*ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో మెడికల్ కాలేజీలను సీఎం ప్రారంభించారు. అనంతరం విజయనగరం వైద్య కళాశాలలో ఫొటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి తిలకించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, విడదల రజినీ, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు ఉన్నారు.వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏపీ సర్కారు నిర్మించనుంది రూ. 8,480 కోట్ల వ్యయంతో మొత్తం17 నూతన ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతోంది. దీంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య భారీగా పెరుగనుంది. ఇప్పటికే ఉన్న 2,185 ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా మరో 2,550 ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి.
*పవన్ కళ్యాణ్ పొత్తు వ్యాఖ్యలపై మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ పొత్తు వ్యాఖ్యలపై మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తులో ఉంటూ టీడీపీతో పొత్తు ప్రకటించటాన్ని రేణూ దేశాయ్ వ్యాఖ్యలతో రోజా పోల్చారు. భార్య ఉండగా వేరే అమ్మాయితో పిల్లలను కంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అని గతంలో అన్న రేణు దేశాయ్ వ్యాఖ్యలతో ఈ పొత్తు వ్యాఖ్యలను పోల్చారు మంత్రి ఆర్కే రోజా. భార్య ఉండగా వేరే అమ్మాయితో పిల్లలను కంటే ఎలా ఉంటుందో ఆలోచించండి అని రేణు దేశాయ్ గతంలో జన సైనికులకు చెప్పారని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటనతో రేణు దేశాయ్ వ్యాఖ్యలు గుర్తుకు వస్తున్నాయన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవటం సన్యాసి, సన్యాసి రాసుకుంటే బూడిద రాలుతుంది లాంటిదేనని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు సంగతి బీజేపీకి తెలుసునని.. బీజేపీతో చర్చించకుండా టీడీపీతో పొత్తు అని పవన్ కళ్యాణ్ ప్రకటించటం పొత్తు ధర్మానికి తూట్లు పొడవటమేనని రోజా వ్యాఖ్యానించారు. 2018లోనే స్కిల్ కుంభకోణం బయటపడిందని ఈ సందర్భంగా వెల్లడించారు. చంద్రబాబు తప్పు చేయలేదని నమ్మితే సీబీఐ, ఈడీ విచారణ చేయమని లేఖ రాయాలన్నారు. ఢిల్లీ వెళుతున్న లోకేష్ అక్కడే ఉన్న ఈడీ, సీబీఐ ఆఫీసుకు వెళ్ళి ఈ కుంభకోణాలపై విచారణ చేయాలని లేఖ ఇవ్వాలని ఆమె సూచించారు. ఎకరం భూమి నుంచి వేల కోట్లు చంద్రబాబుకు ఎక్కడ నుంచి వచ్చాయని మంత్రి ప్రశ్నించారు. వ్యవస్థల్లో చంద్రబాబు మనుషులు ఉండటం వల్లే ఇన్నేళ్ళు తప్పించుకుని తిరిగాడని ఆమె అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల వేదికగా చంద్రబాబు స్కాంలను ప్రజలకు వివరిస్తామన్నారు. అరెస్టు దెబ్బతో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ భాష మారిందని మంత్రి రోజా వెల్లడించారు.
*చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అంతలోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్‌లో ఉండటాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతరబెయిల్‌పై విచారిస్తే క్వాష్ పిటిషన్‌పై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు రెండూ వచ్చే మంగళవారానికి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని సీఐడీ ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించింది. ప్రాథమిక సాక్ష్యాలతో అరెస్ట్ చేసిన వ్యక్తికి మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని సీఐడీ పేర్కొంది. విచారణ చేయాల్సి వస్తే దానికి అర్హత ఉందా లేదా అనేది ముందు విచారణ జరపాలని కోరింది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొచ్చని కోర్టు ముందు వాదనలు చంద్రబాబు న్యాయవాది వినిపించారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ చేయాల్సి వస్తె కౌంటర్‌కు సమయం ఇవ్వాలని, సాయంత్రం 4 గంటలకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ విచారణకు వస్తారని కోర్టుకు సీఐడీ తెలిపింది. ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. విచారణను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
*నిలోఫర్ ఆస్పత్రిలో చిన్నారి అదృశ్యం
నిలోఫర్ ఆస్పత్రి నుంచి ఆరు నెలల చిన్నారి అదృశ్యమైన ఘటన హైదరాబాద్ లో కలకలం రేపుతుంది. చిన్నారి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. 16 గంటలు గడుస్తున్నా చిన్నారి ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బాబు కనిపించకపోవడంతో కన్న తల్లి రోదనలు వినిపిస్తున్నాయి. తన కొడుకును తనకు అప్పగించాలంటూ ఆమె ఆందోళన చెందుతోంది. నాంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నీలోఫర్ ఆస్పత్రి నుంచి 6 నెలల బాబు పైసల్‌ఖాన్‌ను ఓ మహిళ అపహరించింది. గండిపేట క్రాస్ రోడ్డులోని ఓ ఫామ్‌హౌస్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న పైసల్‌ఖాన్ దంపతుల రెండో కుమారుడు. పెద్ద బాబుకు నిద్ర పట్టకపోవడంతో నిన్న మధ్యాహ్నం నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అనంతరం బాబు చికిత్స పొందుతుండగా, రెండో బాబుతో కలిసి మొదటి అంతస్తు వార్డులో అతని తల్లి ఫరీదా భేగం కూర్చున్నారు. అక్కడ పసుపు కండువా కట్టుకుని క్రీమ్ కలర్ నైటీ వేసుకున్న ఓ మహిళ ఫరీదా బేగం వద్దకు వచ్చింది. తర్వాత ఫరీదా బేగంతో కలిసి వివిధ అంశాలపై మాట్లాడింది. అదే సమయంలో భోజనం వడ్డిస్తున్నామని తల్లి ఫరీదాబేగం భోజనం చేసేందుకు వెళ్లింది. ఫరీదా బేగం ఆ మహిళకు బాబును చూడమని చెప్పి వెళ్లిపోయింది. అప్పటి వరకు మాట్లాడిన మహిళ ఫోన్ చూపించి అబ్బాయిని తీసుకుని వెళ్లిపోయింది. తల్లి ఫరీదాబేగం భోజనం తీసుకొని వచ్చి చూసే లోపు ఆ మహిళతో పాటు బాబు ఎక్కడా కనిపించలేదు. అదే సమయంలో అక్కడే ఉన్న మరో మహిళ మీ బాబు ఆమె తీసుకుని వెళ్లిపోయిందని చెప్పడంతో అని చెప్పింది. అయితే ఆమె మీ బంధువు అనుకున్నానని అందుకే తీను మీ బాబును తీసుకుని వెళుతున్న ఏమీ ప్రశ్నించలేక పోయానని తెలిపింది. ఫరీదా ఆసుపత్రి వారికి చెప్పిన ఎవరూ స్పందించకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటా హుటిన ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు ఫరీదా ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. మరోవైపు ఆస్పత్రిలోని సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడంతో కేసు క్లిష్టంగా మారింది. తన బిడ్డను అప్పగించాలంటూ తల్లి ఫరీదా బేగం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
*బీజేపీ బైక్ ర్యాలీ.. పాల్గొన్న కిషన్‌రెడ్డి
తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి నేడు ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో విమోచన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి పరకాల అమరధామ వరకు బైక్ ర్యాలీని కిషన్ రెడ్డి ప్రారంభించారు. బీజేపీ ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. పాఠశాల పుస్తకాల్లో విమోచన పోరాటాన్ని పొందుపరచాలని, సైనికులు మరణించిన స్థలాలను స్మారక చిహ్నాలుగా అభివృద్ధి చేయాలనే డిమాండ్‌తో బీజేపీ బైక్ ర్యాలీ నిర్వహించింది. సికింద్రాబాద్ క్లాక్ టవర్, ఓయూ, తార్నాక, ఉప్పల్, భైరోన్‌పల్లి, ఖిలాషాపూర్, పరకాల మీదుగా బైక్ ర్యాలీ సాగనుంది. ఉస్మానియా యూనివర్సిటీ నుండి పరకాల వరకు బైక్ ర్యాలీ. సాయంత్రం జరిగే బహిరంగ సభలో కిషన్ రెడ్డి పాల్గొంటారు. కిషన్ రెడ్డి బైక్ ర్యాలీ సందర్భంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ బైక్ ర్యాలీలు నిర్వహించింది. పెరేడ్ గ్రౌండ్ లో సెప్టెంబర్ 17 న బహిరంగ సభ.. ముగ్గురు సీఎం లకు ఆహ్వానం… సెప్టెంబర్ 17 విశ్వకర్మ పథకం వరంగల్ లో లాంచింగ్.. అనంతరం అధికారిక కార్యక్రమం తో పాటు, బీజేపీ బహిరంగ సభ రెండు వేర్వేరు.. రెండు కార్యక్రమాలు పెరేడ్ గ్రౌండ్ లోనే.. 9 గంటలకు అధికారిక కార్యక్రమం.. 11 గంటలకు బహిరంగ సభ.. సెప్టెంబర్ 20 నుండి 23 వరకు 450 మందిని సెలక్ట్ చేసి… మండలాల వారీగా పర్యటించనున్నారు. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జాతీయ జెండాను ఎగురవేసి, పారా మిలటరీ బలగాల కవాతులో గౌరవ వందనం స్వీకరించి, తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో వరుసగా రెండో సంవత్సరం కూడా పాల్గొంటారు. అన్ని పోలింగ్ బూత్‌లు, పార్టీ కార్యాలయాల్లో కూడా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అదే రోజున, పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా, మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో రక్తదానం మరియు ఆరోగ్య శిబిరాలతో కూడిన హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తుంది.
*”రామచరితమానస్ సైనైడ్ వంటిది”.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
రామచరిత్ మానస్ మరోసారి వివాదాల్లోకి వచ్చింది. తాజాగా బీహార్ మంత్రి కూడా హిందూ గ్రంథాలపై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పవిత్ర రామచరితమానస్ గ్రంథాన్ని విషపదార్థమైన ‘సైనైడ్’తో పోల్చాడు. ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు పొలిటికల్ దుమారం ప్రారంభమైంది. హిందీ దివాస్ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ బీహార్ మంత్రి చంద్రశేఖర్ బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మీకు 50 రకాల వంటకాలను వడ్డించి అందులో పొటాషియ సైనైడ్ కలిపితే మీరు తింటారా..? హిందూ మత గ్రంథాలది కూడా ఇదే పరిస్థితి’’ అని ఆయన అన్నారు. రామచరితమానస్ పట్ల నా అభ్యంతరం కూడా ధృడమైందని, ఇది నా జీవితాంతం కొనసాగుందని, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా దీన్ని వ్యాఖ్యానించారని ఆయన అన్నారు. కులాల ప్రస్తావన ఉన్నంత కాలం దేశంలో రిజర్వేషన్లు, కుల గణన జరగాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. సీఎం నితీష్ కుమార్ ని టార్గెట్ చేస్తోంది. బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. మంత్రి చంద్రశేఖర్ నిరంతరం రామచరితమానస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, నితీష్ కుమార్ కి వినబడటం లేదా..? అని ప్రశ్నించారు.నితీష్ కుమార్ సనానాన్ని నిరంతరం అవమానిస్తున్నారని విమర్శించారు. చంద్రశేఖర్ కి ఏమైనా ఇబ్బంది ఉంటే మతం మార్చుకోవాాలని సూచించారు. రామచరితమానస్ పై మంత్రి చంద్రశేఖర్ వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఆర్జేడీ పార్టీ కీలక నేత, మంత్రిగా ఉన్న ఈయన రామచరితమానస్ సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని అన్నారు. ప్రేమ, ఆప్యాయతతో దేశం గొప్పది అవుతుంది కానీ రామచరితమానస్, మనుస్మృతి బంచ్ ఆఫ్ థాట్స్ వంటి పుస్తకాలతో కాదని, ఇవి ద్వేషం, సామాజిక విభజన బీజాలను నాటుతాయని అన్నారు. దళితులు, వెనకబడినవారు, మహిళల్ని విద్యకు దూరం చేస్తాయని అన్నారు.
*కన్నకొడుకు కుటుంబాన్ని నిప్పుబెట్టి చంపిన తండ్రి.
కన్న తండ్రి మమకారం మరిచి కసాయిలా మారిపోయాడు. ఇంట్లో జరిగే గొడవలు ఎక్కడైనా సహజం అని తెలిసినా ఆ వ్యక్తి విచక్షణా కోల్పొయాడు. కన్న కొడుకు మీదే పగ తీర్చుకోవాలనుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి కన్న కొడుకు కుటుంబాన్నే కడతేర్చాడు. నిద్రిస్తున్న వారి మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో కొడుకు, మనవడు చనిపోగా కొడలు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ ఘటన కేరళలోని త్రిసూర్ జిల్లాలో వెలుగుచూసింది. జాన్సన్ అనే వ్యక్తి తన కొడుకు జోజి (38) కలిసి ఉంటున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా జాన్సన్ ఏకంగా తన కొడుకు కుటుంబాన్ని మొత్తాన్ని మట్టుబెట్టాలని చూశాడు వారు నిద్రిస్తున్న సమయంలో వారి మీద పెట్రోల్ చల్లి నిప్పు బెట్టాడు. నిద్రలో ఉండటం వల్ల వారు దీనిని పసిగట్టలేకపోయారు. తప్పించుకునే అవకాశం లేకపోవడంతో నిందితుడి కొడుకు జోజి, మనవడు(12) అక్కడికక్కడే చనిపోయారు. కోడు లిజీ మాత్రం 50 శాతం కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతుంది. అర్థరాత్రి ఈ సంఘటన జరగడంతో వారు తప్పించుకోలేకపోయారు. అయితే వారి కేకలు, అరుపులు విన్న పక్కింటి వారు వారిని రక్షించడానికి ప్రయత్నించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కోడలిని వెంటనే ఎర్నాకులంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. అయితే వారికి నిప్పు పెట్టిన నిందితుడు జాన్సన్ కూడా విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతడిని కూడా ఆసుపత్రిలో చేర్పించారు. అతడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. జాన్సన్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. అయితే జాన్సన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతటి దారుణానికి నిందితుడు పాల్పడటానికి కారణం కుటుంబ కలహాలే అని పోలీసులు తెలిపారు.
*మిస్ యూనివర్స్ కావాలనుకునే మోడళ్లకు శుభవార్త..
ప్రతి ఒక్కరికి ఏదో ఒక రంగం పైన ఆసక్తి ఉంటుంది. కొందరు డాక్టర్ అవ్వాలనుకుంటే మరికొందరు యాక్టర్ అవ్వాలనుకుంటారు. కొందరికి బెస్ట్ డాన్సర్ అనిపించుకోవడం ఇష్టం, కొందరికి బెస్ట్ ఇంజినీర్ అనిపించుకోవడం ఇష్టం. అలానే కొందరికి ప్రంపంచం లోనే అందగత్తెగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆశ. ఆ కాంక్షని నెరవేర్చుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తుంటారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించిన కొందరు మాత్రం వాళ్ళ కలని సాకారం చేసుకోలేపోతారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి వయసు. మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనాలంటే కంచితంగా పాల్గొనే వారి వయసు 18 -28 సంవత్సరాలలోపే ఉండాలి. దీనితో చాలంది పోటీలో గెలవడం పక్కన పెడితే కనీసం పాల్గొనే అవకాశం కూడా లేక మిస్ యూనివర్స్ అవ్వాలనే కల తీరక మోడల్స్ గా మిగిలిపోతున్నారు. కానీ ఇకపైన అలాంటి సమస్య లేదు ఎందుకంటే ఇకపైన మిస్ యూనివర్స్ పోటీకి వయోపరిమితి లేదు. విమెన్స్ వెర్ డైలీ న్యూస్ జర్నల్ సమాచారం ప్రకారం.. మిస్ యూనివర్స్ పోటీలకు 2024 వ సంవత్సరం నుండి గరిష్ఠ వయోపరిమితిని ఎత్తేస్తున్నారు. 2022 విశ్వ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్న మిస్ యూనివర్స్ “బోనీ గ్యాబ్రియెల్” న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రస్తావిస్తూ.. మిస్ యూనివర్స్ పోటీలు మొదటిసారి1952లో నిర్వహించారు. ఇప్పటికి ఈ పోటీలు ప్రారంభమై 71 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటికి ఇందులో పాల్గొనే వాళ్ళ వయసు 18-28 మధ్య ఉండాలంటూ కనిష్ఠ-గరిష్ఠ వయోపరిమితిని పాటిస్తున్నారు. దీనివల్ల చాలామంది మిస్ యూనివర్స్ లో పాల్గొనే అవకాశం లేక వెనుదిరుగుతున్నారు అని పేర్కొన్నారు. ఈమె 2022 విశ్వ సుందరి పోటీలో పాల్గొనే నాటికి ఈ సుందరి వయసు 28 సంవత్సరాలు. దీనితో ఆమెకు పోటీలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇదే చివరి అవకాశం అనుకున్న బోనీ పట్టుదలతో విశ్వ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. పోటీలో పాల్గొన్న సమయంలో ప్రశ్న-జవాబుల సెగ్మెంట్లో మిస్ యూనివర్స్ పోటీల అభివృద్ధి కోసం గరిష్ఠ వయోపరిమితిని తీసివేయాలని ఆమె ఓ సలహా ఇచ్చింది. ప్రస్తుతం నిర్వాహకులు ఆమె మాటలకి ఏకీభవిస్తూ గరిష్ఠ వయోపరిమితిని తీసేసారు. కాగా 2023 లో జరిగే మిస్ యూనివర్స్ పోటీలకు వయోపరిమితి ఉంది. 2024 నుండి జరిగే మిస్ యూనివర్స్ పోటీలకు గరిష్ఠ వయోపరిమితి ఉండదు.
చైనా రక్షణ మంత్రి హౌజ్ అరెస్ట్, విచారణ: అమెరికా
జపాన్ లోని అమెరికా రాయబారి రహమ్ ఇమ్మాన్యుయేల్ ఎక్స్(ట్విట్టర్)లో ఓ పోస్టు చేశారు. ‘మొదటిది రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు 3 వారాల నుంచి కనిపించడం లేదు. రెండోది అతడిని గృహనిర్భందంలో ఉంచినందుకే వియత్నా పర్యటనలో కనిపించలేదు, సింగపూర్ నేవీ చీఫ్ తో సమావేశం కాలేదు..?’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇటు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ, రక్షణమంత్రిత్వ శాఖలు ఇప్పటి వరకు స్పందించలేదు. గత వారం వియత్నాం రక్షణ అధికారుల సమావేశం నుంచి షాంగ్‌ఫై హఠాత్తుగా వైదొలిగారు. చివరిసారిగా అతను ఆగస్టు 29న బీజింగ్ లో జరిగిన ఆఫ్రికన్ దేశాల భద్రతా ఫోరమ్ సమావేశంలో కీలక ప్రసంగం చేస్తూ కనిపించారు. ప్రస్తుతం లీ షాంగ్‌ఫుని విచారిస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అనుమానిస్తోంది. లీ చైనాలో ఐదుగురు స్టేట్ కౌన్సిలర్లలో ఒకరు. ఇది సాధారణ మంత్రి కంటే ఉన్నతమైన క్యాబినెట్ హోదా. ఇటీవల కాలంలో చైనా ప్రభుత్వం, సైన్యంలో కీలకంగా ఉన్నవాళ్లంతా కనిపించకుండా పోతున్నారు. గతంలో విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్, ఆ తరువాత రాకెట్ ఫోర్స్ కమాండర్లు తప్పిపోయాయి. జులైలో చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ అదృశ్యమైన తర్వాత షాంగ్‌ఫు అదృశ్యమయ్యాడు.దాదాపు రెండు నెలల క్రితం, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్ నుండి ఇద్దరు టాప్ జనరల్‌లను తొలగించారు, ఇది దేశం యొక్క సాంప్రదాయ మరియు అణు క్షిపణులను పర్యవేక్షిస్తున్న ఎలైట్ ఫోర్స్.