఆరణిది. 63వేల మెజార్టీతో అందరికంటే ఘనంగా విజయం సాధించినా… ఇప్పుడాయనకు టీటీడీలో పరపతి లేకుండా పోతోందన్న చర్చ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, జనసేన కీలక భాగస్వామి, పైగా మంచి మెజార్టీతో ఆరణి శ్రీనివాసులు విజయం సాధించారు గనుక… లోకల్ ఎమ్మెల్యేగా ఆయనకు టీటీడీలో ప్రాధాన్యం ఉంటుందని భావించారట అంతా. కానీ… తీరా సీన్ రివర్స్‌లో ఉండటంతో…. ఇదేంటని జనసేన నేతలే అవాక్కవుతున్నారట.
ముఖ్యంగా తిరుపతి నియోజకవర్గ ప్రజలకు టీటీడీతో అనుసంధానం, అనుబంధం ఎక్కువగా ఉంటాయి. ఇక్కడి కొన్ని సమస్యల పరిష్కారానికి టీటీడీ సహకారం కూడా అవసరం. కానీ… అధికార కూటమి ఎమ్మెల్యే ఉన్నా… పనులు జరగడం లేదని, పరిష్కారాలు దొరకడం లేదన్న అసంతృప్తి పెరుగుతోందట స్థానికంగా. చిన్నపాటి సమస్యలను కూడా ఎమ్మెల్యే పరిష్కరించే పరిస్థితి లేకుండా పోతోందంటూ గగ్గోలు పెడుతున్నారట తిరుపతి వాసులు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నియమించిన దేవస్థానం పాలక మండలిలో తిరుపతి ఎమ్మెల్యేకి స్థానం దక్కలేదు. దీంతో… పరిపాలనా వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకునే అవకాశం లేకుండా పోయింది. స్థానికుల సమస్యలైనా, ఉద్యోగుల ఇబ్బందులైనా ఎమ్మెల్యే ద్వారా టిటిడి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు. పైగా ఎవరన్నా బదిలీ కోసం ఆయనతో చెప్పించుకుంటే…. ట్రాన్స్‌ఫర్ సంగతి తర్వాత ముందు ఉన్న స్థానం కూడా ఊడే పరిస్థితి వచ్చిందన్న చర్చ జరుగుతోందట టీటీడీ ఎంప్లాయిస్‌లో. ఇక తిరుమల స్థానికులైతే.. తమ సమస్యలను ఎమ్మెల్యేకి చెప్పడమే మానేస్తున్నట్టు తెలుస్తోంది. అదంతా ఒక ఎత్తయితే…. కనీసం శ్రీవారి దర్శనాలకు సిఫారసు లేఖల కోటా కూడా తగ్గిపోయిందట. స్థానిక ఎమ్మెల్యేకి గతంలో ఇచ్చిన కోటాతో పోలిస్తే…
ఇప్పుడు బాగా తగ్గిపోయిందని చెప్పుకుంటున్నారు. దర్శనాల కోసం ఒక వైపు జనసేన పార్టీ రాష్ర్ట నేతలు, మరో వైపు స్థానికుల ఆబ్లిగేషన్స్‌కి సరిపడినంత కాదు కదా… అందులో సగం కూడా ఎమ్మెల్యేకి దక్కడం లేదట. ఇలా… తన సొంత నియోజకవర్గంలో ఉన్న టీటీడీలో పరపతి లేకుండా… ఎమ్మెల్యే ఆరణికి ఏం చేయాలో అర్ధంగాక దిక్కులు చూస్తున్నారట. ప్రత్యేకంగా ఏం అవసరం లేదు… లోకల్ ఎమ్మెల్యేకి ఉండాల్సిన ప్రివిలేజెస్ కూడా లేకుండా ఎలాగన్న ఆరణి రోదనను ఎవరు వింటారో చూడాలి మరి.