Rafael Nadal: దీర్ఘకాలిక తుంటిగాయం కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలగుతున్నట్లు రాఫెల్ నాదల్ గురువారం ప్రకటించారు. కెరీర్‌కు సంబంధించి స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ సంచలన ప్రకటన చేశాడు. 2024 తన కెరీర్‌లో చివరి సీజన్ అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. అంతేగాక గాయాలు వెంటాడుతుండడంతో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ బరిలోకి దిగడం లేదన్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌తో సాధించక పోవడంతో ఫ్రెంచ్ ఓపెన్ ఆడడం తనకు సాధ్యం కాదని స్పష్టం చేశాడు. గురువారం మలోర్కాలోని తన టెన్నిస్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాదల్ ఈ వివరాలను వెల్లడించాడు. మరి కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ టెన్నిస్‌లో కొనసాగించాలని భావించినా గాయాలు ప్రతికూలంగా మారాయన్నాడు. 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలిచిన నాదల్.. ఆ టోర్నీకి దూరం కావడం ఇదే తొలిసారి. 2005లో అరంగేట్రం చేసిన తర్వాత మొదటిసారి ఫ్రెంచ్ ఓపెన్‌కు దూరమవుతున్నాడు. వచ్చేనెలలో నాదల్‌కు 37 ఏళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో కెరీర్‌కు ముగింపు పలికే విషయంపైనా, భవిష్యత్ ప్రణాళికలపైనా అతడు స్పష్టత ఇచ్చాడు. కాగా, మే 28న ప్యారిస్‌లోని గారోస్‌లో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ ప్రారంభం అవుతుంది.
జనవరి 18న ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో ఓడిపోయిన తర్వాత నాదల్ మళ్లీ బరిలోకి దిగలేదు. పునరాగమనానికి మరింత సమయం పడుతుందని నాదల్ చెప్పాడు. ఇదిలా ఉండగా.. 2024 సీజన్ తర్వాత ఆట నుంచి తప్పుకోవాలని నిర్ణయించానన్నాడు. అన్ని ఆలోచించాకే నిర్ణయానికి వచ్చానన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ సాధించాలని ఉన్నా గాయాలతో అది సాధ్యం అయ్యే పరిస్థితి లేదన్నాడు. తన కెరీర్‌లో ఫ్రెంచ్ ఓపెన్ చాలా ప్రత్యేకమైందన్నాడు. రొలాండ్ గారొస్‌లో ఇప్పటికే 14 టైటిల్స్ సాధించడం చాలా గర్వంగా ఉందన్నాడు. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించానన్నాడు. జకోవిచ్, ఫెదరర్, ముర్రేతో సహా ఎంతో మంది దిగ్గజాలతో కలిసి టెన్నిస్ ఆడడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తానన్నాడు. ఇక చిరకాల ప్రత్యర్థులు జకోవిచ్, ఫెదరర్‌లంటే తనకు ఎంతో గౌరవమన్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ మెయిన్ డ్రా ఈ నెల 28న మొదలవుతుంది. నిరుడు 36 ఏళ్ల వయసులో నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు. ఆ టోర్నీ నెగ్గిన అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డు సాధించాడు.
Read Also: Madhya Pradesh Polls: కాంగ్రెస్ హామీల వర్షం.. ఉచిత విద్యుత్, మహిళలకు సాయం
ఇదిలావుంటే సుదీర్ఘ కెరీర్‌లో నాదల్ రికార్డు స్థాయిలో 22 సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెర్బియా దిగ్గజం నొవాక్ జకోవిచ్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఏడాది కాలంగా నాదల్‌ను గాయాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. దీంతో అతను ఈ సీజన్‌లో పలు టోర్నమెంట్‌లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. తాజాగా తనకు ఎంతో ప్రత్యేకమైన ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇది నాదల్‌తో పాటు అతని అభిమానులను ఎంతో నిరాశకు గురి చేసింది.