Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… ప్రజావాణి పేరుతో ప్రజల సమస్యలపై దరఖాస్తులను స్వీకరించింది. పీసీసీ చీఫ్‌గా మహేష్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా ఇదే అనవాయితీ కొనసాగింది. గాంధీభవన్‌లో వారానికి రెండు రోజులు మంత్రులు వచ్చి…ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించాలని నిర్ణయించారు. 2024 సెప్టెంబర్ 27 నుంచి గాంధీభవన్‌లో ప్రజావాణి పేరుతో ఫిర్యాదులను స్వీకరించారు. మొదట ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ్మతో ప్రారంభమైంది. గాంధీభవన్‌కు భారీ ఎత్తున వచ్చిన ప్రజలు…తమ సమస్యలను చెప్పుకున్నారు. దామోదర్ రాజనర్సింహ.. ఉత్తంకుమార్ రెడ్డి..కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇలాంటి మంత్రులు వెంటనే సమస్యలను పరిష్కారమయ్యే దిశగా ఆదేశాలు జారీ చేస్తూ వచ్చారు. దీంతో ప్రజలకి గాంధీభవన్‌లో ప్రజావాణిపై కొంత నమ్మకం పెరిగింది. కానీ గడిచిన నెల రోజులుగా ప్రజావాణి ఉసే ఎత్తడం లేదు.
ప్రజావాణి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 3 వేలకు పైచిలుకు ప్రజలు గాంధీభవన్‌కి వచ్చారు. తమ సమస్యలను మంత్రులకు చెప్పుకున్నారు. కానీ డిసెంబర్ 5 నుంచి ఇప్పటి వరకు ప్రజావాణి నిర్వహించలేదు. మంత్రులు కూడా ఇటువైపు రావడం లేదు. కానీ ప్రజలు రోజు గాంధీ భవన్‌కి వచ్చి సమస్యలు చెప్పుకునేందుకు క్యూకడుతున్నారు. ప్రజావాణి కొనసాగుతుందా..? లేదలంటే ఎత్తేశారా..? అనేది కూడా ఎవరికి చెప్పడం లేదు. పిసిసి నుంచి మంత్రుల మధ్య ప్రజావాణి పై సమన్వయం లేదా ..? అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. గాంధీభవన్‌కి గంటన్నర సమయం కూడా కేటాయించలేనంత బిజీగా మంత్రులు ఉన్నారా..? అని విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రజలకు చేరువవ్వటంతో పాటు పార్టీ నేతలకు ఉన్న సమస్యలను చర్చించుకునేందుకు ప్రజావాణి కొంత వెసులుబాటుగా ఉండేది. కానీ డిసెంబర్ 5 2024 నుంచి ఇప్పటి వరకు ప్రజావాణి నిర్వహించలేదు. ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి గాంధీభవన్‌కి…ఫిర్యాదులతో వచ్చే వారికి నిరాశ ఎదురవుతుంది.
ప్రభుత్వం అన్నాక మంత్రులు కొంత బిజీగా ఉండడం సహజమే. కానీ వారానికి ఇద్దరు మంత్రులు గంటన్నర సమయం గాంధీభవన్‌కి కేటాయించలేక పోతున్నారంటే ఎక్కడో సమన్వయ లోపం ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. అందరిని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌కి వచ్చి సమస్యలు చెప్పుకోండి అన్న పార్టీ…ఇప్పుడు జనం వస్తున్నా మంత్రులను మాత్రం రప్పించలేకపోతుందనే చర్చ నడుస్తోంది. ఇప్పటికైనా గాంధీభవన్‌లో ప్రజావాణి ప్రారంభిస్తారా ? ఇలాగే టైం పాస్ చేస్తారా..? అనేది చూడాలి. ప్రజావాణి నిర్వహిస్తే నిర్వహిస్తున్నామని…లేదంటే ప్రజావాణి లేదని ప్రకటన విడుదల చేయకపోవడంతో సమస్యలతో జనం గాంధీభవన్ క్యూబెడుతున్నారు. తీరా ప్రజావాణి లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుతిరిగిపోతున్నారు. ప్రజావాణి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పీసీసీ చీఫ్ క్లారిటీ ఇవ్వాలని ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.