10 వేలు ఎక్కువైనా పర్వాలేదు.. అందరికీ మంచి సహాయం అందాలి: సీఎం జగన్
ఏపీలోని తుపాను ప్రభావిత పరిస్థితులపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులంతా తమ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. బాధితుల స్థానంలో తాము ఉంటే ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో ఆ తరహా సహాయం అందించాలని, రూ. 10లు ఎక్కువైనా పర్వాలేదు.. అందరికీ మంచి సహాయం అందాలని సీఎం పేర్కొన్నారు. ‘ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుపాను వల్ల భారీ వర్షాలు పడ్డాయి. అధికారులంతా మీమీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించండి. బాధితుల స్థానంలో మనం ఉంటే.. ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో ఆ తరహా సహాయం వారికి అందించాలి. రూ. 10లు ఎక్కువైనా పర్వాలేదు.. వారికి మంచి సహాయం అందాలి. ఇంత కష్టంలో కూడా బాగా చూసుకున్నారనే మాట రావాలి. పరిహారం అందించడం పట్ల సానుభూతితో ఉండండి. దెబ్బతిన్న ఇళ్ల విషయంలో, క్యాంపుల నుంచి ప్రజలను తిరిగి వెళ్తున్న సందర్బంలో వారికి ఇవ్వాల్సిన సహాయం అందించాలి’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
వార్డు మెంబర్‌గా కూడా గెలవని లోకేష్.. రెడ్ బుక్ రాస్తున్నాడంట!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సెటైర్లు వేశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవని లోకేష్.. రెడ్ బుక్ రాస్తున్నాడంట అని ఎద్దేవా చేశారు. తాను 200 ఎకరాలు భూమిని కబ్జా చేశానని లోకేష్ అంటున్నాడని, ఎక్కడ ఉందో చెప్పి నిరూపించాలని సవాల్ విసిరారు. తనపై లేనిపోని విమర్శలు చేస్తే వంశమే ఉండదని నారాయణ స్వామి అన్నారు. తిరుపతిలో ‘మిచాంగ్’ తుపాను పరిస్థితులను నేడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పరిశీలించారు. ‘నేను కాంగ్రెస్ వాదిని. ఇప్పటికీ దళితులు కాంగ్రెస్ పార్టీతోనే జీవనం సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కులాలను, మతాలను కేసీఆర్ రెచ్చగొట్టారు. అందులకే హైదరాబాద్ సిటీలో ఒక్క సీటు కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. తెలంగాణలో బీజేపీతో కలుస్తాడు.. ఏపీలో టీడీపీతో కలుస్తాడు. ఏపీలో కూడా తెలంగాణ పరిస్థితి వస్తుంది’ అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు.
ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా ఏఐసీసీ నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం
తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం రేవంత్‌రెడ్డి ఇంకా ఢిల్లీలోనే బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన పేరును ప్రకటించడానికి ముందు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో హైదరాబాద్ నుంచి హుటాహుటిన బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. అప్పటికే హైకమాండ్ ఆయన పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఢిల్లీకి వెళ్లగానే తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మానిక్‌రావు థాక్రేతో పాటు కాంగ్రెస్ ఎంపీ మాణిక్ ఠాగుర్ ను రేవంత్ కలిశారు. ఇక, ఇవాళ ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలతో రేవంత్‌రెడ్డి వరుసగా భేటీ అవుతున్నారు.
రాజ్ భవన్ లో కాంగ్రెస్ నేతలు..
తెలంగాణ రాజ్ భవన్ కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవితో పాటు ఇతర సీనియర్ నేతలు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టు సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కు కాంగ్రెస్ బృందం అందజేసింది. రేపు మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణం స్వీకారం చేయనున్నారని అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని గవర్నర్ ను వారు కోరారు.
దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదు
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డా. బీఆర్. అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మనోహర్ రెడ్డి, కొప్పు భాషాతో పాటు బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఇక, రాజాసింగ్ మాట్లాడుతూ.. 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం మా పార్టీ కార్యాలయంలో నిర్వహించామని చెప్పుకొచ్చారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదు అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.
కన్నీళ్లు పెట్టుకున్న ఉత్తర కొరియా కింగ్ కిమ్ జాంగ్ ఉన్.. ఏం కష్టమొచ్చిందో
ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ తన దేశ మహిళలకు వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన విజ్ఞప్తి చేయగా కళ్లలో నీళ్లు తిరిగాయి. దీంతో అక్కడ ఉన్న మహిళలంతా ఏడవడం మొదలుపెట్టారు. కొరియా నియంత ఉద్వేగానికి లోనైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భావోద్వేగ విజ్ఞప్తిలో కిమ్ జోంగ్ ఉన్ తన దేశంలోని మహిళలను ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలని.. వారిని కమ్యూనిస్టుల వలె పెంచాలని కోరారు. ఈ ప్రసంగంలో ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయి. ఉత్తర కొరియాలోని ప్యోంగ్‌యాంగ్‌లో జరిగిన ఐదవ జాతీయ మదర్స్ కాన్ఫరెన్స్‌లో ప్రసంగించిన కిమ్, ఉత్తర కొరియా తగ్గుతున్న జననాల రేటును పెంచడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
2015 ఉధంపూర్ దాడి ప్రధాన సూత్రధారి పాకిస్థాన్‌లో హతం
పాకిస్థాన్‌లో భారత్ శత్రువుల నిర్మూలన కొనసాగుతోంది. కరాచీలో భారత్‌కు మరో పెద్ద శత్రువు హతమయ్యాడు. 2015లో జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో బీఎస్‌ఎఫ్ కాన్వాయ్‌పై దాడికి ప్లాన్ చేసిన లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) ఉగ్రవాది అద్నాన్ అహ్మద్ అలియాస్ హంజాలా అద్నాన్ హతమయ్యాడు. అతడిని గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. ఇండియా టుడే నివేదిక ప్రకారం.. డిసెంబర్ 2 అర్ధరాత్రి హంజాలా అద్నాన్‌ను గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. మొత్తం నాలుగు బుల్లెట్లు అతని శరీరంలోకి దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. 26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్‌కు అద్నాన్ అత్యంత సన్నిహితుడని తెలుస్తోంది.
24 గంటల్లో సలార్ ట్రైలర్ రికార్డ్స్ ని డంకీ ట్రైలర్ బీట్ చేయలేకపోయింది
ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ ప్రభాస్, బాలీవడ్ బాద్షా కింగ్ ఖాన్ ఎపిక్ వార్ కి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కేవలం ఒక్క రోజు గ్యాప్ లో బాక్సాఫీస్ దగ్గర యుద్ధానికి సిద్ధమయ్యారు. సలార్ డిసెంబర్ 22న, డంకీ డిసెంబర్ 21న రిలీజ్ కానున్నాయి. నిజానికి రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవ్వాల్సి ఉండగా డంకీ సినిమా క్లాష్ ని అవాయిడ్ చేస్తూ ఒక రోజు ముందే విడుదల కానుంది. షారుఖ్, ప్రభాస్ ల మధ్యే కాదు ఈ బాక్సాఫీస్ వార్ మరింత ఇంటెన్స్ గా మారడానికి ఈ రెండు సినిమాల దర్శకులు కూడా కారణమే. సలార్ సినిమాని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు. KGF సినిమాతో రాజమౌళి తర్వాత ఆ స్థాయి దర్శకుడిగా ప్రశాంత్ నీల్ పేరు తెచ్చుకున్నాడు. అలాంటి డైరెక్టర్ కి ప్రభాస్ కలిస్తే ఎలా ఉంటుందో చూడాలి అనే ఉత్సాహం సినీ అభిమానుల్లో ఉంది. ప్రభాస్ కటవుట్ కి సరిపోయే కథని ప్రశాంత్ నీల్ ఇస్తే చాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం గ్యారెంటీ.