Arvind Kejriwal: మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను మార్చి 21న అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఏప్రిల్ 29న విచారిస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. ఏప్రిల్ 9న ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ హైకోర్టు తన పిటిషన్‌ను కొట్టివేసిన మరుసటి రోజు ఏప్రిల్ 10న కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తాను ఇతరులతో కలిసి కుట్ర పన్నారని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈరోజు కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ కూడా సోమవారంతో ముగియనుంది. సుప్రీం కోర్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం, రిమాండ్ చేయడం కేవలం సహ నిందితుల పరస్పర విరుద్ధమైన ప్రకటనల ఆధారంగానే జరిగిందన్నారు. ఈ సహ నిందితులు ఇప్పుడు ప్రభుత్వ సాక్షులుగా మారారని అన్నారు.
Read Also: Israel-Iran Tensions: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తత కారణంగా చమురు సంక్షోభం మొదలవుతుందా?
ఇదిలా ఉండగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అందించిన వివరాల ప్రకారం, ఏప్రిల్ 9న కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ, ఢిల్లీ హైకోర్టు ఆయన నేరాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించడంలో చురుకుగా పాల్గొన్నాడని పేర్కొంది. ఇప్పుడు రద్దు చేసిన మద్యం పాలసీని రూపొందించడంలో వ్యక్తిగత సామర్థ్యంతో పాటు కిక్‌బ్యాక్‌లు డిమాండ్ చేయడంలోనూ, ఆప్ జాతీయ కన్వీనర్‌గా ఈ కుంభకోణానికి సంబంధించిన కార్యకలాపాల్లో పాల్గొన్నారని కోర్టు పేర్కొంది. సోమవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీహార్ జైలులో కేజ్రీవాల్‌ను కలవనున్నారు.