Off The Record: ఏపీ రాజకీయాల్లో తాజా కలవరం కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు. ఎన్డీఏలోకి టీడీపీ చేరికతో ఏపీ ప్రతిపక్షాలు మరింత బలపడతాయనుకుంటే.. ప్రస్తుతం సీన్ రివర్స్‌లో కనిపిస్తోందట. పరిణామాలు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఢిల్లీలో అమిత్ షాతో భేటీ తర్వాత టీడీపీ-జనసేన కేడర్‌లో కన్పించిన జోష్… ఇప్పుడు లేదంటున్నారు. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల ముఖ్యులతో సుదీర్ఘంగా జరిగిన భేటీలో… జనసేనకు మరింత కోత పడింది.. కేవలం 21 అసెంబ్లీ సీట్లకే పరిమితం కావాల్సి వచ్చింది గ్లాస్ పార్టీ. ఇదే ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్. ఇది ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పే వ్యవహారం అవుతుందా అన్న చర్చ సైతం జరుగుతోంది. టీడీపీతో పొత్తు మాటలు మొదలైనప్పుడు జనసేన వర్గాల అంచనా….35 నుంచి 40 సీట్లు. ఇటు పవన్ అభిమానులు కానీ.. అటుకాపు సామాజిక వర్గం కానీ ఇదే తరహా ఆలోచనతో ఉన్నాయి. ఏ మాత్రం తగ్గొద్దన్న సూచనలు, సలహాలు కూడా వచ్చాయి పవన్‌కు.
కానీ… బలమున్న చోటే సీట్లు తీసుకోవాలని, స్ట్రైకింగ్ రేట్ 95 శాతం ఉండాలని కేడర్‌కు నచ్చజెప్పుకుంటూ వచ్చిన పవన్…. 24 స్థానాలకు పరిమితం అయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజుల పాటు.. ఈ సీట్ల వ్యవహారంలో కొంత గందరగోళం నెలకొన్నా.. తాడేపల్లిగూడెం సభ తర్వాత కాపు యువత.. కాపు మహిళల్లో కొంత అర్థం చేసుకున్న పరిస్థితి కన్పించింది. అప్పటికే పవన్ నిర్ణయాన్ని తప్పు పడుతూ కాపు పెద్దలుగా ముద్రపడ్డ ముద్రగడ, హరిరామజోగయ్య వంటివారు లేఖాస్త్రాలు సంధించారు. జనసేనకు, పవన్ కళ్యాణుకు దూరం జరుగుతూ వచ్చారు. మరో వైపు వైసీపీ కూడా… ఆ నంబర్‌ను, పవన్ చర్యలను.. టార్గెట్ చేసుకుంటూ జనసేనను డిఫెన్స్‌లోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ… తాడేపల్లి గూడెం బహిరంగ సభలో పవన్ ఆవేశపూరిత ప్రసంగంతో కాపు యువతను.. కాపు మహిళలను ఆకట్టుకున్నారనే చర్చ జరిగింది. క్రమంగా పరిస్థితిని అంతా అర్ధం చేసుకుంటున్నారు, అంతా సెట్ అవుతోందనుకుంటున్న టైంలో జనసేన కేడర్, పవన్ అభిమానులకు శరాఘాతం లాంటి నిర్ణయం వచ్చింది. ఫైనల్‌గా జరిగిన చర్చలు, సర్దుబాట్లలో మరో మూడు సీట్లను బీజేపీ కోసం త్యాగం చేసింది జనసేన. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయవర్గాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. అసలే పుండు ఉందంటే.. దాని మీద కారం పూసినట్టుగా ప్రస్తుత పరిణామాలు మారిపోయాయన్న భావన వ్యక్తమవుతోందట.
త్యాగాల మీద త్యాగాలు చేసుకుంటూ… జనసేన ఇలా సీట్లు వదిలేసుకుంటూ పోవడం ఎందుకు? ఎవరి కోసం అన్న ప్రశ్నలు వస్తున్నాయి. 15 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ 0.5 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చి కాంప్రమైజ్ అవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలన్న చర్చ జరుగుతోందట. ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు, పవన్ అభిమానులు ఓ ప్రశ్నను సంధిస్తున్నారట. బలంలేని పార్టీకి సీట్ల కోసం బలం ఉన్న జనసేన కాంప్రమైజ్ అయిపోయి కోరుకున్న సీట్లు ఇచ్చేస్తున్నప్పుడు అసలు కూటమి అభ్యర్థులకు ఎందుకు ఓటేయాలనే చర్చకు తెర లేచిందంటున్నారు. 24 సీట్లు అంటే కష్టమైనా.. పవన్ అంటే ఇష్టం కాబట్టి.. సర్దుకుపోయామని.. కానీ అదే పనిగా కోత విధించుకుంటూ వెళ్తే అది అవమానం కాదా?… ప్రత్యేకించి పార్టీని నమ్ముకున్న, పవన్‌ను అభిమానిస్తున్నవారిని అవమానించడం కాదా అనే చర్చ జరుగుతోందట ఆ వర్గాల్లో. ఇలాంటి కాంప్రమైజ్‌ల వల్ల ఓట్ షేరింగ్ సరిగా జరగదన్న అనుమానం పెరుగుతోందంటున్నారు. కూటమి పార్టీల్లో కూడా ఇదే భయం ఉన్నట్టు తెలిసింది. త్యాగరాజు పవన్ కళ్యాణ్ ప్రతిసారి రాజీ పడుతుండడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయనే చర్చ జరుగుతోంది. మరి ఈ పరిణామాలు చివరికి ఎటు దారితీస్తాయో చూడాలి.